ఢిల్లీ మద్యం కుంభకోణం.. కవిత ఉక్కిరి బిక్కిరి
posted on Feb 23, 2023 @ 11:44AM
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు ఏకకాలంలో దూకుడు పెంచాయి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ కుంభకోణం కేసులో ఏ క్షణంలో ఎలాంటి పరిణామం సంభవిస్తుందా అన్న ఉత్కంఠ సామాన్యులలోనే కాదు.. రాజకీయ వర్గాలలో సైతం నెలకొంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 26న సీబీఐ ఢిల్లీ డెప్యూటీ సీఎం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. మరో వైపు ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ ఒకసారి విచారించింది. ఇంకో వైపు ఆమె వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ఇందు కోసం ఈడీ కోర్టు అనుమతి కూడా పొందింది. ఈ నెల 8న బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసి మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో సీబీఐ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్చంద్రరెడ్డిల ఆధ్వర్యంలో నడుస్తున్న సౌత్ గ్రూప్ కు సంబంధించి బుచ్చిబాబును ప్రశ్నలతో సీబీఐ ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఇప్పుడు ఇదే కేసులో బుచ్చిబాబును ఈడీ విచారణ చేయనుంది. ఈడీ, సీబీఐలు రెండూ తమ దర్యాప్తులో ప్రధానంగా కాన్ సన్ ట్రేట్ చేస్తున్న సౌత్ గ్రూప్ లో కల్వకుంట్ల కవిత పాత్ర కీలకం అని ఇప్పటికే ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొన్న సంగతి విదితమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. అంతే కాకుండా ఇదే కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ డిస్టలరీస్ కు కూడా బుచ్చిబాగు గతంలో ఆడిటర్ గా పని చేశారు. ఇదే డిస్టిల్లరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ గురించి కవితతో చర్చించినట్టు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొన్న సంగతి విదితమే. ఈడీ ఇప్పటికే తన చార్జిషీట్ లో కవితకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ పలు అంశాలను ప్రస్తావించింది.
హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీపై 2021 మేలో హైదరాబాద్ లోని కవిత నివాసంలో జరిగిన ఆ సమావేశంలో బుచ్చిబాబు కూడా పాల్గొన్నట్లు ఈడీ ఆరోపించింది. మద్యం కుంభకోణంలో కీలకమైన పాత్ర సౌత్ గ్రూపుదేనని అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసిన సంగతి విదితమే.