మనీష్ సిసోడియా అరెస్టు సరే.. కవితపై ఆరోపణల విషయంలో నోరుమెదపరేం?: బండి
posted on Mar 7, 2023 @ 11:23AM
మద్యం కుంభకోణం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమార్తె కవితను కాపాడుకోవడానికి ఆయన నేల విడిచి సాము చేస్తున్నారు. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు కాగానే, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే ఆమోదించారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ మద్యం కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. కానీ మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం దారుణమంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలు పెడుతున్నారు. ఈ కుంభకోణం కేసులో కవిత అరెస్టు అనివార్యమన్న నిర్ధారణకు రావడం వల్లనే కేసీఆర్ ప్రధానికి లేఖ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారన్న విమర్శ:లు వినవస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విలేకరుల సమావేశం పెట్టి మరీ ఈ ఆరోపణలు చేశారు.
అవినీతి ఆరోపణలపై, లిక్కర్ కుంభకోణంలో అక్రమాలపై విచారణను అడ్డుకోవాలని ప్రయత్నించడం సమంజసం కాదని బండి సంజయ్ అంటున్నారు. గతంలోనూ అంటే యూపీఏ హయాంలో కూడా అవినీతి కుంభకోణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం విపక్షాలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ గుండెలు బాదుకోవడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం లేదా అని ప్రశ్నించారు. ప్రధానిని బదనాం చేయాలన్న దురుద్దేశంతోనే కేసీఆర్ మద్యం కుంభకోణం విషయంలో కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ కు కోర్టుల మీదా, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విమర్శించారు. తెలంగాణ సీఎస్ ను దాదాపు 30 సార్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ స్థానం మందలించింది. ఆ విషయం గురించి ప్రశ్నించకుండా, 10 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని మహిళా గవర్నర్ ను బదనాం చేస్తున్న కేసీఆర్ తన 10 వేల ఫైళ్లు పెండింగ్ పెట్టుకున్నడు. 50 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా చీకట్లో దాచేసిన సంగతి గురించి ఎందుకు మాట్లాడరంటూ బండి నిలదీశారు
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంతకాల్లేకుండా లేఖను పత్రికలకు రిలీజ్ చేయడం దిగజారుడు తనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత బిడ్డ పాత్ర ఉందా? లేదా? అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కవితపై వచ్చిన ఆరోపణల గురించి నోరు మెదపని కేసీఆర్.. అదే కేసులో ఇతర పార్టీ నేత జైలుకు వెళితే ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు.