ఎమ్మెల్సీ కవిత దూకుడుకు కారణమేంటి ?
posted on Mar 7, 2023 @ 3:34PM
కల్వకుంట్ల కవిత. మాజీ ఎంపీ అయినా, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినా వీటన్నిటి కంటే ముందు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె. రాజకీయంగా ఆమె ఉనికికీ, ప్రధాన్యతకు, ప్రాముఖ్యతకూ ప్రధానంగా అదే కారణం. తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ కూడా కవిత చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతి ద్వారా ఆమె తనదైన గుర్తింపు పొందానడంలో సందేహం లేదు.
అయినా వాస్తవానికి ఆమె రాజకీయానికి పునాది, ఆమె కుటుంబం. కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదో లేదో కానీ, కవిత రాజకీయ జీవితం ఇలా ఉండేది కాదు. అందులో సందేహం లేదు. కల్వకుట్ల బ్రాండ్ , కేసీఆర్ కుమార్తె ఈ రెండే ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణం. అది పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఆ చిక్కులు, సమస్యలు ఒంటరిగానే ఎదుర్కొన వలసి వచ్చింది. తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఆమెకు ఎలాంటి సహాయమేనా చేయవచ్చునేమో కానీ ఆమెను ఆరోపణల నుంచి బయటపడేయగలిగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే బీజేపీ వారు కవితను బీజేపీలో చేరాల్సిందిగా ప్రలోభపెట్టారనీ అందుకు నిరాకరించడం వల్లే ఆమెపై ఈ ఆరోపణలని ఒక సందర్బంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు కూడా.
అయితే ఆ తరువాత సీబీఐ కవితను విచారించడం, ఈడీ చార్జిషీట్ లో పేరు ప్రస్తావించడం జరిగింది. ఇక అప్పటి నుంచీ కవితపై ఆరోపణల మచ్చ పార్టీకీ, కుటుంబానికీ అంటకుండా ఉండేలా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారా అన్న అనుమానాలు కలిగే విధంగా ఆయన మౌనం వహించారు. ఆయన మౌనాన్ని బట్టి కల్వకుంట్ల కవితకు పార్టీ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ ఎటువంటి మద్దతూ లభించే అవకాశాలు లేవనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో కవితే స్వయంగా తనపై కేసులు, ఆరోపణలు, వేధింపుల వెనుక ఉన్నది రాజకీయమే అని గట్టిగా చెప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆమె ఎంత గట్టిగా లిక్కర్ కుంభకోణంలో తన ప్రమేయం లేదు.. అదంతా రాజకీయ ప్రేరేపితమే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అంతే గట్టిగా ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ఇదే కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు.. ఆ వెంటనే సోమవారం అంటే మార్చి 6న హైదరాబాద్ కు చెందిన అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. అలాగే ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన మనీష్ సిసోడియాను ప్రశ్నించేందుకు ఈడీ కోర్టు అనుమతి తీసుకుంది. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవితకూ చిక్కులు తప్పవన్న అభిప్రాయమే సర్వత్రా బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనీష్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ.. దర్యాప్తు సంస్థలు విపక్షాల నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ ప్రధానికి ఓ లేఖ రాసి మిన్నకున్నారు.
నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఈ కేసు విచారణ చేస్తున్న, సీబీఐ ఆమెకు సీఆర్పీసీ 160 నోటీసు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె మూడు నాలుగు పర్యాయాలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, ఇతర పార్టీ నేతలతో పాటుగా, న్యాయవాదులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర గురించి, ఆ కేసులోంచి ఆమె బయటపడే మార్గాల గురించి చర్చించినట్లు వార్తలొచ్చాయి. అలాగే కవితకు నోటీసులు వచ్చిన వెంటనే మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పోటాపోటీగా కవితకు మద్దతు ప్రకటిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించి మరీ కేంద్రాన్నీ, ప్రధాని మోడీనీ విమర్శించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రభావితం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడంతో భయపడిన మోడీ ఆయనను కట్టడి చేసేందుకే కవితను టార్గెట్ చేశారంటూ విమర్వలు కూడా గుప్పించారు. అంతే ఆ తరువాత బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఆమెకు మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు కవిత ఒంటరిగానే కేంద్రంపై విమర్శల దాడి ప్రారంభించారని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లపైకి సీబీఐ వస్తోంది, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, తనపై జరుగతున్న దాడులు కూడా అదే కోవకు చెందుతాయని కవిత అంటున్నారు.
దాడులకు భయపడేది లేదని చెబుతున్నారు. హస్తినలో ధర్నాకు రెడీ అయ్యారు. కేంద్రంపై విమర్శల దాడి విషయంలో కవిత దూకుడు పెంచారు. రాజకీయ కారణాలతోనే మద్యం కుంభకోణంలో తనను ఇరికించారని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె ఈ ప్రయత్నంలో ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటనలూ రావడం లేదు. వీటన్నిటినీ బట్టి చూస్తే మద్యం కుంభకోణంలో కవితకు కుటుంబం, పార్టీ అండగా నిలబడటం లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.