విచారణకు సహకరించకుంటే అరెస్టే!?

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న భావనను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో   ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల, ముఖ్యంగా శుక్రవారం (మార్చి 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో పాల్గొనాల్సి ఉంది కనుక తాను శుక్రవారం (మార్చి 9) విచారణకు హాజరు కాలేనని, 15వ తేదీ హాజరవుతానని కవిత ఈడీకి సమాచారం పంపారు. అయితే ఆమె విజ్ణప్తిపై ఈడీ అధికారుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. హోలీ కారణంగా ఈడీ అధికారులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమె పంపిన సమాచారానికి బదులు రాలేదన్న వాదన వినిపిస్తున్నప్పటికీ, ఆమె హస్తినకు బయలుదేరి వెళ్లారు.  మహిళా రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం (మార్చ 10)ధర్నా చేయడం కోసమే ఆమె హఃస్తిన వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా.. ఫర్ సపోజ్ ఆమె వినతి పై ఈడీ నుంచి ఎటువంటి స్పందనా గురువారం ఉదయానికి కూడా రాకపోతే కవిత అనివార్యంగా ఈడీ విచారణకు హాజరై తీరాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకోసమే.. ఎటుపోయి ఎటువచ్చినా ఈడీకి అందుబాటులో ఉండేందుకే ఆమె బుధవారమే హస్తిన బయలు దేరి వెళ్లారని అంటున్నారు. అయితే ఆమె ఈడీ ముందు హాజరవుతారా, లేదా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. మనీలాండరింగ్ ప్రొవిజన్స్ (పీఎంఎల్ఏ) కింద ఈడీ నోటీసులు జారీ అయ్యాయని... విచారణకు సహకరించకపోతే సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు.  అయితే, ముందస్తు బెయిల్ కోసం  హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించే వెసులుబాటు ఉందని తెలిపారు.

కోమటిరెడ్డి కొత్త రాగం!

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువగిరి ఎంపీ కొంటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ మారుతున్నారా? మారే ఆలోచన చేస్తున్నారా? అంటే, అవునని చెప్పలేము.  కాదనీ అనలేము. అయన పార్టీ మార వచ్చు, మారక పోనూ వచ్చు. నిజానికి ఈ చర్చ ఈ రోజుది కాదు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసిన నాటి నుంచి, కోమటి రెడ్డి అసంతృప్తితో రగిలిపోతూనే ఉన్నారు. అలాగే,  అనేక సందర్భాలలో అసంతృప్తి బాహాటంగా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. పార్టీ మారే అలోచన చేస్తున్నారనే వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి.  మరోవంక ఆయన సోదరుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, బీజేపీలో చేరిన తర్వాత అయితే ఆ వదంతులు ఇంకా బలంగా వినిపించాయి. అయినా, వెంకట రెడ్డి పార్టీ మారలేదు. చేయి వదల లేదు. హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు. రాజగోపాల రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగినా, వెంకట రెడ్డి తమ్ముడి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు. అలాగే, కాంగ్రెస్ స్టార్  క్యాంపైనర్ పదవిలో ఉండి కూడా కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి పక్షాన ప్రచారంలో పాల్గొన లేదు. ఆస్ట్రేలియా  వెళ్లి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తిరిగొచ్చారు. అయినా  ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాంటే ఉన్నారు అన్నట్లుగానే ఉన్నారు. అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు, వివాదస్పద వ్యాఖ్యలు  చేయడం మినహా పెద్దగా రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు.   మరో వంక రేవత్ రెడ్డి వర్గం కూడా ఏదో విధంగా  కోమటి రెడ్డిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తూనే వస్తోంది. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ వంటి నాయకులు వెంకట రెడ్డిని రెచ్చగొడుతున్నారు. అయితే,ఆయన ఒకసారి రెచ్చిపోయినా, మళ్ళీ అంతలోనే సర్దుకు పోతున్నారు. తెగే దాకా లాగకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య   టామ్ అండ్ జెర్రీ ఫైట్ నడుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు కాకపోయినా కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని,  అదే సమయంలో ఆయన బీజేపీలో చేరే విషయంలోనూ ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోరని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆశిస్తున్న లేదా అంచనా వేస్తున్న విధంగా హంగ్ అసెంబ్లీ వచ్చి, కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతులు కలిపితే  కోమటి రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారు. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  అప్పుడు ఆయన కాంగ్రెస్ లో కొనసాగడమా, బీజేపీ తీర్ధం పుచ్చుకోవడమా అనే విషయంలో ఓక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో కోమటి రెడ్డి పార్టీ మార్పుపై ఎన్నికలకు నెల ముందు మాట్లాడతా.. అంటూ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

మళ్ళీ అవే చర్చలు.. నేతల తీరుఫై ఉద్యోగుల ఆగ్రహం!

గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ని సార్లు మోసపోయినా మళ్ళీ, మోసం చేసిన ప్రభుత్వాన్నే నమ్ముతున్నారు. అయితే, ఇలా మోస పోతోంది, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, చర్చలకు రమ్మనగానే చంకలు గుద్దుకుంటూ వెళ్లి, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు. అవును, కంచే చేను మేసింది అన్న చందంగా  ఉద్యోగ సంఘాల నాయకులే సర్కార్ తో కుమ్ముక్కై ఉద్యోగులను మోసం చేస్తున్నారనేది ఎవరో చేసిన ఆరోపణ కాదు. ఉద్యోగులే వ్యక్తం చేస్తున్నఆవేదన. గతంలో ఉద్యోగులే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు బహిరంగంగా ఉద్యోగ సంఘాల నేతలపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకూ సిద్దమయ్యారు. ఇప్పడు కూడా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆట బొమ్మల్లా  వాడుకుంటోంది. ఇది ఆరోపణ కాదు, రుజువైన వాస్తవం. పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. హామీలు ఇచ్చింది. కానీ, ఇంతవరకు కనీసం   ఉదాహరణగా చెప్పుకునేందుకు అయినా ఏ ఒక్క హామీనీ  పక్కాగా నూటికి నూరు శాతం అమలు చేయలేదు. కానీ, ఉద్యోగులు అడగని, పదవీ విరమణ వయోపరిమితిని పెంచి, అదే మహా ప్రసాదం అన్నరీతిన ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నిజానికి వయోపరిమితి పెంపు నిర్ణయం, ఉద్యోగులకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం కాదు. 2019 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించలేని స్థితిలో.. రిటైర్మెంట్ వయసును పెంచారు.  ఇలా ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినా, ఉద్యోగ సంఘాల నాయకులు  మాత్రం ఏమి ఆశిస్తున్నారో, ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో  కానీ, ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి  ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  నిజానికి, ఉద్యోగ సంఘాలు గొంతెమ్మ కోరికలు ఏవీ కోరడం లేదు. వారు అడుగుతున్న దల్లా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమనే. అవసరాల కోసం  ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్ సొమ్ములను జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. అన్నిటినీ మించి వేతన జీవులు కోరుతున్నది  నెల జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ , పెండింగ్‌ డీఏల చెల్లింపు, సీపీఎస్‌ రద్దు , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు, సీపీఎస్‌ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసుల మాఫీ వంటివే వారి డిమాండ్లు. అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి  నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ  ఉద్యోగ సంఘాల నాయకులు, తగుదునమ్మా అని, చేతులు కట్టుకుని మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏమో  ఉద్యోగులకు ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు  ప్రవర్తిస్తోంది. ఈ ( మార్చి) నెలాఖరులోపు  మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు.  కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కాబట్టి, చర్చల పేరున మరో మారు ఉద్యోగులను మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందనే ఉద్యోగులు అనుమానిస్తున్నారు.   ఉద్యోగుల జీతాలకే దిక్కులేని ప్రభుత్వం రూ. 3000 కోట్లు చెల్లించడం అయ్యే పని కాదు. అందుకేమ ఉద్యోగులు  అంత మొత్తాన్ని  ఎక్కడ నుంచి తెస్తుందో చెప్పాలని అంటున్నారు. నిజానికి  గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వస్తే,  సీపీఎస్ రద్దు అవుతుందని.. ఊహించనంత ఫిట్ మెంట్‌తో పీఆర్సీ ఇస్తారని డీఏలు ఆపరని.. ఇలా రకరకాలుగా ఉద్యోగులు ఊహించుకున్నారు. కానీ, అనుకున్నదొకటి అయితే అయింది మరొకటి అన్నట్లుగా  జగన్ రెడ్డి పాలనలో  చివరకు జీతాలకే దిక్కులేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరోవంక ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించారు. అయినా నేతలు కిమ్మనలేదు. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు తమను మోసం చేస్తున్నారని,   తాము మోసపోయామని ఉద్యోగులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సర్కార్ ను  సేవ్ చేందుకు అవసరం వచ్చినప్పుడు ఉద్యమం అంటున్నారు, అంతలోనే చల్లబడి పోతున్నారని  ఉద్యోగులు అంటున్నారు. అలాగే, ఈ సమస్యలు అన్నిటికీ  ఒకటే సమాధానం అంటున్నారు. మోసం చేసిన  ప్రభుత్వాన్ని సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వారు వచ్చారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

చాగంటి.. ఔనని కాదన్నారా?.. ఔననలేక కాదన్నారా?

