నితీష్ తో బీజేపీ పర్మనెంట్ కటీఫ్ నిజమేనా?
రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి అంటారు. ఇదో నానుడి. అయితే ఈ నానుడి అన్ని సందర్భాలలో నిజం అవుతుందా అంటే లేదు. అందుకు కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి, అంటున్నారు, అది కూడా మరెవరో కాదు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
అవును బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టు కట్టిన, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో మరోమారు చేతులు కలిపే ప్రశ్నే లేదని అమిత్ షా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నితీష్ కుమార్‌కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోయాయని విస్పష్టంగా తేల్చేశారు. నిజానికి, రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణం. అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ ఎన్ని సార్లు పొత్తు పెట్టుకున్నాయో అన్నిసార్లూ విడిపోయాయి. అయినా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నాయి. అలాగే ఇతర పార్టీలు కూడా, ‘చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ’ టైపులో పొత్తులు పెట్టుకోవడం, విడి పోవడం మళ్ళీ కలవడం .. మళ్ళీ విడాకులు .. మళ్ళీ .. ఇలా రాజకీయ చక్రం తిరుగుతూనే వుంది.
అయితే, ఎన్నికల వ్యూహకర్త అవతారం చాలించి, ప్రత్యక్ష రాజకీయాల్లో పాదం మోపేందుకు బీహార్ లో పాదయాత్ర వేస్తున్న ప్రశాంత్ కిశోరే, నితీష్ కుమార్ మళ్ళీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించిన నేపథ్యంలో అమిత్ షా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆ తర్వాత ఏడాదికే 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, నితీష్ పార్టీ జేడీ(యు), పాశ్వాన్ పార్టీ, ఎల్జీపీతో కలిసి ఎన్డీఎ కూటమిగా పోటీ చేసి విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలలో జేడీయు కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా, ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదిలివేసింది. అయితే గత ఆగష్టులో నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు.
ఈ నేపథ్యంలో బీహార్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో గత లోక్ సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని నిలుపు కునేందుకు నితీష్ కుమార్ మీద ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 40 లోక్ సభ స్థానాలకు గానూ ఎన్డీఎ 39 (బీజేపీ 17, జేడీయు 16, ఎల్జీపీ 6 సీట్లు ) గెలుచుకుంది. ఈనేపథ్యంలోనే వెస్ట్ చంపరాన్ జిల్లాలోని లారియాలో జరిగిన ర్యాలీలో అమిత్‌షా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. నితీష్ కుమార్ , బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు.
ప్రధాన మంత్రి కావాలనే కోరికతో బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ తో బీహార్ సీఎం నితీష్ చేతులు కలిపారని అన్నారు. జేడీయూ, ఆర్జేడీలది అపవిత్ర కూటమిగా అభివర్ణించారు.నితీష్ కుమార్‌కు శాశ్వతంగా బీజేపీ తలుపులు మూసేసిందని చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా చేసేందుకు జేడీయూ సుప్రీం అంగీకరించారని, ఆయనే ఆటవిక పాలనగా ముద్ర వేసిన లాలు పాలన మళ్ళీ తెచ్చేందుకు నితీష్ కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పటికప్పుడు మనసు మార్చుకునే నితీష్‌తో భాగస్వామ్యంపై విసుగెత్తిపోయామని, ఇక ఎప్పటికీ ఆయనకి బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు.
''జయప్రకాష్ హయాం నుంచి నితీష్ కాంగ్రెస్, జంగిల్ రాజ్‌పై పోరాడారు. ఇప్పుడు లాలూ ఆర్జేడీ, సోనియా గాంధీ కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపారు. ప్రధాన మంత్రి పదవి కావాలనే ఆశతో అభివృద్ధి వాది నుంచి అవసరవాదిగా మారారు'' అని అమిత్‌షా విమర్శలు గుప్పించారు. బీహార్ పరిస్థితి బాగోలేదని, శాంతిభద్రతలు లేవని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులను చంపుతున్నారని, నితీష్ మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి నిషేధించారని గుర్తుచేశారు. బీహార్‌లో ఆటవిక పాలనకు చరమగీతం పాడాలంటే ఒకే మార్గం ఉందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో నరేంద్ర మోడీని తిరిగి ప్రధానిని చేయాలని అన్నారు. బీహర్‌లో ప్రతి రోజూ ఏదో ఒక హత్య, అత్యాచారం వార్తలు వెలుగుచూస్తున్నాయని, నితీష్ కుమార్‌కు, ఆయన ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.
గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, అయినప్పటికీ ప్రధానమంత్రి ఇచ్చిన మాట కోసం మరోసారి నితీష్‌ను ముఖ్యమంత్రిని చేశారని అమిత్‌షా అన్నారు. బీహార్ వెనుకబాటుతనాన్ని నితీష్, లాలూ ఎప్పటికీ పోగొట్టలేరని, రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదే తగిన తరుణమని అన్నారు. ఇందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. సుమారు అరగంట సేపు చేసిన ప్రసంగంలో సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులు, 370 అధికరణ రద్దు, ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐపైప నిషేధం వంటి అంశాలను అమిత్‌షా ప్రస్తావించారు.అయితే బీజేపీ నిజంగానే, నితీష్ కుమార్ తో శాశ్వత తెగతెంపులు చేసుకుందా? అంటే అది ఇప్పుడే చెప్పలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాగే జెడీయులోని ఆర్జేడీ వ్యతిరేక వర్గాన్ని తమ వైపు తిప్పుకుని, జేడీయులో చీలిక తెచ్చే ఉద్దేశంతో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు.