లోకేష్ తో అడుగు కలిపిన వంగవీటి రాధా.. పార్టీ మార్పు వదంతులకు ఫుల్ స్టాప్
posted on Mar 7, 2023 @ 4:42PM
కాపు నేత, దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరబోతున్నారంటూ ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ విషయంలో రాధా ఇంత వరకూ నోరు విప్పలలేదు. తెలుగుదేశంలో కొనసాగుతున్నా ఆయన జనసేన వైపు అడుగులు వేస్తున్నారా అన్న అనుమానాలు అందరిలోనూ కలిగేంత రేంజ్ లో ఈ ప్రచారం జరిగింది.
అయితే ఇంత కాలంగా జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేననీ, ఆయన తన చేతల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అడుగు కలపడం ద్వారా తాను తెలుగుదేశంలోనే ఉన్నాననీ, ఆ పార్టీలోనే కొనసాగుతానని వంగవీటి రంగా స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా కనిపించారు. ఆయనతో పాటు కలిసి నడిచి తన సంఘీభావం తెలిపారు. దీనితో వంగవీటి రాధా జనసేనలో చేరుతున్నారంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్టయింది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో తెలుగుదేశం కార్యక్రమాలలో వంగవీటి రాధా పెద్దగా చురుగ్గా, క్రియాశీలంగా కనిపించకపోవడంతోనే ఆయన పార్టీ మారుతున్నారా అన్న వదంతులకు ఆస్కారం ఏర్పడింది. రధాకు మిత్రులుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వినవచ్చాయి.
అయితే ఆయన పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించడంతో ఈ వదంతులన్నిటికీ చెక్ పడినట్లైంది. వంగవీటి రాధా తండ్రి దివంగత వంగవీటి రంగాకు విజయవాడలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉంది. రంగా కన్నుమూసిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్ గా రంగా పేరు నిలిచిందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కొంత కాలంగా బెజవాడ రాజకీయం మొత్తం రాధా చుట్టూ తిరుగుతూ వచ్చింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే రాధా పార్టీ మార్పు విషయంలో ఇంత కాలం షికార్లు చేసినవన్నీ వదంతులేనని ఆయన లోకేష్ కు సంఘీభావం ప్రకటించడంతో తేలిపోయింది.