ఏపీలో తెలుగుదేశంకే జనం జై.. శ్రీ ఆత్మ సాక్షిసర్వే వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే.. విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి ఏమిటి.. 175కు 175 స్ధానాలలో విజయం సాధిస్తామన్న వైసీపీ ధీమా, తమ గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్న విపక్షం విశ్వాసం. వాస్తవంగా ప్రజలేమనుకుంటున్నారు. అంటే శ్రీ ఆత్మసాక్షి సర్వే అటు అధికార పార్టీ ధీమా.. ఇటు విపక్షం విశ్వాసం రెండూ కూడా అతిశయోక్తిగానే ఉన్నాయని చెబుతోంది. 175కు 175 సంగతి పక్కన పెట్టి అసలు అధికారంలోకి రావడానికి అవసరమైన స్థానాలలో గెలవడానికే వైసీపీ చెమటోడ్చక తప్పదని చెబుతోంది. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే బ్రహ్మాండంగా పుంచుకున్న తెలుగుదేశం కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే మరింత కసరత్తు చేయక తప్పదని సర్వే పేర్కొంది.
ఏపీలో రాజకీయ వేడి ఎల్ నినో కారణంగా వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తలదన్నేలా ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిపైనే సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతున్నాది. ఈ నేపథ్యంలోనే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పెచ్చరిల్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో వాస్తవంగా ఏ పార్టీకి మెరుగైన విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ వెనుకబడి ఉంది. ఇత్యాది అంశాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని వెలువరించింది.
ఎన్నికల ఫలితాలను దాదాపు కచ్చితంగా అంచనా వేసే సర్వే సంస్థలలో శ్రీ ఆత్మసాక్షి ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తి సాధికారతతో ముందుగానే శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఆ సర్వేలో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయాన్ని యాక్యురేట్ గా అంచనా వేసింది. సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు ఉన్నాయి. అప్పటి ఎన్నికలలో వైసీపీ 139 నుంచి 142 స్థానాలలో విజయం సాధిస్తుందని, అలాగే అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం 22 నుంచి 28 స్థానాలలో విజయం సాధిస్తుందని ఇక జనసేన 0 నుంచి 2 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వాస్తవ ఫలితాలు కొంచం అటూ ఇటూలో సరిగ్గా అలాగే వచ్చాయి. వైసీపీ 151 స్థానాలలో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో గెలుపొందింది. ఇక పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అలాగే పాలకొల్లు, ఉండి, హిందుపూర్, ఇచ్చాపురం, అలాగే విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలనూ కూడా వైసీపీ కోల్పోతుందని కచ్చతంగా అంచనా వేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. ఫలితం కూడా అలాగే వచ్చింది. అదే విధంగా రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు నియోజకవర్గాలలో వైసీపీ 22 స్థానాలలోనూ తెలుగుదేశం 2 స్థానాలలోనూ విజయం సాధిస్తాయన్న శ్రీ ఆత్మసాక్షి సర్వే అంచనా అక్షరాలా నిజమైంది.
ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో కూడా శ్రీ ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందో సరిగ్గా అదే జరిగింది. ఫలితం అలాగే వచ్చింది.
దీంతో శ్రీ ఆత్మసాక్షి సర్వేలపై ప్రజలలో విశ్వసనీయత పెరిగింది. అటువంటి సంస్థ తాజాగా మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలలో గెలుచుకుంటుంది. ఏ యే స్థానాలలో హోరాహోరీ పోరు ఉంటుంది అన్న అంశాలపై రాష్ట్రంలో దశల వారీగా సమగ్ర సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాలను సమగ్రంగా వెలువరించింది. జిల్లాల వారీగా నియోజకవర్గాలలో పార్టీల విజయావకాశాలు, హోరాహోరీ పోరు ఉండే నియోజకవర్గాలు ఇత్యాది వివరాలతో శ్రీ ఆత్మసాక్షి సర్వే విడుదల చేసింది.
జిల్లాల వారీగా ఏయే నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి. ఏయే నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు అన్న అంశాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఒకింత మొగ్గు కనిపిస్తున్నా.. గెలుపు అంత సులభసాధ్యం కాదని సర్వే ఫలితం చెబుతోంది. అలాగే మరో సారి అధికారం చేజిక్కించుకుకోవడంపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీకి అంత సీన్ లేదనీ సర్వే ఫలితం వెల్లడించింది. శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా, నిష్పాక్షికంగా ఈ సర్వే నిర్వహించింది. ఇద్దరు ఎన్ ఆర్ ఐలు, ముగ్గురు రాజకీయవేత్తల కోరిక మేరకు ఈ సర్వే నిర్వహించింది.
