మంత్రి రోజా ‘పుష్ప విలాపం’
మంత్రి రోజా అందరిలాంటి నాయకురాలు కాదు. ఫైర్ బ్రాండ్ లీడర్.. అది వెండితెర అయినా, బుల్లి తెర అయినా, రాజకీయ వేదికే అయినా ఆమె నోరు తెరిస్తే... నిప్పుల వర్షం కురుస్తుది. అవతలి వారు ఎంతవారైనా రోజా డోంట్ కేర్. తగ్గేదే లే .. కడిగేయడమే కానీ, కన్నీళ్లు పెట్టుకోవడం గతంలో ఎరగరు. కానీ ఇప్పడు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అవును, జబర్దస్త్ గా నవ్వడమే కానీ, ఏడుపు అన్నది ఎరుగని మంత్రి రోజా.. భోరు భోరున విలపించారు. అంటే ఏడ్చారు. అవును అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాతశత్రువే అలిగిననాడు, అన్నట్లు ఏడుపే ఎరుగని మంత్రి రోజా, నిజంగా కన్నీరు పెట్టుకున్నారు. విలపించారు.
అయితే రోజా ఎందుకు విలపించారు? బుల్లి తెరకు వెకిలి నవ్వులు, వికృత నవ్వులు పరిచయం చేసిన(ఇప్పడు ఏ టీవీలో చూసినా, సో .. కాల్డ్ సెలేబ్రిటీలు, సో .. కాల్డ్ కమెడియన్లు, యాక్ ..రయ్యలు, అమ్మలు అందరూ ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా వెకిలిగా నవ్వడం ఒక ట్రెండ్ గా మారి పోయింది.) జబర్దస్త్ రోజా ఏమిటి? ఏడవడం ఏమిటీ? అంటే అందుకో కథ, కారణం ఉంది. సోషల్ మీడియాలో రోజా ఏడుపుకు చాలా చాలా రీజన్స్ వినిపిస్తున్నాయి.
రాజకీయ ప్రయాణంలో తాను ఎదుర్కున్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని, రోజా కన్నీరు పెట్టుకున్నారు...ట. అన్నిటినీ మించి, తనది, ‘ఐరెన్ లెగ్’ ఆని ప్రత్యర్ధులు చేసిన, చేస్తున్న విమర్శలు ఆమెను ఎంతగా బాధిస్తున్నాయో ఆమె విపులంగా చెప్పుకొచ్చారు. అలా చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు, ఆ ‘పుష్ప విలాపం’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే రోజా ఏడుపుకు, ఆమె రాజకీయాల్లో చవిచూసిన సినిమా కష్టాలే కారణమా? లేక ఇప్పడు వైసీపీలో వినిపిస్తున్న ‘ఐరన్ లెగ్’ కామెంట్స్ కారణమా? అంటే సినిమాల్లో హిరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, తెలుగుదేశం పార్టీలో చేరి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని సైతం డోంట్’కేర్ అన్నపద్దతిలో తిట్టిపోసిన రోజా, తర్వాత అదే వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి పెట్టిన పార్టీ వైసీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్ల్యే అయ్యారు. ఇప్పడు మంత్రిగా ఉన్నారు. సో.. రాజకీయాలల్లో ఆమె పడిన కష్టాలు పెద్దగా లేవు. ఒక విధంగా ఆమె రాజకీయ వైకుంఠపాళీలో పాములను తప్పించుకుని కొంచెం వేగంగానే నిచ్చెనలు ఎక్కారు.
అయితే, తెలుగు దేశం పార్టీలో చంద్రగిరి నుంచి రెండుసార్లు పోటీ చేసి రెండు సార్లూ ఓడి పోయిన తర్వాత ఆమె కోరుకున్న సీటు (నగరి) రాక, 2009 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. అయితే, ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో ఆమె కాంగ్రెస్ లో చేరలేక పోయారు. అప్పట్లోనే రోజా అంటే గిట్టని వాళ్ళు, అమెది ఐరన్ లెగ్ అంటూ ఎగతాళి చేయడం ప్రారంభించారని అంటారు.
ఆ తర్వాత ఆమె వైసేపీలో చేరి నగిరి నుంచి రెందు సార్లు గెలిచారు. అయినా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆమెకు తొలి విడతలో మంత్రి పదవి దక్కలేదు. గత సంవత్సరం (2022) ఏప్రిల్ లో జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది, కానీ, ఈసారి ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కే ఛాన్స్ లేదంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గడప గడపకు సమీక్ష సమయంలో అందరి ముందు వార్నింగ్ ఇచ్చిన మంత్రులలో రోజా పేరు కూడా వుంది. అదీ గాక నియోజకవర్గంలో ఆమెకు ఎదురు గాలి వీస్తోందనే ప్రచారం జరుగుతోంది. స్థానిక వైసీపీ నాయకులు కూడా అభ్యర్థిని మార్చాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో రోజాను తప్పించి స్థానికంగా అందుబాటులో ఉండే అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నారు.ఆ ఫ్రస్ట్రేషన్ లోనే రోజా... తనను ఐరన్ లెగ్ అంటున్నారని.. కన్నీళ్లు పెట్టుకున్నారని అంటున్నారు. అయితే అవి నిజం కన్నీరా, సానుభూతి కోసం పెట్టుకున్న గ్లిజరిన్ కన్నీరా.. అంటే ఎంతైనా నటి కదా ... గ్లిజరిన్ కన్నీళ్లు అయినా కావచ్చును అంటున్నారు.