పిలిచి పిల్లనిస్తానంటే వద్దనే వారు ఉంటారేమో కానీ, కుర్చీ వేసి పదవి ఇస్తామంటే వద్దనే వారు సహజంగా ఉండరు. నిజానికి, సర్కార్ పదవుల కోసం చాలామంది చాలా రకాల పైరవీలు చేయడం, లక్షల రూపాయల కానుకలు సమర్పించుకోవడమూ తెలియని విషయాలు కావు.  కానీ, అందరూ అలానే ఉండరు. పదవి వలన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారుతుందని భావించడం వల్లనో లేక పదవికి తమ ప్రవృత్తికి పొంతన కుదరని కారణంగానో వచ్చిన పదవిని వద్దని తిరస్కరిస్తారు.  ప్రముఖ ప్రవచన కర్త  చాగంటి కోటేశ్వరరావు అదే చేశారు. చాగంటిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రతిపాదనను టీటీడీ  ద్వారా ఆయనకు తెలియచేసింది. అయితే  చాగంటి సర్కార్  ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరిస్తూనే చురకలు కూడా అంటించారు. టీటీడీ బోర్డు సభ్యులు, చైర్మన్, కార్యనిర్వహణాధికారి వంటి అన్నీ తెలిసిన సర్వజ్ఞులకు సందేహాలు రావడం ఏమిటి.. నేను సలహా ఇవ్వడం ఏమిటి, అలాంటి అవసరమే రాదు.. ఒక వేళ వచ్చినా అది తీర్చగల సామర్ధ్యం తనకు ఉందో లేదో అని వినమ్రంగా సూదులు గుచ్చారు. అలాగే, టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులే అవసరం లేదని  తిరుమల వేంకటేశ్వరుని సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తానని.. టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా స్వామి సేవకు సిద్ధంగా ఉంటానని, పదవి మాత్రం వద్దని స్పష్టం చేశారు.   నిజానికి, గతంలో చాగంటి (వంటి) వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించాలని హిందూ ధార్మిక సంస్థలు, శ్రీవారి భక్తులు ఎన్నో విజ్ఞప్తులు చేశారు. రాజకీయాలకు అతీతంగా, హిందూ ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నవారినే టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమించాలనే ప్రతిపాదనలూ వచ్చాయి. కానీ, ప్రభుత్వం భక్తుల అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి సొంత బాబాయిని చైర్మన్ గా నియమించింది. అలాగే  మత విశ్వాసాల పరంగా  అనుమానస్పద వ్యక్తులనూ బోర్డు సభ్యులుగా నియమించారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, బోర్డు చైర్మన్ సహా కొందరు సభ్యుల మత విశ్వాసాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమైనా,  జగన్ రెడ్డి అవేవీ పట్టించుకోలేదు. రెండవసారి కుడా బాబాయ్  నే టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఒక విధంగా టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారనే  ఆరోపణలున్నాయి. ఇక టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు  ఏడుకొండలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు జరుగుతున్న కుట్రల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. అందుకే చాగంటి వారు సలహాదారు పదవిని తిరస్కరించి ఉంటారని హిందూ ధర్మం పట్ల విశ్వాసమున్న భక్తులు భావిస్తున్నారు.  అయితే, పదవిని తిరస్కరించిన చాగంటి  సతీసమేతంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఏమి మాట్లాడారు? ఈ విషయంలో ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పడు ఎందుకు ఒక్కసారిగా తెరపైకొచ్చి,  పదవి  వద్దనే ప్రకటన చేశారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి జనవరి 21న హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా  మీడియా వేదికగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు అప్పట్లో సుబ్బారెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సలహాదారు పదవిని ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత చాగంటి సీఎం జగన్‌ను కలిశారు. కృతజ్ణతలు తెలియజేశారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో చాగంటి టీటీడీ పదవిని ఇలా తిరస్కరించడంతో ఆయన కాదనలేక అవునన్నారా? అవుననలేక కాదన్నారా?అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకరో ఇద్దరో కాదు, వందల మందిని సలహాదారులుగా నియమించింది. ఇందులో చాలా వరకు, జగన్ పల్లకీ మోసే  రాజకీయ నాయకులు, ఆయనకు వంతపాడిన, పాడుతున్న జర్నలిస్టులే ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్  హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో, సలహాదారుల నియామకలకు సంబంధించి  జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే, ఇంతకాలం  తమ ప్రవచనాల ద్వారా హిందూ సమాజానికి మార్గదర్శనం చేసున్న చాగంటి   వ్యక్తిత్వం పై మచ్చపాడే ప్రమాదం వుంది. అందుకే ఆయన ఆ పదవిని తిరస్కరించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అలాగే  జగన్ రెడ్డి గతంలో హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు స్వరూపానంద స్వామిని ఉపయోగించున్నారు, ఇప్పడు చాగంటిని ఉపయోగించుకునే వ్యూహం తో ఆయనకు పదవి ఆశ చూపారని కూడా వార్తలు వచ్చాయి. ఈ రాజకీయ కుట్రను ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్న చాగంటి, పదవి వద్దన్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఏదైనా చాగంటి   మెత్తని చెప్పుతో సున్నితంగా చెప్పవలసింది చెప్పారనే మాటే గట్టిగా వినిపిస్తోంది.

మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం (మార్చి 9)న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో  సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో పదేపదే కవిత ప్రస్తావన రావడంతో ఆమెను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా అరెస్టు, ఆ వెంటనే హైదరాబాద్ కు పారిశ్రామిక వేత్త రుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తరువాత ఇక తరువాయి కవితేనన్న ప్రచారం విస్తృతంగా జరిగింది.   తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సన్నిహితులు, బి నామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకరొకరినీ అరెస్టు చేసిన నేపథ్యంలోఆమెను కూడా అరెస్టు చేస్తారన్న అభిప్రాయం కూడా పొలిటిలక్ సర్కిల్స్ లో వ్యక్తమైంది.  అందుకు బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు ఈడీ కవితకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చింది. ముఖ్యంగా అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించడం, అలాగే మనీష్ సిసోడియాను ఈడీ విచారించడంతో ఆమెకు నోటీసులు ఖాయమన్న భావన వ్యక్తమైంది. అయితే ఆమెను ఎప్పుడు విచారణకు పిలుస్తారన్న విషయంలో ఉన్న సందిగ్ధతకు ఇప్పుడు తెరపడింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ కవితను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మంది అరెస్టయ్యారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు కవితకు నోటీసు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం విపక్షాలను అణచివేసేందుకు ఉపయోగిస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు విపక్ష నేతలు ప్రధాని మోడీకి లేఖ రాసిన ఒక రోజు వ్యవధిలోనే కవితకు ఈడీ నోటీసులు జారీ కావడం గమనార్హం.  

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ!

విశాఖ వేదికగా జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఘాత్మకంగా అనే కంటే హడావుడిగా, ఆర్భాటంగా రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాధించిందేమిటన్న దానిపై భిన్న వాదాలు, అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. అవన్నీ పక్కన పెడితే అధికారంలో ఉన్న నాలుగేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీసమెత్తు ప్రయత్నం చేయని జగన్ సర్కార్.. తీరా ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ఇంత హడావుడిగా, ఆర్భాటంగా నిర్వహించడమే విడ్డూరం. మామూలుగానే ఇలాంటి సదస్సుల్లో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ తమ పెట్టుబడులను గ్రౌండ్ చేస్తాయన్న నమ్మకం లేదు. సదస్సు వేదికగా  పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు ప్రకటించడం షరామామూలుగానే జరుగుతుంటుంది. అయితే ఆ తరువాత పెట్టుబడుల వచ్చాయా లేదా అన్నది ఎప్పటికో కానీ తెలియదు. ఇక జగన్ సర్కార్ తన అధికారం చివరి సంవత్సరంలో నిర్వహించిన ఈ సదస్సు ప్రధాన లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణ కంటే  రాజకీయంగా పట్టు, పలుకుబడి సంపాదించడానికి, రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో చేస్తున్నామని జనాన్ని నమ్మించడానికేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.  ఇటీవలి కాలంలో జగన్ పట్ల, ఆయన సర్కార్ పట్ల ప్రజలలో ఇమేజ్ మసకబారిన నేపథ్యంలో దానిని పెంచుకోవడానికే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర ఓ కార్యక్రమం నిర్వహించారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయంటూ ఆర్భాటపు ప్రకటనలే తప్ప వాస్తవంగా కుదిరిన ఒప్పందాలేమిటి? ఆ ఒప్పందాలు కుదిరిన  కంపెనీల జాబితా ఏమిటి? ఏయే రంగాలలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అన్న వివరాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గతంలో గుజరాత్‌, మహారాష్ట్రలలో   ఆర్భాటంగా సమ్మిట్ లు నిర్వహించి అప్పట్లో ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు తమ ఇమేజ్ ను పెంచుకున్నాయి.   అదే దారిలో ఇప్పడు ఏపీలో జగన్ సర్కార్ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించింది. 13 లక్షల కోట్ల రూపాయల మేరకు 342 అవగాహనఒప్పందాల మీద సంతకాలు జరిగాయని ప్రకటించింది.  అయితే ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ ఓ 74 కంపెనీల పేర్లు ప్రకటించింది. ఆ కంపెనీల చరిత్ర ఏమిటీ, వాటి సత్తా ఏమిటి అన్న విషయంలో సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవి ప్రకటించిన పెట్టుబడులకు, వాటి వాస్తవ ఆర్థిక పరిస్థితికి పొంతన లేదన్నట్లుగానే ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో లేని కొన్ని కంపెనీలు, కొందరు పారిశ్రామిక వేత్తలూ కూడా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్పు వేదికగా తాము ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. మరి వాటి పేర్లు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఎందుకు లేవన్నది ఇప్పటివరకూ అయితే సమాధానం దొరకని ప్రశ్నే. ఇక ఈ ఇన్వెస్టర్ల సదస్సు వెనుక పెద్ద భూ కుంభకోణానికి స్కెచ్ ఉందన్న ఆరోపణలూ వినవస్తున్నాయి. పెట్టుబడులు గ్రౌండ్ అవ్వడంతో సంబంధం లేకుండా కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టే కుట్ర దాగుందని పలువురు విశ్లేషణలు చేశారు. ఇక అన్నిటికీ మించి ఈ సదస్సులో హైలైట్ అయ్యిందేమిటంటే.. భోజనాల దగ్గర ఇన్వెస్టర్ల తోపులాట, సదస్సు కిట్ల కోసం జరిగిన తొక్కిసలాట. వేల, లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలైతే.. ఇలా తోపులాటలు, తొక్కిసలాటలూ జరిగేవా? వారంతా హుందాగా వ్యవహరించేవారు కదా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఐప్యాక్ సభ్యులేనంటూ కొన్ని ఫొటోలను కూడా విపక్షాలు మీడియాకు విడుదల చేశాయి. ఏమి ఏమైనా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ చేసిందన్న అభిప్రాయమే గట్టిగా వ్యక్తమౌతోంది.  

