మళ్ళీ కమలం వైపుకు పొంగులేటి చూపు?
posted on Mar 7, 2023 @ 4:05PM
తెలంగాణ రాజకీయాలకు ఖమ్మం జిల్లా కేంద్ర బిందువుగా మారుతోందా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార బీఆర్ఎస్ మొదలు కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా, నిన్నమొన్న పుట్టిన వైఎస్సార్ టీపీ వరకు పార్టీలన్నీ ఖమ్మం జిల్లా పై జెండా ఎగరేసేందుకు పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. పావులు కదుపుతున్నాయి.
మరో వంక ఖమ్మం జిల్లా రాజకీయాలకు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర బిందువుగా మారారు. బీఆర్ఎస్ పార్టీ పై తిర్గుబాటు బావుటా ఎగరేసిన పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, మరో వంక షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ పావులు కదుపుతున్నాయి. మరో వంక అన్ని పార్టీలలోని అసమ్మతిగళాలను ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులను ఏకం చేసి కేసీఆర్ వద్దనుకున్నతెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరిట పొంగులేటి, కొత్త ప్రాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారనే వార్త కొద్ది రోజులుగా బలంగా వినవస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ నేపధ్యంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం( మార్చి 6) సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. నిజానికి రాజకీయ నాయకులు ఎవరైనా ఢిల్లీ వెళ్ళడం అంత పెద్ద వార్త కాదు. కానీ ఇప్పుడు పొంగులేటి ఢిల్లీ వెళ్ళడం వార్త మాత్రమే కాదు సంచలన వార్త అంటున్నారు పొంగులేటి రాజకీయ అడుగులను జాగ్రతగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్ పేరుతో నూతన పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చూస్తే పొంగులేటి ఆ పని మీదనే ఢిల్లీ వెళ్ళారని అనుకోవచ్చని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తూ.. టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో పొంగులేటి ఢిల్లీ యాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు.
నిజానికి పొంగులేటి తనంతట తానుగా ఢిల్లీ వెళ్లలేదనీ బీజేపీ హై కమాండ్ పిలుపు మేరకే ఆయన ఢిల్లీ వెళ్ళారని పొంగులేటి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. నిజానికి, బీఆర్ఎస్ తో విభేదించి తిరుగుబాటు జెండా ఎగరేసినప్పటి నుంచి పొంగులేటి బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరతారని, వైఎస్సార్ టీపీలో చేరుతున్నారని ఇలా చాలా చాలా ఊహాగానాలు, వ్యూహాగానాలూ వినిపించాయి. అయితే అదేదీ జరగలేదు, ఇంతలో సొంత పార్టీ ఆలోచన తెరపైకి రావడం ఆ వెంటనే, బీజేపీ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకోవడంతో మళ్ళీ మరోమారు, ఆయన నెక్స్ట్ స్టెప్ ఏమిటనే విషయంలో ఫ్రెష్ గా తాజా చర్చ మొదలైంది.
వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తున్న బీజేపి.. అందుకోసం ఖమ్మం జిల్లాలో జన బలం కలిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేజారిపోకుండా ఒడిసి పట్టుకోవాలని చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపి అధిష్టానమే స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అధిష్టానం ఆహ్వానం మేరకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీకి వెవెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ నుంచే ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుదారులు చెబుతున్నారు.
అయితే రెండు మూడు నెలలుగా ఆత్మీయ సమ్మేళాల పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాలతో పాటుగా ఆటు ఉమ్మడి వరంగల్ ఇటు కరీంనగర్ పై దృష్టి పెట్టి పావులు కదుపుతున్న పొంగులేటి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సొంత పార్టీ ఆలోచను వదిలేసి, బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీలో చేరతారా? అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.