మోడీపై మరో లేఖాస్త్రం
posted on Mar 8, 2023 5:22AM
ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై విపక్ష పార్టీలు విర్సుకు పడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సిఎం మాన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ మరికొందరు ముఖ్య నేతలు సిసోడియా అరెస్ట్ ను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, చాలా కాలంగా మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్, డిఎంకే,వామపక్ష పార్టీలు మాత్రం సిసోదియా అరెస్ట్ ను అంతగా ఖండించలేదు.
కాగా తాజగా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం(మార్చి 7) ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే, విజయన్ సిసోడియా అరెస్ట్ ను ప్రత్యక్షంగా తప్పు పట్టలేదు, ఖండించనూ లేదు. రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయాలకు తావిచ్చే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని అన్నారు. వాటిని తొలగించేందుకు కృషి చేయాలని ప్రధానిని కోరారు. నిర్దిష్ట చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ ఏజెన్సీలపై ఒత్తిడి తెస్తున్నారనే అభిప్రాయాలకు సిసోడియా అరెస్టు మరింత ఊతమిస్తోందని అన్నారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
సిసోడియా కేసులో నగుదు స్వాధీనం చేసుకోవడం వంటి ఎలాంటి సాక్ష్యాలు లేవని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆప్ నేత సీబీసీ సమన్లతో విచారణ ముందుకు కూడా హాజరయ్యారని ప్రధానికి రాసిన లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. విచారణకు ఆటంకం కలుగుతోందని భావించినప్పుడు మాత్రమే అరెస్టు అనివార్యమవుతుందని, అలా కాని పక్షంలో అరెస్టు జోలికి వెళ్లక పోవడమే సబబని అన్నారు. పబ్లిక్ డొమైన్‌లో వచ్చిన సమాచారం ప్రకారం నగదు పట్టుబడటం వంటి ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాలు లేవని, చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందేనని, అయితే రాజకీయ కారణాలతోనే సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారనే విస్తృతాభిప్రాయాలను దృష్టిలో ఉంచుకునే విధంగా చర్యలు ఉంటాలని అన్నారు. రాజకీయ కారణాలే ఇందుకు కారణమా అనే అపోహలను తొలగించాలని ప్రధానిని కోరారు. సమాఖ్య స్ఫూర్తి, సిద్ధాంతాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
కేసు విచారణలో ఉన్నందున దాని మంచిచెడ్డలపై తాను మాట్లాడదలచుకోలేదని విజయన్ అన్నారు. న్యాయం జరగడమే కాదు...న్యాయం జరిగేలా చూడటం కూడా సహజన్యాయ సూత్రంలో కీలకమని చెప్పారు. రాజకీయాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే ప్రస్తుత అభిప్రాయాలను తొలగించేందుకు ప్రధానమంత్రి మార్గదర్శకంగా ఉండగలరన్న ఆశాభావాన్ని ఆయన తన లేఖలో వ్యక్తం చేశారు.
కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం, సిసోడియా అరెస్ట్ విషయాన్ని పక్కన పెడితే, ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు ప్రధాని మోడీకి లేఖ రాసిన రెండు రోజుల తర్వాత కేరళ ముఖ్యమంత్రి అదే అంశం పై ప్రధానికి ప్రత్యేకంగా లేఖ రాయడం, ప్రతిపక్ష రాజాకీయ శిబిరంలో విబెధాలకు అద్దం పడుతోంది, విపక్ష పార్టీల్లోని విభేదాలను మరో మారు చర్చకు తెచ్చిందని అంటున్నారు. అలాగే, విపక్ష పార్టీలు కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక, తటస్థ గ్రూపులుగా చీలి పోయిన వైనం స్పష్టమవుతోందని అంటున్నారు.