పిళ్లే ఆరెస్ట్.. హు ఈజ్ నెక్స్ట్ ?
posted on Mar 7, 2023 @ 5:10PM
ఢిల్లీ మద్యం కుంభకోణం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓ వంక సీబీఐ, మరోవంక ఈడీ విచారణ వేగం పెంచాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబదించి సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో పదేపదే ఒకటికి పదిసార్లు ప్రస్తావనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సన్నిహితులు, బి నామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకరొకరు అరెస్టవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ముఖ్య నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.
నిజానికి, వంద రోజులకు పైగానే ఢిల్లీ మద్యం కుంభకోణం స్టొరీ నడుస్తున్నా, కవితను సీబీఐ విచారించినా, ఇంతవరకు కేసు విషయంగా పెదవి విప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ తర్వాత పెదవి విప్పారు. ఈ కేసులో లేదా ఇతర అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ చిక్కుల్లో చిక్కుకున్న మరి కొన్ని పార్టీల నాయకులతో కలసి ప్రధానమంత్రికి లేఖ రాశారు. మరో వంక కవిత టీవీ ఇంటర్వ్యూల ద్వారా తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్లేందుకు సిద్దమంటూనే, కేంద్ర ప్రభుత్వం, ప్రధానీ మోడీ బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకే సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
సరే, అదలా ఉంటే.. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లైని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. ఆయనను కల్వకుంట్ల కవిత బినామీగా ఈడీ అధికారులు చెబుతున్నారు. నిజానికి మూడు రోజుల కిందటే సీబీఐ కేసుల్లో పిళ్లైకి ముందస్తు బెయిల్ వచ్చింది. కానీ సోమవారం (మార్చి 6) రాత్రి పొద్దుపోయాకా ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు కవిత కుటుంబంతో పాటు అభిషేక్ బోయినపల్లి కుటుంబం, అరుణ్ రాంచంద్ర పిళ్లై కుటుంబం వెళ్లారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వారిద్దరూ అరెస్టయ్యారు.
కాగా డిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరుణ్ పిళ్లై 17 పేజీల రిమాండ్ రిపోర్డులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్‌రెడ్డితోపాటు వైకాపా ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నారు.
కవితకు లబ్ధి కోసం ఆరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారు. ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు అరుణ్ పిళ్లై దర్యాప్తులో అంగీకరించారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించారు. అరుణ్ పిళ్లై కవిత బినామీ అని విచారణలో పలు మార్లు చెప్పారు. ఇదే విషయాన్ని మరి కొందరు కూడా చెప్పారు. మద్యం విధానం రూపకల్పనలో పిళ్లై కీలక పాత్ర పోషించారు అని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. సౌత్‌గ్రూప్ వ్యక్తుల సంస్థలన్నీ కలిసి రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ తెలిపింది.
కాగా జరుగతున్న పరిణామాలను గమనిస్తే, సీబీఐ, ఈడీలు చాలా పకడ్బందీగా కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయన్న అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనూ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ కవిత పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. కానీ ప్రతీ చార్జిషీటు, అఫిడవిట్‌లో కవిత పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. సౌత్ లాబీ పేరుతో ఢిల్లీలో మద్యం వ్యాపారం ఆమె బినామీలదేనని సీబీఐ అధికారులు చెబుతున్నారు.
దీనిపై కవితను ఓ సారి మాత్రమే ప్రశ్నించారు. గతంలో అసలు తన పాత్రే లేదని చెబుతూ వచ్చిన కవిత.. అరెస్టయిన వారు పరిచయస్తులని చెబుతున్నారు. వారు తనకు తెలిసినంత మాత్రాన తన లిక్కర్ స్కాంతో సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. తెలుగు మీడియా ముందు ఆమె తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే, ఎప్పుడన్నది పక్కన పెడితే, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.