కోడికత్తి కేసు వాయిదాకు జగన్ గైర్హాజర్.. విచారణ వాయిదా!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (మార్చి 7)  జరిగింది.  అయితే కోర్టు గత విచారణ సందర్భంగా విస్పష్టంగా ఆదేశించినా ఈ కేసులో బాధితుడు జగన్  హాజరు కాకపోవడంతో విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితుడు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మరో మారు ఆదేశించింది. గత జనవరి 31న ఈ కేసు ఎన్ఐఏ కోర్టు ముందకు విచారణకు రాగా అప్పుడు కూడా జగన్ హాజరుపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.   తదుపరి విచారణకు ఈ కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. అసలు కేసు వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేత జగన్ పై కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.   ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు చేస్తోంది.  2019 ఆగస్టు 13న ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.  కేసు విచారణలో భాగంగా ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు మంగళవారం (జనవరి 31) ఆదేశించింది.  అలాగే   ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను కూడా హాజరు పరచాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో 3వ సాక్షిగా ఉన్న జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గత విచారణలో కూడా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు   ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదని  ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.   బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది.  కోడికత్తి కేసులో తనపై చేసిన దాడిలో నిందితులకు శిక్ష పడాలంటే జగన్ కోర్టుకు హాజరు కావాలి. అయితే జగన్ మాత్రం ఈ కేసులో బాధితుడిగా   కోర్టుకు వెళ్లడం లేదు. ఎన్ ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణకు వచ్చిన ప్రతి సారీ  బాధితుడు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశిస్తున్నారు. అయినా జగన్ ఖాతరు చేయడం లేదు.తాజాగా మంగళవారం (మార్చి 7) జరిగిన విచారణకు కూడా సీఎం జగన్ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగుతోంది. ఈ ఘటన జరిగి నాలుగేళ్లు దాటిపోయింది.  చార్జిషీటు దాఖలు అయ్యింది. ప్రతీ వాయిదాకు   నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరు పరుస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ కూడా ఈ సారి హాజరయ్యారు. ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది. మరోసారి బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఎన్ఐఏ కోర్టు..తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. బాధితుడు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప విచారణ ముందుకు సాగదు. ఈ కేసులో నిందితుడిగా నాలుగేళ్లుగా కటకటాల వెనుక ఉన్న నిందితుడికి కనీసం బెయిలు కూడా రాదు. ఎందుకంటే..ఇది ఎన్ఐఏ కేసు.. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ.. ఈ కేసు విచారణ ఎన్ఐఏకు అప్పగించారు.  ఇక తాజా విచారణలో అప్పట్లో జగన్ పై దాడికి ఉపయోగించిన  కోడి కత్తి గురించి సైతం ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. ఈ కేసులో బాధితుడైన జగన్  కోర్టుకు హాజరై.., జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తేనే కేసు విచారణ  కొలిక్కి వస్తుందంటున్నారు. మరి తనపై దాడి చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చేయడానికైనా జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. తాను నిందితుడిగా ఉన్న కేసులలో హాజరుపై మినహాయింపు కోరుతున్న జగన్ తాను బాధితుడిగా ఉన్న కేసులోనూ కోర్టుకు హాజరు కావడానికి ఎందుకు సుముఖంగా లేరన్నది ఆయనే చెప్పాల్సి ఉంది. కాగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్ర‌మ్మ గత ఏడాది జులైలో అప్పటి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌కు తన కుమారుడిని విడుదల చేయాలంటూ లేఖ రాశారు. నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న కుమారుడు రిమాండ్ ఖైదీగానే ఉన్నాడనీ, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకానీ, న్యాయ‌స్థానం కానీ  విచార‌ణ జ‌ర‌ప‌డంలేద‌ని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

విదేశీ గడ్డపై ఇవేమి వ్యాఖ్యలు.. రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ ( బ్రిటన్) పర్యటన వివాదాస్పదంగా మారింది. విదేశీ గడ్డపై నుంచి రాహుల్ గాంధీ దేశ అంతర్గత రాజకీయ విభేదాలను ప్రస్తావించడం, దేశ అంతర్గత విషయాల్లో విదేశాల జోక్యం చేసుకోవాలని కోరడం ఏమిటని  బీజేపీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ, రాహుల్ గాంధీ భారత దేశాన్ని అవమానిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌కు వెళ్ళి భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఒకవేళ ఈ వ్యాఖ్యలను సమర్థించకపోతే, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేయాలని కోరారు. నిజానికి, బీజేపీ నాయకులు మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకులు కూడా  రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సంర్ధించేందుకు వెనకా ముందు అవుతున్నారు.  రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, యూరోప్, అమెరికా దేశాలు భారత దేశం నుంచి వ్యాపార, వాణిజ్యాలను, ఆదాయాన్ని పొందుతున్నాయని, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశాలు చేయవలసినంత చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బ్రిటన్‌  ప్రసంగాల్లో భారత దేశాన్ని అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరడం అత్యంత బాధ్యతారహితమని, దీనిపై ఖర్గే, సోనియా గాంధీ తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన దివంగత ఏకే ఆంటోనీ అధికారికంగా చైనాపై తెలిపిన వైఖరిని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవడం లేదు  అని ఆంటోనీ గతంలో అన్నారని ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో మాట్లాడుతూ, చైనా ముప్పును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అర్థం చేసుకోవడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ప్రసాద్ ఈ ప్రస్తావన చేశారు.    ప్రస్తుతం బ్రిటన్పర్యటనలో ఉన్న రాహుల్.. బీజేపీ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కెస్తున్నారని.. మైకులు ఆఫ్‌ చేస్తున్నారని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అగ్గి  రాజేశాయి.. ఇతర దేశాల్లో రాహుల్ ఈ విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పార్లమెంట్‌  అటెండెన్స్‌పై ఆసక్తికర గణాంకాలు బయటకువచ్చాయి. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్‌లో రాహుల్ అటెండెన్స్‌ను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. భారత్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా కంచన్‌ గుప్తా కొట్టిపారేశారు. పార్లమెంట్‌లో తమ మైక్‌లు పని చేస్తాయి.. కానీ వాటిని ఆన్ చేయలేమని.. తాను మాట్లాడుతున్నప్పుడు ఇది చాలాసార్లు జరిగిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ జీరో అటెండెన్స్‌ ఉన్నప్పుడు సైతం భారత్‌ పార్లమెంట్‌ సమావేశాలు మొత్తం జరిగాయని కంచన్ గుప్తా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తమ పేలవమైన పని తీరును కప్పిపుచ్చుకునేదుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్ అటెండెన్స్‌ డేటాను ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ హాజరు కేరళ సగటు కంటే చాలా తక్కువగా ఉందని కంచన్ గుప్తా వరుస ట్వీట్లలో ఆరోపించారు. జాతీయ సగటు కంటే కూడా ఆయన హాజరు శాతం చాలా తక్కువ అని విమర్శించారు. 2020లో పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో రాహుల్ గాంధీ హాజరు శాతం జీరోగా ఉందన్నారు. ఓవరాల్‌గా రాహుల్ పార్లమెంట్ అటెండెన్స్‌ 52శాతమేనని.. అదే సమయంలో మొత్తం ఎంపీల హాజరు శాతం 79గా ఉందన్నారు. భారత పార్లమెంటులో 2019 నుంచి 2023 మధ్య రాహుల్ గాంధీ 92 ప్రశ్నలు అడిగారని.. ఇందుకు సంబంధించి కేరళ ఎంపీల సగటు 216గా, జాతీయ సగటు 163గా ఉందని విమర్శించారు. సగటున భారత్‌ ఎంపీలు 68 చర్చల్లో పాల్గొంటే.. రాహుల్ గాంధీ స్కోర్ దారుణంగా 6 మాత్రమే ఉందని వరుస ట్వీట్లలో ఫైర్ అయ్యారు. దీంతో ట్విట్టర్‌లో బీజేపీ మద్దతుదారులు సైతం కంచన్ గుప్తా ట్వీట్లను రీట్వీట్ చేస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

