విదేశీ గడ్డపై ఇవేమి వ్యాఖ్యలు.. రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్
posted on Mar 8, 2023 5:55AM
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ ( బ్రిటన్) పర్యటన వివాదాస్పదంగా మారింది. విదేశీ గడ్డపై నుంచి రాహుల్ గాంధీ దేశ అంతర్గత రాజకీయ విభేదాలను ప్రస్తావించడం, దేశ అంతర్గత విషయాల్లో విదేశాల జోక్యం చేసుకోవాలని కోరడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ, రాహుల్ గాంధీ భారత దేశాన్ని అవమానిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌కు వెళ్ళి భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. ఒకవేళ ఈ వ్యాఖ్యలను సమర్థించకపోతే, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేయాలని కోరారు. నిజానికి, బీజేపీ నాయకులు మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సంర్ధించేందుకు వెనకా ముందు అవుతున్నారు.
రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, యూరోప్, అమెరికా దేశాలు భారత దేశం నుంచి వ్యాపార, వాణిజ్యాలను, ఆదాయాన్ని పొందుతున్నాయని, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశాలు చేయవలసినంత చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బ్రిటన్ ప్రసంగాల్లో భారత దేశాన్ని అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరడం అత్యంత బాధ్యతారహితమని, దీనిపై ఖర్గే, సోనియా గాంధీ తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.
గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన దివంగత ఏకే ఆంటోనీ అధికారికంగా చైనాపై తెలిపిన వైఖరిని రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవడం లేదు అని ఆంటోనీ గతంలో అన్నారని ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో మాట్లాడుతూ, చైనా ముప్పును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అర్థం చేసుకోవడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ప్రసాద్ ఈ ప్రస్తావన చేశారు.
ప్రస్తుతం బ్రిటన్పర్యటనలో ఉన్న రాహుల్.. బీజేపీ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతు నొక్కెస్తున్నారని.. మైకులు ఆఫ్ చేస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి.. ఇతర దేశాల్లో రాహుల్ ఈ విధంగా మాట్లాడడం సరికాదని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ అటెండెన్స్‌పై ఆసక్తికర గణాంకాలు బయటకువచ్చాయి. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్‌లో రాహుల్ అటెండెన్స్‌ను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
భారత్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిరాధారమైనవిగా కంచన్ గుప్తా కొట్టిపారేశారు. పార్లమెంట్‌లో తమ మైక్‌లు పని చేస్తాయి.. కానీ వాటిని ఆన్ చేయలేమని.. తాను మాట్లాడుతున్నప్పుడు ఇది చాలాసార్లు జరిగిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు సైతం భారత్ పార్లమెంట్ సమావేశాలు మొత్తం జరిగాయని కంచన్ గుప్తా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తమ పేలవమైన పని తీరును కప్పిపుచ్చుకునేదుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్ అటెండెన్స్ డేటాను ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్ హాజరు కేరళ సగటు కంటే చాలా తక్కువగా ఉందని కంచన్ గుప్తా వరుస ట్వీట్లలో ఆరోపించారు. జాతీయ సగటు కంటే కూడా ఆయన హాజరు శాతం చాలా తక్కువ అని విమర్శించారు. 2020లో పార్లమెంట్ వర్షకాల సమావేశాలలో రాహుల్ గాంధీ హాజరు శాతం జీరోగా ఉందన్నారు. ఓవరాల్‌గా రాహుల్ పార్లమెంట్ అటెండెన్స్ 52శాతమేనని.. అదే సమయంలో మొత్తం ఎంపీల హాజరు శాతం 79గా ఉందన్నారు. భారత పార్లమెంటులో 2019 నుంచి 2023 మధ్య రాహుల్ గాంధీ 92 ప్రశ్నలు అడిగారని.. ఇందుకు సంబంధించి కేరళ ఎంపీల సగటు 216గా, జాతీయ సగటు 163గా ఉందని విమర్శించారు. సగటున భారత్ ఎంపీలు 68 చర్చల్లో పాల్గొంటే.. రాహుల్ గాంధీ స్కోర్ దారుణంగా 6 మాత్రమే ఉందని వరుస ట్వీట్లలో ఫైర్ అయ్యారు. దీంతో ట్విట్టర్‌లో బీజేపీ మద్దతుదారులు సైతం కంచన్ గుప్తా ట్వీట్లను రీట్వీట్ చేస్తూ రాహుల్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.