చాగంటి.. ఔనని కాదన్నారా?.. ఔననలేక కాదన్నారా?
posted on Mar 8, 2023 @ 9:39AM
పిలిచి పిల్లనిస్తానంటే వద్దనే వారు ఉంటారేమో కానీ, కుర్చీ వేసి పదవి ఇస్తామంటే వద్దనే వారు సహజంగా ఉండరు. నిజానికి, సర్కార్ పదవుల కోసం చాలామంది చాలా రకాల పైరవీలు చేయడం, లక్షల రూపాయల కానుకలు సమర్పించుకోవడమూ తెలియని విషయాలు కావు. కానీ, అందరూ అలానే ఉండరు. పదవి వలన వ్యక్తిగత ప్రతిష్ట దిగజారుతుందని భావించడం వల్లనో లేక పదవికి తమ ప్రవృత్తికి పొంతన కుదరని కారణంగానో వచ్చిన పదవిని వద్దని తిరస్కరిస్తారు.
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అదే చేశారు. చాగంటిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రతిపాదనను టీటీడీ ద్వారా ఆయనకు తెలియచేసింది. అయితే చాగంటి సర్కార్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తిరస్కరిస్తూనే చురకలు కూడా అంటించారు. టీటీడీ బోర్డు సభ్యులు, చైర్మన్, కార్యనిర్వహణాధికారి వంటి అన్నీ తెలిసిన సర్వజ్ఞులకు సందేహాలు రావడం ఏమిటి.. నేను సలహా ఇవ్వడం ఏమిటి, అలాంటి అవసరమే రాదు.. ఒక వేళ వచ్చినా అది తీర్చగల సామర్ధ్యం తనకు ఉందో లేదో అని వినమ్రంగా సూదులు గుచ్చారు. అలాగే, టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులే అవసరం లేదని తిరుమల వేంకటేశ్వరుని సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తానని.. టీటీడీకి తన అవసరం ఎప్పుడొచ్చినా స్వామి సేవకు సిద్ధంగా ఉంటానని, పదవి మాత్రం వద్దని స్పష్టం చేశారు.
నిజానికి, గతంలో చాగంటి (వంటి) వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించాలని హిందూ ధార్మిక సంస్థలు, శ్రీవారి భక్తులు ఎన్నో విజ్ఞప్తులు చేశారు. రాజకీయాలకు అతీతంగా, హిందూ ధర్మం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నవారినే టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమించాలనే ప్రతిపాదనలూ వచ్చాయి. కానీ, ప్రభుత్వం భక్తుల అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి సొంత బాబాయిని చైర్మన్ గా నియమించింది. అలాగే మత విశ్వాసాల పరంగా అనుమానస్పద వ్యక్తులనూ బోర్డు సభ్యులుగా నియమించారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, బోర్డు చైర్మన్ సహా కొందరు సభ్యుల మత విశ్వాసాల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమైనా, జగన్ రెడ్డి అవేవీ పట్టించుకోలేదు. రెండవసారి కుడా బాబాయ్ నే టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఒక విధంగా టీటీడీ బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారనే ఆరోపణలున్నాయి. ఇక టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏడుకొండలను వ్యాపార, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు జరుగుతున్న కుట్రల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. అందుకే చాగంటి వారు సలహాదారు పదవిని తిరస్కరించి ఉంటారని హిందూ ధర్మం పట్ల విశ్వాసమున్న భక్తులు భావిస్తున్నారు.
అయితే, పదవిని తిరస్కరించిన చాగంటి సతీసమేతంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఏమి మాట్లాడారు? ఈ విషయంలో ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పడు ఎందుకు ఒక్కసారిగా తెరపైకొచ్చి, పదవి వద్దనే ప్రకటన చేశారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి జనవరి 21న హెచ్‌డీపీపీ కార్యనిర్వాహక కమిటీ టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్వయంగా మీడియా వేదికగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ నియామకం చేపట్టినట్లు అప్పట్లో సుబ్బారెడ్డి మీడియా ముఖంగా చెప్పారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సలహాదారు పదవిని ఇస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత చాగంటి సీఎం జగన్‌ను కలిశారు. కృతజ్ణతలు తెలియజేశారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో చాగంటి టీటీడీ పదవిని ఇలా తిరస్కరించడంతో ఆయన కాదనలేక అవునన్నారా? అవుననలేక కాదన్నారా?అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకరో ఇద్దరో కాదు, వందల మందిని సలహాదారులుగా నియమించింది. ఇందులో చాలా వరకు, జగన్ పల్లకీ మోసే రాజకీయ నాయకులు, ఆయనకు వంతపాడిన, పాడుతున్న జర్నలిస్టులే ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో, సలహాదారుల నియామకలకు సంబంధించి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అదే జరిగితే, ఇంతకాలం తమ ప్రవచనాల ద్వారా హిందూ సమాజానికి మార్గదర్శనం చేసున్న చాగంటి వ్యక్తిత్వం పై మచ్చపాడే ప్రమాదం వుంది. అందుకే ఆయన ఆ పదవిని తిరస్కరించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అలాగే జగన్ రెడ్డి గతంలో హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు స్వరూపానంద స్వామిని ఉపయోగించున్నారు, ఇప్పడు చాగంటిని ఉపయోగించుకునే వ్యూహం తో ఆయనకు పదవి ఆశ చూపారని కూడా వార్తలు వచ్చాయి. ఈ రాజకీయ కుట్రను ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్న చాగంటి, పదవి వద్దన్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఏదైనా చాగంటి మెత్తని చెప్పుతో సున్నితంగా చెప్పవలసింది చెప్పారనే మాటే గట్టిగా వినిపిస్తోంది.