మోడీపై మరో లేఖాస్త్రం

 ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై విపక్ష పార్టీలు విర్సుకు పడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సిఎం మాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ మరికొందరు ముఖ్య నేతలు  సిసోడియా అరెస్ట్ ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, చాలా కాలంగా మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, డిఎంకే,వామపక్ష పార్టీలు మాత్రం సిసోదియా అరెస్ట్ ను అంతగా ఖండించలేదు.  కాగా  తాజగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  మంగళవారం(మార్చి 7) ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే, విజయన్ సిసోడియా అరెస్ట్ ను ప్రత్యక్షంగా తప్పు పట్టలేదు, ఖండించనూ లేదు. రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలకు తావిచ్చే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని అన్నారు. వాటిని తొలగించేందుకు కృషి చేయాలని ప్రధానిని కోరారు. నిర్దిష్ట చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయాలకు సిసోడియా అరెస్టు మరింత ఊతమిస్తోందని అన్నారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై  ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. సిసోడియా కేసులో నగుదు స్వాధీనం చేసుకోవడం వంటి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆప్ నేత సీబీసీ సమన్లతో విచారణ ముందుకు కూడా హాజరయ్యారని ప్రధానికి రాసిన లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. విచారణకు ఆటంకం కలుగుతోందని భావించినప్పుడు మాత్రమే అరెస్టు అనివార్యమవుతుందని, అలా కాని పక్షంలో అరెస్టు జోలికి వెళ్లక పోవడమే సబబని అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం నగదు పట్టుబడటం వంటి ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాలు లేవని, చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందేనని, అయితే రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే విస్తృతాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకునే విధంగా చర్యలు ఉంటాలని అన్నారు. రాజకీయ కారణాలే ఇందుకు కారణమా అనే అపోహలను తొలగించాలని ప్రధానిని కోరారు. సమాఖ్య స్ఫూర్తి, సిద్ధాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కేసు విచారణలో ఉన్నందున దాని మంచిచెడ్డలపై తాను మాట్లాడదలచుకోలేదని విజయన్ అన్నారు. న్యాయం జరగడమే కాదు...న్యాయం జరిగేలా చూడటం కూడా సహజన్యాయ సూత్రంలో కీలకమని చెప్పారు. రాజకీయాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రస్తుత అభిప్రాయాలను తొలగించేందుకు ప్రధానమంత్రి మార్గదర్శకంగా ఉండగలరన్న ఆశాభావాన్ని ఆయన తన లేఖలో వ్యక్తం చేశారు.  కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం, సిసోడియా అరెస్ట్ విషయాన్ని పక్కన పెడితే, ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు ప్రధాని  మోడీకి  లేఖ రాసిన రెండు రోజుల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అదే అంశం పై ప్రధానికి ప్రత్యేకంగా లేఖ రాయడం, ప్రతిపక్ష రాజాకీయ శిబిరంలో విబెధాలకు అద్దం పడుతోంది, విపక్ష పార్టీల్లోని విభేదాలను మరో మారు చర్చకు తెచ్చిందని  అంటున్నారు. అలాగే, విపక్ష పార్టీలు కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక, తటస్థ గ్రూపులుగా చీలి పోయిన వైనం స్పష్టమవుతోందని అంటున్నారు.

పిళ్లే ఆరెస్ట్.. హు ఈజ్ నెక్స్ట్ ?

ఢిల్లీ మద్యం కుంభకోణం రోజుకో  కొత్త మలుపు  తిరుగుతోంది. ఓ వంక సీబీఐ, మరోవంక ఈడీ విచారణ వేగం పెంచాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబదించి సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో పదేపదే ఒకటికి పదిసార్లు ప్రస్తావనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె,  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సన్నిహితులు, బి నామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకరొకరు అరెస్టవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ  శ్రేణులు, ముఖ్యంగా ముఖ్య నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.  నిజానికి, వంద రోజులకు పైగానే ఢిల్లీ మద్యం కుంభకోణం స్టొరీ నడుస్తున్నా, కవితను సీబీఐ విచారించినా, ఇంతవరకు కేసు విషయంగా పెదవి విప్పని ముఖ్యమంత్రి కేసీఆర్  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ తర్వాత పెదవి విప్పారు. ఈ కేసులో లేదా ఇతర అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ చిక్కుల్లో చిక్కుకున్న మరి కొన్ని పార్టీల నాయకులతో కలసి  ప్రధానమంత్రికి లేఖ రాశారు. మరో వంక కవిత టీవీ ఇంటర్వ్యూల ద్వారా తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లేందుకు సిద్దమంటూనే, కేంద్ర ప్రభుత్వం, ప్రధానీ మోడీ  బీఆర్ఎస్ ను  రాజకీయంగా దెబ్బతీసేందుకే సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.    సరే, అదలా ఉంటే.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. ఆయనను కల్వకుంట్ల కవిత బినామీగా ఈడీ అధికారులు చెబుతున్నారు. నిజానికి మూడు రోజుల కిందటే సీబీఐ కేసుల్లో పిళ్లైకి ముందస్తు బెయిల్  వచ్చింది. కానీ సోమవారం (మార్చి 6) రాత్రి పొద్దుపోయాకా ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు కవిత కుటుంబంతో పాటు అభిషేక్ బోయినపల్లి కుటుంబం, అరుణ్ రాంచంద్ర పిళ్లై కుటుంబం వెళ్లారు.  ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ అరెస్టయ్యారు.  కాగా డిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరుణ్‌ పిళ్లై 17 పేజీల రిమాండ్‌ రిపోర్డులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది.  ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని పేర్కొంది. సౌత్‌ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌రెడ్డితోపాటు వైకాపా ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ధి కోసం ఆరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారు. ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు అరుణ్‌ పిళ్లై దర్యాప్తులో అంగీకరించారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించారు. అరుణ్ పిళ్లై కవిత బినామీ అని విచారణలో పలు మార్లు చెప్పారు. ఇదే విషయాన్ని మరి కొందరు కూడా చెప్పారు. మద్యం విధానం రూపకల్పనలో పిళ్లై కీలక పాత్ర పోషించారు అని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ వ్యక్తుల సంస్థలన్నీ కలిసి రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ తెలిపింది. కాగా జరుగతున్న పరిణామాలను గమనిస్తే, సీబీఐ, ఈడీలు చాలా పకడ్బందీగా కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనూ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ కవిత పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. కానీ ప్రతీ చార్జిషీటు, అఫిడవిట్‌లో కవిత పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. సౌత్ లాబీ పేరుతో ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆమె బినామీలదేనని సీబీఐ అధికారులు చెబుతున్నారు. దీనిపై కవితను ఓ సారి మాత్రమే ప్రశ్నించారు. గతంలో అసలు తన పాత్రే లేదని చెబుతూ వచ్చిన కవిత.. అరెస్టయిన వారు పరిచయస్తులని చెబుతున్నారు. వారు తనకు తెలిసినంత మాత్రాన తన లిక్కర్ స్కాంతో సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తెలుగు మీడియా ముందు ఆమె తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే, ఎప్పుడన్నది పక్కన పెడితే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

లోకేష్ తో అడుగు కలిపిన వంగవీటి రాధా.. పార్టీ మార్పు వదంతులకు ఫుల్ స్టాప్

 కాపు నేత, దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారంటూ ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో రాధా ఇంత వరకూ నోరు విప్పలలేదు. తెలుగుదేశంలో కొనసాగుతున్నా ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు అందరిలోనూ కలిగేంత రేంజ్ లో ఈ ప్రచారం జరిగింది. అయితే ఇంత కాలంగా జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేననీ, ఆయన తన చేతల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అడుగు కలపడం ద్వారా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఆ పార్టీలోనే కొనసాగుతానని వంగవీటి రంగా స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న లోకేష్‌ పాదయాత్రలో వంగవీటి రాధా కనిపించారు. ఆయనతో పాటు కలిసి నడిచి తన సంఘీభావం తెలిపారు.  దీనితో వంగవీటి రాధా జనసేనలో చేరుతున్నారంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో తెలుగుదేశం కార్యక్రమాలలో వంగవీటి రాధా పెద్దగా చురుగ్గా, క్రియాశీలంగా కనిపించకపోవడంతోనే ఆయన పార్టీ మారుతున్నారా అన్న వదంతులకు ఆస్కారం ఏర్పడింది. రధాకు మిత్రులుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వినవచ్చాయి. అయితే ఆయన పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించడంతో ఈ వదంతులన్నిటికీ చెక్ పడినట్లైంది. వంగవీటి రాధా తండ్రి దివంగత వంగవీటి రంగాకు విజయవాడలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉంది.   రంగా కన్నుమూసిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికలోనూ   గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్ గా రంగా పేరు నిలిచిందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొంత కాలంగా బెజవాడ రాజకీయం మొత్తం రాధా చుట్టూ తిరుగుతూ వచ్చింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే రాధా పార్టీ మార్పు విషయంలో ఇంత కాలం షికార్లు చేసినవన్నీ వదంతులేనని ఆయన లోకేష్ కు సంఘీభావం ప్రకటించడంతో తేలిపోయింది.  

మళ్ళీ కమలం వైపుకు పొంగులేటి చూపు?

తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం జిల్లా కేంద్ర బిందువుగా మారుతోందా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  అధికార బీఆర్ఎస్ మొదలు కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా, నిన్నమొన్న పుట్టిన వైఎస్సార్  టీపీ వరకు పార్టీలన్నీ ఖమ్మం జిల్లా పై జెండా ఎగరేసేందుకు పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. పావులు కదుపుతున్నాయి. మరో వంక ఖమ్మం  జిల్లా రాజకీయాలకు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర బిందువుగా మారారు. బీఆర్ఎస్ పార్టీ పై తిర్గుబాటు బావుటా ఎగరేసిన పొంగులేటిని తమ పార్టీలో  చేర్చుకునేందుకు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, మరో వంక షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ పావులు కదుపుతున్నాయి.  మరో వంక  అన్ని పార్టీలలోని అసమ్మతిగళాలను  ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులను ఏకం చేసి   కేసీఆర్ వద్దనుకున్నతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరిట పొంగులేటి,  కొత్త ప్రాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారనే వార్త  కొద్ది రోజులుగా బలంగా వినవస్తోంది.  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఈ నేపధ్యంలో పొంగులేటి  శ్రీనివాస రెడ్డి  సోమవారం( మార్చి 6) సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. నిజానికి రాజకీయ నాయకులు ఎవరైనా  ఢిల్లీ వెళ్ళడం అంత పెద్ద వార్త కాదు. కానీ ఇప్పుడు పొంగులేటి ఢిల్లీ వెళ్ళడం వార్త మాత్రమే కాదు సంచలన వార్త అంటున్నారు పొంగులేటి రాజకీయ అడుగులను జాగ్రతగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్ పేరుతో నూతన పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చూస్తే  పొంగులేటి  ఆ పని మీదనే ఢిల్లీ వెళ్ళారని అనుకోవచ్చని కూడా  అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో పొంగులేటి ఢిల్లీ యాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. నిజానికి పొంగులేటి తనంతట తానుగా ఢిల్లీ వెళ్లలేదనీ బీజేపీ హై కమాండ్ పిలుపు మేరకే ఆయన ఢిల్లీ వెళ్ళారని పొంగులేటి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. నిజానికి, బీఆర్ఎస్ తో విభేదించి తిరుగుబాటు జెండా ఎగరేసినప్పటి నుంచి పొంగులేటి బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరతారని, వైఎస్సార్ టీపీలో చేరుతున్నారని ఇలా చాలా చాలా  ఊహాగానాలు, వ్యూహాగానాలూ వినిపించాయి. అయితే  అదేదీ జరగలేదు, ఇంతలో సొంత పార్టీ ఆలోచన తెరపైకి రావడం ఆ వెంటనే, బీజేపీ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకోవడంతో మళ్ళీ మరోమారు, ఆయన నెక్స్ట్ స్టెప్ ఏమిటనే విషయంలో ఫ్రెష్ గా తాజా చర్చ మొదలైంది.  వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తున్న బీజేపి..  అందుకోసం ఖమ్మం జిల్లాలో జన బలం కలిగిన పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిని చేజారిపోకుండా ఒడిసి పట్టుకోవాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది.  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపి అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అధిష్టానం ఆహ్వానం మేరకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెవెళ్ళినట్లు   ప్రచారం జరుగుతోంది. ఇందుకు  సంబంధించి ఢిల్లీ నుంచే ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు. అయితే రెండు మూడు నెలలుగా ఆత్మీయ సమ్మేళాల పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాలతో పాటుగా ఆటు ఉమ్మడి వరంగల్ ఇటు కరీంనగర్ పై దృష్టి పెట్టి పావులు కదుపుతున్న పొంగులేటి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సొంత పార్టీ ఆలోచను వదిలేసి, బీఆర్ఎస్ ను ఓడించడమే  లక్ష్యంగా బీజేపీలో చేరతారా? అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.

