మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ నోటీసులు
posted on Mar 8, 2023 8:26AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం (మార్చి 9)న ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో పదేపదే కవిత ప్రస్తావన రావడంతో ఆమెను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది.
ముఖ్యంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా అరెస్టు, ఆ వెంటనే హైదరాబాద్ కు పారిశ్రామిక వేత్త రుణ్ రామచంద్ర పిళ్లై అరెస్టు తరువాత ఇక తరువాయి కవితేనన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సన్నిహితులు, బి నామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒకరొకరినీ అరెస్టు చేసిన నేపథ్యంలోఆమెను కూడా అరెస్టు చేస్తారన్న అభిప్రాయం కూడా పొలిటిలక్ సర్కిల్స్ లో వ్యక్తమైంది. అందుకు బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు ఈడీ కవితకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చింది.
ముఖ్యంగా అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించడం, అలాగే మనీష్ సిసోడియాను ఈడీ విచారించడంతో ఆమెకు నోటీసులు ఖాయమన్న భావన వ్యక్తమైంది. అయితే ఆమెను ఎప్పుడు విచారణకు పిలుస్తారన్న విషయంలో ఉన్న సందిగ్ధతకు ఇప్పుడు తెరపడింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ కవితను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటి వరకూ 11 మంది అరెస్టయ్యారు. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు కవితకు నోటీసు ఇవ్వడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం విపక్షాలను అణచివేసేందుకు ఉపయోగిస్తోందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు విపక్ష నేతలు ప్రధాని మోడీకి లేఖ రాసిన ఒక రోజు వ్యవధిలోనే కవితకు ఈడీ నోటీసులు జారీ కావడం గమనార్హం.