అబద్ధాల కథలల్లి అడ్డంగా దొరికిపోయారా?
అబద్ధాలు చెప్పేవాళ్లకి జ్ణాపకశక్తి ఎక్కువ ఉండాలి. అప్పుడే వారు చెప్పిన అబద్ధానికి కట్టుబడి ఉండగలుగుతారు. లేకపోతే గతంలో ఏం చెప్పామో గుర్తు ఉండదు. కనుక మరేదో చెప్పి దొరికి పోతూ ఉంటారు. నవ్వుల పాలౌతారు. రోజుకో కొత్త కథ అల్లలేక ఉక్కిరిబిక్కిర అవుతుంటారు. వివేకా హత్య కేసులో జగన్ అండ్ కో ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో వారు గతంలో ఎవరి మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో వారి వేళ్లెటు చూపుతున్నాయి అన్నది గమనిస్తే.. స్వయంగా తమ అబద్ధాలతోనే వారు అడ్డంగా దొరికిపోయారన్న భావన దర్యాప్తు పూర్తి కాకుండానే, వివేకా హత్య కేసులో దోషులెవరన్నది న్యాయస్థానం ఇంకా నిర్ధారించకముందే జనానికి అర్ధమైపోతోంది అనే పరిస్థితి ఏర్పడింది.
కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ముందు బాబాయ్‌ది గుండెపోటు కథ బెడిసి కొట్టడం, ఆయన గొడ్డలి పోటుతో హత్యకు గురయ్యారని తేలిపోవడంతో వెంటనే అప్పటికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడిపై, ఆయన కుమారుడు, అప్పటి మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నారు కనుక దర్యాప్తును ప్రభావితం చేస్తారు, విచారణ సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ గుండెలు బాదుకున్నారు. సరే అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని వారే చెప్పారు. అది పక్కన పెడితే.. వివేకా కుమార్తె తన తండ్రి హత్యకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలియాల్సిందేనంటూ చేస్తున్న న్యాయపోరాటం కారణంగా అసలు హంతకులు ఎవరన్నది తేలే దిశగా దర్యాప్తు సాగుతున్న సమయంలో అల్లుడే అసలు హంతకుడంటూ చెబుతున్నారు. అంటే గతంలో వీరే ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా? అంటూ చేసిన వాదన కాస్తా..ఇప్పుడు కను రెప్పే కంటిని మింగేసింది అనే స్థాయికి వచ్చేసింది.
వివేకా అసలు హంతకుడు, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డేనని.. ఈ కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫున వాదించిన లాయర్ శుక్రవారం (మార్చి 10)న కోర్టులో సంచలన ఆరోపణ చేశారు. వివేకా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత.. ఆయన కుటుంబం వివేకాను దూరం పెట్టడంతో పాటు, ఆయన చెక్ పవర్‌నూ లాగేసుకుందన్నది, అవినాష్‌రెడ్డి లాయర్ కోర్టులో చేసిన వాదన. హత్యకు ఆ నేపథ్యమే కారణమన్నది ఆయన తెరపైకి తెచ్చిన వాదన.
వివేకా ,రెండో భార్య కొడుకును వారసుడిగా ఎంపిక చేసుకునే క్రమంలో.. కుటుంబంలో వచ్చిన కలతలే, ఆయన హత్యకు కారణమన్నది అవినాష్‌రెడ్డి లాయర్ ఆరోపణ. అసలు సీబీఐ ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదన్నది ఆయన ప్రశ్న. ఇది కోర్టులో అవినాష్ రెడ్డి న్యాయవాది చేసిన వాదన కనుక ఇది అవినాష్ చెప్పినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అవినాష్ రెడ్డి చెప్పినట్లుగానే ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తారు. దీనిని బట్టే గతంలో జగన్, అవినాష్ సహా వైసీపీ నేతలు చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తేటతెల్లమైపోయింది. వైఎస్ వివేకా రెండో పెళ్లి గురించీ, ఆయన ఇబ్బందుల గురించీ, ఆయన కుటుంబంలో వచ్చిన కలహాల గురించీ.. ఇప్పటి వరకూ పాపం వీరికెవరికీ తెలియలేదా? వివేకా అల్లుడే.. మామను చంపిన విషయాన్ని ఇప్పుడు బయట ప్రపంచానికి చెబుతున్న అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య జరిగినప్పుడు మీడియాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు? పోనీ ఈ సంగతిని అప్పట్లో హత్య కేసును విచారించిన ‘సిట్’కు ఎందుకు చెప్పలేదు. జగన్ సీఎం అయిన ఏడాది వరకూ మనుగడలో ఉన్న సిట్‌కు వివేకా అల్లుడిపై కనీసం ఫిర్యాదు కూడా చేయలేదెందుకు? ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఈ కేసులో నిండా ఇరుక్కున్నామని తేలిపోయిన తరువాత ఇప్పుడు తప్పించుకోవడానికి, లేదా దర్యాప్తును పక్కదారి పట్టించడానికి కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారా అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.
అయితే ఏ నోటితో అయితే హత్య జరిగిన సమయంలో చంద్రబాబు తదితరులపై ఆరోపణలు గుప్పించారో, ఇప్పుడు అదే నోటితో తాము గతంలో చెప్పినదంతా అబద్ధమని ఒప్పుకుంటున్నారని వివేకా అల్లుడే హంతకుడు అన్న అవినాష్ మాటలతో తేటతెల్లమైపోయింది. ఇక వివేకా అల్లుడే హంతకుడు అని స్వయంగా అవినాషే చెప్పేసిన తరువాత.. ఇప్పుడు తెరమీదకు హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలో అంటే సంఘటనా స్థలంలో, అంటే హత్యకు గురైన వివేకా నివాసంలో రక్తపు మరకలు తుడిచిందెవరు? వివేకా మృతదేహానికి కుట్లు వేసిందెవరు? అన్న ప్రశ్నలకు కూడా అవినాషే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హత్య జురిగిన వెంటనే గంటల పాటు అవినాష్ రెడ్డి ఫోన్ లో ఎవరితో మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? అవినాష్ కాల్ డేటా ఆధారంగా సీబీఐ వెలుగులోకి వచ్చిన పేర్లలో వివేకా అల్లుడి పేరు ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు కూడా ఈ అబద్ధాల హరిశ్చంద్రులు బదులు చెప్పాల్సి ఉంది. అసలు హంతకులు అల్లుడే అని చెబుతున్నారు.. మరి గుండెపోటుతో మరణించారని అప్పడు అంత కచ్చితంగా ఎలా, ఎందుకు చెప్పారు? గుండెపోటు కథ తరువాత ఈ హత్య వెనుక ఉన్నది నారా చంద్రబాబునాయుడే అని ఎలా చెప్పగలిగారు?
వివేకా హత్య వెనుక చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించిన వీరు.. మరి ఇప్పుడు కోర్టులో వివేకా అల్లుడే అసలు హంతకుడని ఎందుకు చెబుతున్నారు? కట్టుకథలు అల్లి నేరం నుంచి తప్పించుకోవాలన్న ఆత్రం, తపనతో నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ.. చెప్పిన అబద్ధం మర్చిపోయి ఎప్పటికప్పుడు అల్లుతున్న కొత్త అబద్ధాల కథల వల్లే ఇప్పుడు వివేకా హత్య కేసులో దర్యాప్తు జరుగుతుండగానే, కోర్టులో కేసు తేలకుండానే జనం దోషులెవరన్నది నిర్ధారణకు వచ్చేసే అవకాశాన్ని అవినాష్ రెడ్డే స్వయంగా ఇచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.