ఎమ్మెల్సీ కవిత దూకుడుకు కారణమేంటి ?

కల్వకుంట్ల కవిత. మాజీ ఎంపీ అయినా, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినా వీటన్నిటి కంటే ముందు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె. రాజకీయంగా ఆమె ఉనికికీ, ప్రధాన్యతకు, ప్రాముఖ్యతకూ ప్రధానంగా అదే కారణం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా కవిత చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా ఆమె తనదైన గుర్తింపు పొందానడంలో సందేహం లేదు.   అయినా వాస్తవానికి  ఆమె రాజకీయానికి పునాది, ఆమె కుటుంబం. కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ,   కవిత రాజకీయ జీవితం ఇలా  ఉండేది కాదు. అందులో సందేహం లేదు.  కల్వకుట్ల బ్రాండ్   , కేసీఆర్ కుమార్తె ఈ రెండే  ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణం.  అది పక్కన పెడితే   ఢిల్లీ లిక్కర్  కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఆ చిక్కులు, సమస్యలు ఒంటరిగానే ఎదుర్కొన వలసి వచ్చింది. తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆమెకు ఎలాంటి సహాయమేనా చేయవచ్చునేమో కానీ ఆమెను ఆరోపణల నుంచి బయటపడేయగలిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ వారు కవితను బీజేపీలో చేరాల్సిందిగా ప్రలోభపెట్టారనీ అందుకు నిరాకరించడం వల్లే ఆమెపై ఈ ఆరోపణలని ఒక సందర్బంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు కూడా. అయితే ఆ తరువాత సీబీఐ కవితను విచారించడం, ఈడీ చార్జిషీట్ లో పేరు ప్రస్తావించడం జరిగింది. ఇక అప్పటి నుంచీ కవితపై ఆరోపణల మచ్చ పార్టీకీ, కుటుంబానికీ అంటకుండా ఉండేలా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారా అన్న అనుమానాలు కలిగే విధంగా ఆయన మౌనం  వహించారు. ఆయన మౌనాన్ని బట్టి కల్వకుంట్ల కవితకు పార్టీ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఎటువంటి మద్దతూ లభించే అవకాశాలు లేవనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో కవితే స్వయంగా తనపై కేసులు, ఆరోపణలు, వేధింపుల వెనుక ఉన్నది రాజకీయమే అని గట్టిగా  చెప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆమె ఎంత గట్టిగా లిక్కర్ కుంభకోణంలో తన ప్రమేయం లేదు.. అదంతా రాజకీయ ప్రేరేపితమే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అంతే గట్టిగా ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇదే కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు.. ఆ వెంటనే సోమవారం అంటే మార్చి 6న హైదరాబాద్ కు చెందిన అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. అలాగే ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన మనీష్ సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీ కోర్టు అనుమతి తీసుకుంది. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవితకూ చిక్కులు తప్పవన్న అభిప్రాయమే సర్వత్రా బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. దర్యాప్తు సంస్థలు విపక్షాల నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ ప్రధానికి ఓ లేఖ రాసి మిన్నకున్నారు. నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ  పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.   ఈ కేసు విచారణ చేస్తున్న, సీబీఐ ఆమెకు సీఆర్పీసీ 160 నోటీసు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె మూడు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి  చర్చించినట్లు వార్తలొచ్చాయి. అలాగే కవితకు నోటీసులు వచ్చిన వెంటనే మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పోటాపోటీగా కవితకు మద్దతు ప్రకటిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించి మరీ కేంద్రాన్నీ, ప్రధాని మోడీనీ విమర్శించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రభావితం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడంతో భయపడిన మోడీ ఆయనను కట్టడి చేసేందుకే కవితను టార్గెట్ చేశారంటూ విమర్వలు కూడా గుప్పించారు.  అంతే ఆ తరువాత బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఆమెకు మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు కవిత ఒంటరిగానే కేంద్రంపై విమర్శల దాడి ప్రారంభించారని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు  మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, తనపై జరుగతున్న దాడులు కూడా అదే కోవకు చెందుతాయని కవిత అంటున్నారు.    దాడులకు   భయపడేది లేదని చెబుతున్నారు. హస్తినలో ధర్నాకు రెడీ అయ్యారు.  కేంద్రంపై విమర్శల దాడి  విషయంలో కవిత దూకుడు పెంచారు. రాజకీయ కారణాలతోనే మద్యం కుంభకోణంలో తనను ఇరికించారని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె ఈ ప్రయత్నంలో ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటనలూ రావడం లేదు. వీటన్నిటినీ బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో కవితకు కుటుంబం, పార్టీ అండగా నిలబడటం లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఫ్యామిలీ ప్యాకేజీకి కేసీఆర్ నో!.. ఈ విధానం కల్వకుంట్ల ఫ్యామిలీకి వర్తించదా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలో నేతల వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు.. గతంలో తాను చెప్పినట్లు  సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని తేల్చేశారు. ఈ సారి చావో రేవో అన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నామనీ, రాష్ట్రంలో పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి తీరాలని ఆయన పార్టీ నేతలకు విస్పష్టంగా చెప్పేశారు. అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లని స్పష్టం చేసేశారు. నియోజకవర్గాల వారీగా  గెలిచే అభ్యర్థులు ఎవరన్న సంగతి తేల్చుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ విస్పష్టంగా చెప్పేశారు. దీంతో గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని కేసీఆర్ ఇచ్చిన హామీలో ధీమాగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలలో ఇప్పుడు గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు తమ రోజు వారీ దినచర్యను మార్చుకున్నారు. రోజూ జనంలో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అయినా ఏదో బెంగ వారిలో కదలాడుతోంది. ఇక కొందరు సీనియర్ నాయకులు ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో తమ వారుసుల రాజకీయ అరంగేట్రం కోసం చేస్తున్న ప్రయత్నాలకు కేసీఆర్ చెక్ పెట్టేశారు. వారసులకు టికెట్లిచ్చే ప్రశ్నే లేదని విస్పష్టంగా తేల్చేశారు. ప్యామిలీలో ఒకరికే టికెట్ అని, ఇది విధానపర నిర్ణయమని కేసీఆర్ చెప్పేయడంతో సీనియర్ల ఆశలు వమ్మయ్యాయి. అయితే ఈ విషయంలో పార్టీ సీనియర్లలో ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తమౌతోంది. ఫ్యామిలీ ప్యాకేజీలకు నో అన్న పార్టీ విధానం అధినేతకు వర్తించదా అని పలువురు నాయకులు గొణుక్కుంటున్నారు. ఫ్యామిలీలో ఒకరికే పార్టీటికెట్ అని స్పష్టం చేసిన కేసీఆర్ అది కూడా సర్వేల ఫలితాన్ని బట్టి గెలుస్తారనుకుంటేనే టికెట్ ఇస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు.  

ఉత్తరాంధ్రలో మంత్రులకు ఎదురుగాలి!

