విపక్షాల ఐక్యత ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు.. మోడీ బలం అదేనా?
posted on Feb 23, 2023 @ 3:41PM
కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది.
ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కారణంగా ఈ చర్చ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని నిలువరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డడానికి సన్నాహాలు చేస్తున్నది. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు ఇప్పటికే ప్రకటించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టించింది. మల్లికార్జున్ ఖర్గే ప్రకటన నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి నడిచే పార్టీలు ఏవన్న చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ పొత్తుల అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొగ్రెసివ్ ఇండియా కోసం కాంగ్రెస్ లీడర్ షిప్ లో ఇప్పటికే టీమ్ సిద్ధం అయిందని గురువారం (ఫిబ్రవరి 23) ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మేరకు కాంగ్రెస్ కూటమిలో 14 పార్టీలు ఉన్నాయి. అవి డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్ఎస్‌యూ, జేఎంఎం, యూఎంఎల్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, వీసీకే, పీడీపీ, ఎన్ సీ, కేసీ, ఎంఎన్ఎం . పరస్పరం గౌరవించుకుంటూ బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందడుగు వేస్తామని మాణికం ఠాకూర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇంకా కలిసి వచ్చే పార్టీలను సైతం స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే మాణికం ఠాగూర్ తాను ప్రకటించిన కూటమి పార్టీల జాబితాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను పేర్కొనకపోవడంపై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కీలకమైన, జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించే సత్తా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను విస్మరించడంలోనే కాంగ్రెస్ కు విపక్షాల ఐక్యత, మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలపై ఉన్న చిత్తశుద్ధి అవగతమౌతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతే కాకుండా ఆ జాబితాలో వామపక్షాలు కూడా కనిపించకపోవడంపై కూడా కాంగ్రెస్ చెబుతున్న ఐక్యతపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సహజంగానే బీఆర్ఎస్ కూడా ఆ జాబితాలో లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీయేతర కూటమి అంటూ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్న సంగతి తెలిసిందే.