వివేకా హత్య కేసు.. గుట్టు రట్టైపోతోందా?.. సీబీఐ అఫిడవిట్ లో సంచలన విషయాలు!
posted on Feb 23, 2023 @ 9:50AM
సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును దాదాపు ఛేదించేసింది. ఆ దర్యాప్తు సంస్థ తెలంగాణ హై కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో హత్యకు ముందు.. తరువాత ఏం జరిగిందన్న విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో హత్య జరిగిన తీరు, హత్య వెనుక ఎవరు ఉన్నారు. హత్య అనంతరం సాక్ష్యాల తారుమారులో అవినాష్ రెడ్డి పాత్ర..ఆయన తండ్రి భాస్కరరెడ్డి ప్రమేయం ఇలా పలు అంశాలను వెల్లడించింది.
దీంతో ఇంత కాలంగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులపై ఉన్న అనుమానాలన్నీ వాస్తవమేనని సీబీఐ పేర్కొన్నట్లయ్యింది. వైఎస్ హత్య పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగిందనీ, వివేకా గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు జరిగిన ప్రయత్నం కూడా ఆ ప్రణాళికలో భాగమేనన్న అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి. సీబీఐ తాజా అఫిడవిట్ లో ఇలా చేసిందెవరన్న క్లారిటీ వచ్చేసింది. హత్య జరిగిన సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ గుట్టు బయటపడే సమయం దగ్గరకొచ్చేసిందని తాజా పరిణామాలను బట్టి అర్దమౌతోంది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కోణంలోనే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఆ అఫిడవిట్ లో కూడా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర, ప్రమేయం గురించి ప్రస్తావించింది.
ఈ నెల 28న న అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న సంగతి విదితమే. ఆ విచారణకు ముందే సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సాక్ష్యాలను మాయం చేసేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారని పేర్కొనడమంటే.. అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధం అవుతోందనే అర్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు.
అదే జరిగితే వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. అవినాష్ ను ఈ నెల 28న విచారించిన తరువాత వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి నుంచి తాడెపల్లి ప్యాలెస్ కు వెళ్లిన ఫోన్ కాల్ వివరాలను కూడా సీబీఐ బయట పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే కింగ్ పిన్‌లు బయటకు రావడం ఖాయమని అంటున్నారు.