అఫ్కోర్స్...  ఒక్క ఉత్తరాంధ్ర అనే కాదు, రాయలసీమ,  కోస్తా, పల్నాడు ప్రాంతాలు ఏవైనా అధికార వైసీపీ ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది.  ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడికక్కడ ఎదురీదక తప్పని పరిస్థితే వుంది.  ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరి  గుండెల్లోనూ ఓటమి భయం దౌడు తీస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   వై నాట్ 175’ అని బింకాలు పోతున్నా,  వాస్తవ పరిస్థతి అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని, సర్కార్ వారి ఐప్యాక్ సహా ఒకటికి మూడు సర్వేలు నొక్కి వక్కాణిస్తున్నాయి.  ముఖ్యంగా మంత్రుల జాతకాలపై ఐ ప్యాక్ నిర్వహించిన సర్వేలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్‌ బాషా,  నారాయణస్వామి, పినిపె విశ్వరూప్‌,  దాడిశెట్టి రాజా మినహా మిగిలిన మంత్రులు, మాజీ మంత్రులు ఎవరూ తిరిగి అసెంబ్లీ గడప తొక్కే అవకాశమే లేదని సర్వే తేల్చి చెప్పిందని అంటున్నారు. నిజానికి, ఈ నలుగురైదుగురు మంత్రులు కూడా ఖాయంగా గెలుస్తారని కాదుట, మిగిలిన వారికంటే గెలిచే అవకాశాలు వీరికి కొంచెం ఎక్కువగా ఉన్నాయని మాత్రమే ఐప్యాక్ సర్వే స్పష్టం చేసినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం జరుగుతోంది. ఉత్తారాధ్రలో అయితే, ఆరుగురికి ఆరుగురు మంత్రులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఐ ప్యాక్ సర్వే స్పష్టం చేసిందని, అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే విశాఖకు మకాం మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం ఇప్పటికే ఫిక్సయి పోయారని అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో అందుకే, ఉత్తరాంధ్ర మంత్రులలో ఒకరు కూడా గెలిచే అవకాశమే లేదని తెలియడంతో అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 మంది మంత్రులు, తాజా మాజీ మంత్రులపై ఐ ప్యాక్ టీమ్ సర్వే చేసినట్టు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం  ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్‌ బాషా, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్‌, దాడిశెట్టి రాజా పేర్లు  గెలిచే అవకాశమున్న  వారి జాబితాలో కనిపిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు ఓటమి అంచున ఉండడం విశేషం. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉమ్మడి రాష్ట్రంలోనూ మంచి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సొంత జిల్లా విజయనగరం జిల్లాను తన కుటంబ సామ్రాజ్యంగా మలుచుకున్నారు. చీపురుపల్లి నియోజక వర్గంలో ఆయనకు ఎదురన్నదే లేదని అంటారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అన్నినియోజక వర్గాల్లోనూ డిపాజిట్ కోల్పోయింది. అయితే అందుకు ఒకే ఒక్క మినహాయింపు చీపురుపల్లి నియోజక వర్గం. బొత్స ఒక్కరే డిపాజిట్ దక్కించు కున్నారు.  అయితే, ఆయన మళ్ళీ అదే నియోజక్వరం నుంచి పోటీ చేస్తే, ఓడిపోతారని సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. 2004 నుంచి చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్సకు 2014లో మాత్రం ఓటమి ఎదురైంది. అయితే ఈసారి చీపురుపల్లి నుంచి బొత్స గెలుపు అంత ఈజీ కాదట. అందుకే ఆయన వేరే నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో ఉన్నట్టు సమాచారం. మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎదురీదుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిపై ఏడు వేల ఓట్లతో మాత్రమే గెలుపొందారు.  మూడేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఇటీవలే మంత్రి అయ్యారు. కానీ ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రదర్శించిన దూకుడు ఇప్పుడు లేదు. దీంతో అటు సొంత పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ ప్రజల్లో కూడా అసంతృప్తి నెలకొని ఉంది. రోజు రోజుకూ ఆయనపై వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఐ ప్యాక్ తన సర్వేలో గుర్తించినట్టు సమాచారం. మంత్రి సీదిరి అప్పరాజు పరిస్థితి కూడా బాగాలేదు. పలాస నియోజకవర్గంలో ఆయన సొంత పార్టీ నుంచే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలు పెరుగుతుండడం, అనుచరులు దందాలకు దిగుతుండడం ఆయనకు మైనస్ గా మారింది. అటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు లేకపోవడం, నిత్యం రాజకీయ వివాదాలు జరుగుతుండడంతో ప్రజల్లో ఒకరకమైన అసంతృప్తి పెల్లుబికినట్టు సమాచారం. మంత్రి చేసింది తక్కువ..ఆర్భాటం ఎక్కువ కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు సమాచారం. మన్యం జిల్లా మంత్రి పీడిక రాజన్నదొర సైతం సాలూరు నియోజకవర్గంలో ఓటమి బాటలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన రాజన్నదొర విద్యాధికుడు, వివాదరహితుడు. దీంతో జగన్ మలి విడత విస్తరణలో రాజన్నదొరకు మంత్రి పదవి ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా కూడా ఎంపిక చేశారు. అయితే గిరిజనుల సమస్యలపై స్పందిస్తున్నా ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేకపోవడంతో ఆయనకు మైనస్ గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నానని రాజన్నదొర లోలోపల బాధపడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాక నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆ ప్రభావం రాజన్నదొర గెలుపుపై చూపుతోంది. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనుకుంటున్న మంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఈసారి కష్టమేనని ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ముత్యాలనాయుడికి చాన్సిచ్చారు. కీలక పోర్టు పోలియోలతో పాటు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. కానీ మంత్రిగా తన ముద్ర చూపుకోవడంలో ముత్యాలనాయుడు ఫెయిలయ్యారు. అటు మాడుగుల నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో వైసీపీ సర్కారుపై విరక్తి పెరిగింది. ఆ ప్రభావం ముత్యాలనాయుడు గెలుపుపై చూపుతోంది. అనకాపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఓటమి తప్పదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అమర్నాథ్ కు మంత్రివర్గ విస్తరణలో అమాత్య పదవి కట్టబెట్టారు. కానీ ఆయనకు పార్టీలోనూ అసమ్మతి ఉంది. నియోజకవర్గ ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ ప్రగతి వైపు చూడకుండా నిత్యం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణ  ఉంది. గత ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. ఈసారి అన్ని ప్రతికూలతల దృష్ట్యా అమర్నాథ్ ఓటమి తప్పదని ఐ ప్యాక్ టీమ్ నిర్థారించినట్టు తెలుస్తోంది. ఇలా ఉత్తరాద్రలో వైసీపే మంతతరులు ఎదురీదుతున్నారు. నిజానిని, సగానికి సగం మందికిపైగా మంత్రులు పోటీ చేసేందుకు కూడా వెనకాడుతున్నారని అంటున్నారు.

జగన్ లో బటన్ నొక్కుడు ధీమా మాయం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశ్వాసం, జగన్ ను నమ్ముకున్న వాళ్ల విశ్వాసం రెండూ కూడా ఆవిరైపోయే పరిస్థితి వచ్చిందా?..  బటన్ నొక్కుతున్నాను.. మన ఓట్లకు ఏం ఢోకా లేదు, మీ పని మీరు చేయండి అంటూ జగన్ తరచూ తన పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ క్లాస్ పీకుతూ ఉంటారు. నా పని నేను చేస్తున్నాను, మీరే జనంలోకి వెళ్లడం లేదంటూ ఊదరగొట్టేస్తుంటారు. అటువంటి జగన్ ఇప్పుడు ఇక బటన్ నొక్కుడుకు అవకాశం లేని పరిస్థితుల్లో పడ్డారు. ఔను బటన్ నొక్కుడు కొనసాగినంత కాలం అధికారానికి ఢోకా లేదు, జనం వ్యతిరేకత, ప్రజాందోళనలతో రాష్ట్రం గగ్గోలెత్తినా ఏం ఫర్వాలేదు, తానుబటన్ నొక్కుతున్నంత కాలం,  లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు పడుతున్నంత కాలం ఓట్లెక్కడికీ పోవు. ఇదీ ఇప్పటి వరకూ జగన్ లో ఉన్న విశ్వాసం. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురైనా.. స్వయంగా ముఖ్యమంత్రి సభల నుంచే జనం పారిపోయినా.. మంత్రుల సభలకు ప్రజలు మొహం చాటేసినా జగన్ లెక్క చేయలేదు. విపక్షాల సభలకు జనం పోటెత్తి జయజయధ్వనాలు పలికినా జగన్ చిద్విలాసంగా పార్టీ నేతలకు, శ్రేణులకు ఆందోళన వద్దు.. ఓట్లూ మనవే, అధికారమూ మనదే.. అంటూ భరోసా ఇస్తూ వచ్చారు. పార్టీ నేతల్లో ధీమాకూ అదే కారణం. తమ నేత బటన్ నొక్కి సొమ్ములు లబ్ధిదారులకు పందేరం చేస్తున్నారు ఏం ఫర్వాలేదు అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడా ధీమా వారిలో కనిపించడం లేదు. జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఆగిపోయాయా? అందుకూ నిధులు లేని పరిస్థితి వచ్చేసిందా? అంటే పార్టీ శ్రేణులే ఔనని అంటున్నారు.  ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దివాణంలా అయిపోయింది ఏపీ పరిస్థితి. దీంతో పార్టీ నేతలలో జగన్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జనవరి నుంచి పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి.  కేంద్రం ఇచ్చేసిన నిధులకు ఓ సారి తెనాలిలో బహిరంగసభ పెట్టి మీట నొక్కారు. అది బహిరంగం అయిపోవడంతో ఉత్తుత్తి బటన్ నొక్కుడులేనా జగన్ అంటూ విపక్షల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దానికి తోడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు రైతుల ఖాతాలలోకి సొమ్ములు జమ చేసినందుకు  ప్రధాని  కృతజ్ణతలు చెబుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఆ ట్వీటే జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కుడు వ్యవహారాన్ని బట్టబయలు చేసేసింది. అదలా ఉంచితే గత డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న పథకాలకు జగన్ మీట నొక్కిన దాఖలాలు లేవు.  ఆసరా పథకాన్నే తీసుకుంటే..   కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ  ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది.  ఈ పథకం కింద నాలుగేళ్లపాటు రూ. 12500 బటన్ నొక్కుడు ద్వారా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండ్‌లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉంది.   ఇక తాజాగా జగనన్న  విద్యాదీవెన పథకం మరోమారు వాయిదా పడింది.  2022-23 విద్యా సంవత్సరానికి గాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ. 700 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్ని ఏపీ సర్కార్ ఈ పథకం కింద విడుదల చేయాల్సి ఉంది.   సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28నే ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ తర్వాత దానిని మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.  అయితే ఇప్పుడు మరో సారి వాయిదా వేసింది. ఈ నిధుల విడుదల ఎప్పుడు అన్న విషయాన్ని కూడా తెలియజేయలేదు. 

