విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ!
posted on Mar 8, 2023 7:28AM
విశాఖ వేదికగా జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఘాత్మకంగా అనే కంటే హడావుడిగా, ఆర్భాటంగా రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సాధించిందేమిటన్న దానిపై భిన్న వాదాలు, అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి. అవన్నీ పక్కన పెడితే అధికారంలో ఉన్న నాలుగేళ్లుగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి వీసమెత్తు ప్రయత్నం చేయని జగన్ సర్కార్.. తీరా ఎన్నికలకు సిద్ధమౌతున్న వేళ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును ఇంత హడావుడిగా, ఆర్భాటంగా నిర్వహించడమే విడ్డూరం.
మామూలుగానే ఇలాంటి సదస్సుల్లో ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ తమ పెట్టుబడులను గ్రౌండ్ చేస్తాయన్న నమ్మకం లేదు. సదస్సు వేదికగా పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు ప్రకటించడం షరామామూలుగానే జరుగుతుంటుంది. అయితే ఆ తరువాత పెట్టుబడుల వచ్చాయా లేదా అన్నది ఎప్పటికో కానీ తెలియదు. ఇక జగన్ సర్కార్ తన అధికారం చివరి సంవత్సరంలో నిర్వహించిన ఈ సదస్సు ప్రధాన లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణ కంటే రాజకీయంగా పట్టు, పలుకుబడి సంపాదించడానికి, రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో చేస్తున్నామని జనాన్ని నమ్మించడానికేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. ఇటీవలి కాలంలో జగన్ పట్ల, ఆయన సర్కార్ పట్ల ప్రజలలో ఇమేజ్ మసకబారిన నేపథ్యంలో దానిని పెంచుకోవడానికే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర ఓ కార్యక్రమం నిర్వహించారన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయంటూ ఆర్భాటపు ప్రకటనలే తప్ప వాస్తవంగా కుదిరిన ఒప్పందాలేమిటి? ఆ ఒప్పందాలు కుదిరిన కంపెనీల జాబితా ఏమిటి? ఏయే రంగాలలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి అన్న వివరాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో గుజరాత్, మహారాష్ట్రలలో ఆర్భాటంగా సమ్మిట్ లు నిర్వహించి అప్పట్లో ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు తమ ఇమేజ్ ను పెంచుకున్నాయి. అదే దారిలో ఇప్పడు ఏపీలో జగన్ సర్కార్ కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించింది. 13 లక్షల కోట్ల రూపాయల మేరకు 342 అవగాహనఒప్పందాల మీద సంతకాలు జరిగాయని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ ఓ 74 కంపెనీల పేర్లు ప్రకటించింది. ఆ కంపెనీల చరిత్ర ఏమిటీ, వాటి సత్తా ఏమిటి అన్న విషయంలో సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవి ప్రకటించిన పెట్టుబడులకు, వాటి వాస్తవ ఆర్థిక పరిస్థితికి పొంతన లేదన్నట్లుగానే ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో లేని కొన్ని కంపెనీలు, కొందరు పారిశ్రామిక వేత్తలూ కూడా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్పు వేదికగా తాము ఇన్వెస్ట్ చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. మరి వాటి పేర్లు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఎందుకు లేవన్నది ఇప్పటివరకూ అయితే సమాధానం దొరకని ప్రశ్నే.
ఇక ఈ ఇన్వెస్టర్ల సదస్సు వెనుక పెద్ద భూ కుంభకోణానికి స్కెచ్ ఉందన్న ఆరోపణలూ వినవస్తున్నాయి. పెట్టుబడులు గ్రౌండ్ అవ్వడంతో సంబంధం లేకుండా కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టే కుట్ర దాగుందని పలువురు విశ్లేషణలు చేశారు. ఇక అన్నిటికీ మించి ఈ సదస్సులో హైలైట్ అయ్యిందేమిటంటే.. భోజనాల దగ్గర ఇన్వెస్టర్ల తోపులాట, సదస్సు కిట్ల కోసం జరిగిన తొక్కిసలాట. వేల, లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలైతే.. ఇలా తోపులాటలు, తొక్కిసలాటలూ జరిగేవా? వారంతా హుందాగా వ్యవహరించేవారు కదా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడులు పెడతామంటూ వచ్చిన వారిలో ఎక్కువ మంది ఐప్యాక్ సభ్యులేనంటూ కొన్ని ఫొటోలను కూడా విపక్షాలు మీడియాకు విడుదల చేశాయి. ఏమి ఏమైనా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు పేర జగన్ సర్కార్ గారడీ చేసిందన్న అభిప్రాయమే గట్టిగా వ్యక్తమౌతోంది.