మనీష్ సిసోడియా అరెస్టు సరే.. కవితపై ఆరోపణల విషయంలో నోరుమెదపరేం?: బండి

మద్యం కుంభకోణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవితను కాపాడుకోవడానికి ఆయన నేల విడిచి సాము చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు కాగానే, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే ఆమోదించారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. కానీ మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం దారుణమంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలు పెడుతున్నారు. ఈ కుంభకోణం కేసులో కవిత అరెస్టు అనివార్యమన్న నిర్ధారణకు రావడం వల్లనే కేసీఆర్ ప్రధానికి లేఖ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారన్న విమర్శ:లు వినవస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విలేకరుల సమావేశం పెట్టి మరీ ఈ ఆరోపణలు చేశారు.   అవినీతి ఆరోపణలపై, లిక్కర్ కుంభకోణంలో అక్రమాలపై విచారణను అడ్డుకోవాలని ప్రయత్నించడం సమంజసం కాదని బండి సంజయ్ అంటున్నారు.  గతంలోనూ అంటే యూపీఏ హయాంలో కూడా అవినీతి కుంభకోణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం విపక్షాలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ గుండెలు బాదుకోవడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం లేదా అని ప్రశ్నించారు.    ప్రధానిని బదనాం చేయాలన్న దురుద్దేశంతోనే కేసీఆర్ మద్యం కుంభకోణం విషయంలో కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.  కేసీఆర్ కు కోర్టుల మీదా,  ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. తెలంగాణ సీఎస్ ను దాదాపు 30 సార్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ స్థానం మందలించింది. ఆ విషయం గురించి ప్రశ్నించకుండా,  10 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని మహిళా గవర్నర్ ను బదనాం చేస్తున్న కేసీఆర్ తన 10 వేల ఫైళ్లు పెండింగ్ పెట్టుకున్నడు. 50 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా చీకట్లో దాచేసిన సంగతి గురించి ఎందుకు మాట్లాడరంటూ బండి నిలదీశారు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంతకాల్లేకుండా లేఖను పత్రికలకు రిలీజ్ చేయడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు.  లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత  బిడ్డ పాత్ర ఉందా? లేదా? అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవితపై వచ్చిన ఆరోపణల గురించి నోరు మెదపని కేసీఆర్.. అదే కేసులో ఇతర పార్టీ నేత జైలుకు వెళితే ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఏపీలో తెలుగుదేశంకే జనం జై.. శ్రీ ఆత్మ సాక్షిసర్వే వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటి.. 175కు 175 స్ధానాలలో విజయం సాధిస్తామన్న వైసీపీ ధీమా, తమ గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్న విపక్షం విశ్వాసం. వాస్తవంగా ప్రజలేమనుకుంటున్నారు.  అంటే శ్రీ ఆత్మసాక్షి సర్వే అటు అధికార పార్టీ ధీమా.. ఇటు విపక్షం విశ్వాసం రెండూ కూడా అతిశయోక్తిగానే ఉన్నాయని చెబుతోంది. 175కు 175 సంగతి పక్కన పెట్టి అసలు అధికారంలోకి రావడానికి అవసరమైన స్థానాలలో గెలవడానికే వైసీపీ చెమటోడ్చక తప్పదని చెబుతోంది. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే బ్రహ్మాండంగా పుంచుకున్న తెలుగుదేశం కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మరింత కసరత్తు చేయక తప్పదని సర్వే పేర్కొంది. ఏపీలో రాజకీయ వేడి ఎల్ నినో కారణంగా వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తలదన్నేలా ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతున్నాది. ఈ నేపథ్యంలోనే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పెచ్చరిల్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో వాస్తవంగా ఏ పార్టీకి మెరుగైన విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ వెనుకబడి ఉంది.  ఇత్యాది అంశాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని వెలువరించింది.  ఎన్నికల ఫలితాలను దాదాపు కచ్చితంగా అంచనా వేసే సర్వే సంస్థలలో శ్రీ ఆత్మసాక్షి ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తి సాధికారతతో ముందుగానే శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఆ సర్వేలో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయాన్ని యాక్యురేట్ గా అంచనా వేసింది. సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు ఉన్నాయి. అప్పటి ఎన్నికలలో వైసీపీ 139 నుంచి 142 స్థానాలలో విజయం సాధిస్తుందని, అలాగే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం 22 నుంచి 28 స్థానాలలో విజయం సాధిస్తుందని  ఇక జనసేన 0 నుంచి 2 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వాస్తవ ఫలితాలు కొంచం అటూ ఇటూలో సరిగ్గా అలాగే వచ్చాయి. వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో గెలుపొందింది. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అలాగే పాలకొల్లు, ఉండి, హిందుపూర్, ఇచ్చాపురం, అలాగే విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలనూ కూడా వైసీపీ కోల్పోతుందని  కచ్చతంగా అంచనా వేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. ఫలితం కూడా అలాగే వచ్చింది.  అదే విధంగా రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ 22 స్థానాలలోనూ తెలుగుదేశం 2 స్థానాలలోనూ విజయం సాధిస్తాయన్న శ్రీ ఆత్మసాక్షి సర్వే అంచనా అక్షరాలా నిజమైంది.  ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో కూడా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందో సరిగ్గా అదే జరిగింది. ఫలితం అలాగే వచ్చింది.   దీంతో శ్రీ ఆత్మసాక్షి సర్వేలపై ప్రజలలో విశ్వసనీయత పెరిగింది. అటువంటి సంస్థ తాజాగా మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలలో గెలుచుకుంటుంది. ఏ యే స్థానాలలో హోరాహోరీ పోరు ఉంటుంది అన్న అంశాలపై రాష్ట్రంలో దశల వారీగా సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలను సమగ్రంగా వెలువరించింది. జిల్లాల వారీగా నియోజకవర్గాలలో పార్టీల విజయావకాశాలు, హోరాహోరీ పోరు ఉండే నియోజకవర్గాలు ఇత్యాది వివరాలతో శ్రీ ఆత్మసాక్షి సర్వే విడుదల చేసింది.  జిల్లాల వారీగా ఏయే నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏయే నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు అన్న అంశాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఒకింత మొగ్గు కనిపిస్తున్నా.. గెలుపు అంత సులభసాధ్యం కాదని సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరో సారి అధికారం చేజిక్కించుకుకోవడంపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీకి అంత సీన్ లేదనీ సర్వే ఫలితం వెల్లడించింది.  శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా, నిష్పాక్షికంగా ఈ సర్వే నిర్వహించింది. ఇద్దరు ఎన్ ఆర్ ఐలు, ముగ్గురు రాజకీయవేత్తల కోరిక మేరకు ఈ సర్వే నిర్వహించింది.  మొదటి దశ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 3న విడుదల చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 77 స్థానాలలో, వైసీపీ 56, జనసేన 4 స్థానాలలో విజయం సాధిస్తాయి.  ఈ సర్వే విడుదల చేసిన మూడు నెలల తరువాత ఈ సంస్థ మూడు విడతల్లో మరో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలనే ఇప్పుడు విడుదల చేసింది. ఈ సర్వే కోసం నియోజకవర్గానికి సగటున 330 మందితో డైరెక్ట్ గా ఇట్రాక్ట్ అయ్యారు. అంటే రాష్ట్రంలో ఈ సర్వే సంస్థ 60 వేల 200 శాంపిల్స్ నుంచి కలెక్ట్ చేసిన వివరాలను ఇప్పుడు వెలువరించింది.  ఈ సర్వే మూడు విడతల్లో గత ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 17 వరకూ నిర్వహించింది. అదే మొదటి దశ సర్వేలో అయితే శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రతినిథులు రాష్ట్రం మొత్తంలో లక్షా 370 వేల శాంపిల్స్ నుంచి వివరాలు సేకరించారు. ఆ విషయం పక్కన పెడితే తాజా సర్వే ప్రకారం  రాష్ట్రంలో అధికార వైసీపీకి 41.50 శాతం ఓటర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి 42.50 శాతం మంది, జనసేనకు 11 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఇతరులు 2.5శాతం ఉండగా, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ మరో 2.5శాతంగా ఉంది. మొత్తం మీద 175 నియోజకవర్గాలలో అధికార వైసీపీ 63 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటే, తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశాలు 78 స్థానాలలో ఉన్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఈ పార్టీ 7 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మరో 37 నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు సాగనుంది. ఇలా హోరా హోరీ పోరు సాగే నియోజకవర్గాలలో కూడా విపక్ష వైసీపీకి 14 చోట్ల, తెలుగుదేవం పార్టీకి 13 చోట్ల కొద్ది పాటి మొగ్గు కనిపిస్తోంది.  ఇక జిల్లాల వారీగా పార్టీల విజయావకాశాల విషయానికి వస్తే.. శ్రీకాకుళొం జిల్లాలో మిత్తం 10 స్థానాలు ఉండగా వీటిలో ఇచ్చాపురం, ఎచ్చెర్ల, పాతపట్నం, రాజాం, పలాస, అముదాల వలస స్థానాలలో తెలుగుదేవం, పాలకొంండ, నరసన్నపేటలలో వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయి. టెక్కలి, శ్రీకాకుళంలలో హోరా రోహీ పోరు సాగుతుంది. అంటే జిల్లాలోని పది నియోజకవర్గాలలో 6 స్థానాలలో తెలుగుదేశం, 2 స్థానాలలో వైసీపీకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. మిగిలిన రెండు స్థానాలలో అంటే టెక్కటి, శ్రీకాకుళం లలో హోరాహోరీ పోరు సాగుతుంది. అలాగే  విజయనగరం  జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగు నిజోజకవర్గాలలో తెలుగుదేశం, మూడు నియోజకవర్గాలలో వైసీసీకి విజయావకాశాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి విజయనగరం, బొబ్బొలి, ఎస్. కోట, గజపతినగరంలలో విజయావకాశాలు ఉండగా, వైసీపీకి చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం, కురుపాంలలో హోరా హోరీ పోరు ఉంటుంది.  ఇక విశాఖజిల్లా విషయానికి వస్తే ఈ  జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 15. వీటిలో  ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండగా  మూడు నియోజకవర్గాలలో  హోరాహోరీ పోరు ఉంటుది.  తెలుగుదేశం పార్టి విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, భీమిలిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో ముందంజలో ఉంటే, వైసీపీ విశాఖ సౌత్, విశాఖ నార్త్, యలమంచిలి, అరకు వ్యాలీ, పాడేరులలో వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఇక పాయకరావుపేట, గాజువాక, మాడుగుల నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఆరు నియోజకవర్గాలలో వైసీపీ, నాలుగు నియోజకవర్గాలలో జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. మిగిలిన మూడు నియోజకవర్గాలలోనూ హోరాహోరీ పోరు ఉంటుంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలలో తెలుగుదేశం, రామచంద్రాపురం, రంపచోడవరం, కాకినాడ అర్బన్, అనపర్తి, తుని, రాజానగరంలలో వైసీపీ, పిఠాపురం, రాజమండ్రిరూరల్, రాజోలు, కొత్త పేటలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. ఇక శ్రీ ఆత్మసాక్షిసర్వే ప్రకారం పి.గన్నవరం, మండపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలలో తెలుగుదేశం 8 నియోజకవర్గాలలోనూ వైపీపీ రెండు నియోజకవర్గాలలో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీకి ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాలలో విజయావకాశాలు ఉన్నాయి. పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు, కొవ్వూరు, పోలవరం, ఉండి నియోజకవర్గాలు తెలుగుదేశం ఖాతాలోనూ,  ఏలూరు, గోపాలపురం నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనూ పడతాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. నిడదవోలు, చింతలపూడిలలో హోరాహోరీ పోరు ఉంటుంది.   అలాగే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఎనిమిది నియోజకవర్గాలు తెలుగుదేశం,  ఐదు నియోజకవర్గలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే పేర్కొంది. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్,  జగ్గయ్యపేట, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నంలలో విజయం సాధిస్తే,  వైసీసీకి గన్నవరం, పామర్రు,  గుడివాడ, తిరువూరు, నూజివీడులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, కైకలూరులలో హోరాహోరీ పోరు ఉంటుంది. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 తెలుగుదేశం ఖాతాలోనూ, 6 వైసీపీ ఖాతాలోనూ పడతాయి. మూడు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు. పొన్నూరు, వేమూరు, తాడికొండ, చిలకలూరి పేట, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, బాపట్లలలో తెలుగుదేశం గెలిచే అవకాశాలు అధికంగా ఉంటే,  గుంటూరు ఈస్ట్, మాచర్ల, పత్తిపాడు, పెదకూరపాడు, తెనాలి, నరసరావు పేటలలో వైసీపీకి విజయావకాశలు ఉన్నాయి. ఇక గుంటూరు వెస్ట్, గురజాల, సత్తెనపల్లిలో హోరాహోరీ పోరు ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరింట తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ, ఒక నియోజకవర్గంలో హోరా హోరీ ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఒంగోలు, కనిగిరి, కొండెపి, పరచూరు, అద్దంకి, సంతనూతలపాడు లలో తెలుగుదేవం, మార్కాపురం, ఎర్రగొండ్లపాలెం, గిద్దలూరు, కందుకూరు, దర్శిలలో  వైసీపీ గెలిచే అవకాశాలు ఉండగా, చీరాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఐదింటిని తెలుగుదేశం, రెండు నియోజకవర్గాలలో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. మూడింటిలో హోరాహోరీ పోరు ఉంటుంది.  నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, కావలిలలో తెలుగుదేశం, ఆత్మకూరు, సర్వేపల్లిలలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, కోవూరులలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం నాలుగు, వైసీపీ 8 గెలుచుకునే అవకాశాలున్నాయి. రెండు నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  మందపల్లి, కుప్పం,  నగరి, పలమనేరులలో తెలుగుదేశం విజయం సాధిస్తే,  తిరుపతి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, చంద్రగిరి, చిత్తూరు, తంబళ్లపల్లిలలో వైసీపీ విజయం సాధిస్తుంది. ఇక పీలేరు, శ్రీకాళహస్తిలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  కడప జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం రెండు స్థానాలలోనూ, వైసీపీ ఆరు స్థానాలలోనూవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండు స్థానాలలో పోటీ హోరాహోరీ ఉంటుంది.  మైదుకూరు, ప్రొద్దుటూరులలో తెలుగుదేశం, కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, కోడూరులలో వైసీపీ గెలుస్తాయి. రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.  అనంతపురం జల్లాలో14  నియోజకవర్గాలు ఉండగా వీటిలో 7 చోట్ల తెలుగుదేశం, 7 చోట్ల వైసీపీ విజయం సాధిస్తాయి. ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంది. అనంతపురం, కదిరి, హిందూపురం,  తాడిపత్రి,  కళ్యాణదుర్గం, పెనుకొండ,  ఉరవకొండలలో తెలుగుదేశం, రాప్తాడు, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, మడకశిరలలో వైసీపీ విజయం సాధిస్తాయి. సింగనమలలో పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంటుంది.  ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఏడింటిలో కర్నూలు, ఏడింటిలో వైసీపీ విజయం సాధించే అవకాశలు ఉన్నాయని శ్రీఆత్మసాక్షి సర్వేపేర్కొంది.  శ్రీశైలం, కొడుమూరు, మంత్రాలయం, బనగానపల్లి, ఆలూరు, ఆదోని, పత్తికొండలలో తెలుగుదేవం, నందికొట్కూరు, పాణ్యం,  ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాలలో వైసీపీకివిజయావకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది.  మొత్తానికి శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య తేడా స్వల్పమేనని కూడా సర్వే వెల్లడిస్తోంది.  

వైఎస్ వివేకానందరెడ్డి హత్య... ముచ్చటగా మూడోసారి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత  జగన్ సొంత బాబాయ్  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు ముచ్చటగా మూడోసారి నోటీసులు ఇచ్చారు. మార్చి 6వ తేదీన తమ విచారణకు రావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డికి తొలుత సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ఆ రోజు తన నియోజకవర్గంలోని వేంపల్లిలో పార్టీ మండల, కార్యకర్తల, గృహాసారథుల, కన్వీనర్ల, వాలంటీర్ల సమావేశం ఉందని.. ఈ నేపథ్యంలో హాజరుకాలేనని ఆయన సీబీఐకి తెలిపడంతో.. మార్చి 10వ తేదీన   విచారణకు రావాలని  అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు నోటిసులు అందజేశారు. దీంతో హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి మరోమారు వైయస్ అవినాష్ రెడ్డి విచారణకు తరలి రానున్నారు. అలాగే ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సైతం.. మార్చి 12వ తేదీన కడపలో తమ విచారణకు హాజరుకావాలని సీబీఐ అదికారులు నోటిసులు అందజేశారు. అయితే తాను హైదరాబాద కు రాలేనని అవినష్ సీబీఐకి వర్తమానం పంపించారనుకోండి అది వేరే సంగతి.     అయితే వివేకా హత్య కేసులో అందరి చూపులే కాదు.. వేళ్లన్నీ కూడా అనినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయనే విధంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థ సీబీఐ... కోర్టుకు సమర్పించిన   అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరికి సీబీఐ నోటీసులు జారీ చేసిందనగానే.. అటు మీడియా.. ఇటు సోషల్ మీడియలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అదీకాక  స్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సీబీఐ ఎప్పుడు నోటీసులు జారీ చేసినా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయంటూ... సీబీఐకి తెలపడం.. వారు మరో తేదీ ఫిక్స్ చేయడం.. ఆ క్రమంలో సీబీఐ అధికారులు ఎక్కడా.. ఎప్పుడూ.. వీరి పట్ల దూకుడుగా వ్యవహరించకుండా చాలా సమయమనం పాటిస్తూ వస్తున్నారనే చర్చ సైతం సాగుతోంది.   ఇక గత జనవరి 28న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని.. తొలిసారిగా హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు. ఈ సందర్బంగా ఆయన కాల్‌డేటాపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో.. అంతకు ముందు... ఆ తర్వాత వెళ్లిన కాల్‌డేటాపై దృష్టి పెట్టడం..  అందులో భాగంగా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి,   జగన్ సతీమణి పీఏ నవీన్‌ సెల్ పోన్లకు కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వీరిద్దరికీ సీబీఐ అధికారులు ఫిబ్రవరి 3వ తేదీన కడపలో తమ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. వారిద్దరు సీబీఐ విచారణకు హాజరయ్యారు.  అయితే వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి పీఏ నవీన్‌ను మరోసారి సీబీఐ అధికారులు.. విచారణకు పిలువనున్నారని.. అందుకు వారి న్యాయవాదితో ఇప్పటికే అంశంపై మాట్లాడినట్లు మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో సందేహం ఉన్న ప్రతి అంశాన్ని సీబీఐ అధికారులు వదిలిపెట్టకుండా విచారణ జరుపుతున్నారు. ఆ క్రమంలో  వివేకా హత్య జరిగిన రోజు.. వైయస్ అవినాష్ తో ఫొటో దిగిన సుధాకర్ అనే వ్యక్తిని సైతం సీబీఐ అధికారులు పిలిచి మరీ విచారించడం గమనార్హం.  ఇక వైయస్ వివేకా హత్య జరిగి ఈ ఏడాది మార్చి 15కి సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. అదే రోజు సీబీఐ పలువురిని అరెస్ట్ చేసినా.. అందులో ఆశ్చర్యం లేదనే ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వాడి వేడిగా నడుస్తోంది. ఇక ఇటు లోక్‌సభకు .... అటు అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో అసలు వివేకా హత్య ఎందుకు జరిగింది?..  అసలు ఈ హత్య జరగడానికి గల ప్రధాన కారణం?.. వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల చెప్పినట్లు కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగిందా? లేకుంటే.. ఆర్థిక వ్యవహారాలు కారణమా? లేకుంటే మరేదైనా కారణమా? ఇక వివేకా హత్యకు సుపారీగా 40 కోట్ల రూపాయిలు.. ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు?.. అంత పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి.. వైఎస్ వివేకాను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అలాగే ఈ హత్య వెనుక ఉన్న అసలు సిసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అనేది బయటకు వస్తే.. దాని తాలుకు ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై సుస్పష్టంగా పడుతోందనే ఓ చర్చ సైతం తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా నడుస్తోంది.