మొదటి దశ సర్వేను గత ఏడాది సెప్టెంబర్ 3న విడుదల చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 77 స్థానాలలో, వైసీపీ 56, జనసేన 4 స్థానాలలో విజయం సాధిస్తాయి. ఈ సర్వే విడుదల చేసిన మూడు నెలల తరువాత ఈ సంస్థ మూడు విడతల్లో మరో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలనే ఇప్పుడు విడుదల చేసింది. ఈ సర్వే కోసం నియోజకవర్గానికి సగటున 330 మందితో డైరెక్ట్ గా ఇట్రాక్ట్ అయ్యారు. అంటే రాష్ట్రంలో ఈ సర్వే సంస్థ 60 వేల 200 శాంపిల్స్ నుంచి కలెక్ట్ చేసిన వివరాలను ఇప్పుడు వెలువరించింది. ఈ సర్వే మూడు విడతల్లో గత ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 17 వరకూ నిర్వహించింది. అదే మొదటి దశ సర్వేలో అయితే శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రతినిథులు రాష్ట్రం మొత్తంలో లక్షా 370 వేల శాంపిల్స్ నుంచి వివరాలు సేకరించారు. ఆ విషయం పక్కన పెడితే తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో అధికార వైసీపీకి 41.50 శాతం ఓటర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి 42.50 శాతం మంది, జనసేనకు 11 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఇతరులు 2.5శాతం ఉండగా, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ మరో 2.5శాతంగా ఉంది. మొత్తం మీద 175 నియోజకవర్గాలలో అధికార వైసీపీ 63 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉంటే, తెలుగుదేశం పార్టీకి ఆ అవకాశాలు 78 స్థానాలలో ఉన్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఈ పార్టీ 7 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మరో 37 నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు సాగనుంది. ఇలా హోరా హోరీ పోరు సాగే నియోజకవర్గాలలో కూడా విపక్ష వైసీపీకి 14 చోట్ల, తెలుగుదేవం పార్టీకి 13 చోట్ల కొద్ది పాటి మొగ్గు కనిపిస్తోంది.
ఇక జిల్లాల వారీగా పార్టీల విజయావకాశాల విషయానికి వస్తే..
శ్రీకాకుళొం జిల్లాలో మిత్తం 10 స్థానాలు ఉండగా వీటిలో ఇచ్చాపురం, ఎచ్చెర్ల, పాతపట్నం, రాజాం, పలాస, అముదాల వలస స్థానాలలో తెలుగుదేవం, పాలకొంండ, నరసన్నపేటలలో వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయి. టెక్కలి, శ్రీకాకుళంలలో హోరా రోహీ పోరు సాగుతుంది. అంటే జిల్లాలోని పది నియోజకవర్గాలలో 6 స్థానాలలో తెలుగుదేశం, 2 స్థానాలలో వైసీపీకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. మిగిలిన రెండు స్థానాలలో అంటే టెక్కటి, శ్రీకాకుళం లలో హోరాహోరీ పోరు సాగుతుంది.
అలాగే విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నాలుగు నిజోజకవర్గాలలో తెలుగుదేశం, మూడు నియోజకవర్గాలలో వైసీసీకి విజయావకాశాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి విజయనగరం, బొబ్బొలి, ఎస్. కోట, గజపతినగరంలలో విజయావకాశాలు ఉండగా, వైసీపీకి చీపురుపల్లి, నెల్లిమర్ల, సాలూరులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. పార్వతీపురం, కురుపాంలలో హోరా హోరీ పోరు ఉంటుంది.
ఇక విశాఖజిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 15. వీటిలో ఏడు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండగా మూడు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుది. తెలుగుదేశం పార్టి విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, భీమిలిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో ముందంజలో ఉంటే, వైసీపీ విశాఖ సౌత్, విశాఖ నార్త్, యలమంచిలి, అరకు వ్యాలీ, పాడేరులలో వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఇక పాయకరావుపేట, గాజువాక, మాడుగుల నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది.
అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా, వాటిలో ఆరు నియోజకవర్గాలలో తెలుగుదేశం, ఆరు నియోజకవర్గాలలో వైసీపీ, నాలుగు నియోజకవర్గాలలో జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. మిగిలిన మూడు నియోజకవర్గాలలోనూ హోరాహోరీ పోరు ఉంటుంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలలో తెలుగుదేశం, రామచంద్రాపురం, రంపచోడవరం, కాకినాడ అర్బన్, అనపర్తి, తుని, రాజానగరంలలో వైసీపీ, పిఠాపురం, రాజమండ్రిరూరల్, రాజోలు, కొత్త పేటలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. ఇక శ్రీ ఆత్మసాక్షిసర్వే ప్రకారం పి.గన్నవరం, మండపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాలలో తెలుగుదేశం 8 నియోజకవర్గాలలోనూ వైపీపీ రెండు నియోజకవర్గాలలో విజయం సాధిస్తాయి. జనసేన పార్టీకి ఈ జిల్లాలో మూడు నియోజకవర్గాలలో విజయావకాశాలు ఉన్నాయి. పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు, కొవ్వూరు, పోలవరం, ఉండి నియోజకవర్గాలు తెలుగుదేశం ఖాతాలోనూ, ఏలూరు, గోపాలపురం నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనూ పడతాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో జనసేనకు విజయావకాశాలు ఉన్నాయి. నిడదవోలు, చింతలపూడిలలో హోరాహోరీ పోరు ఉంటుంది.
అలాగే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో ఎనిమిది నియోజకవర్గాలు తెలుగుదేశం, ఐదు నియోజకవర్గలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే పేర్కొంది. రెండు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. తెలుగుదేశం విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నంలలో విజయం సాధిస్తే, వైసీసీకి గన్నవరం, పామర్రు, గుడివాడ, తిరువూరు, నూజివీడులలో గెలుపు అవకాశాలు ఉన్నాయి. విజయవాడ వెస్ట్, కైకలూరులలో హోరాహోరీ పోరు ఉంటుంది.
గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 తెలుగుదేశం ఖాతాలోనూ, 6 వైసీపీ ఖాతాలోనూ పడతాయి. మూడు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు తప్పదు. పొన్నూరు, వేమూరు, తాడికొండ, చిలకలూరి పేట, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, బాపట్లలలో తెలుగుదేశం గెలిచే అవకాశాలు అధికంగా ఉంటే, గుంటూరు ఈస్ట్, మాచర్ల, పత్తిపాడు, పెదకూరపాడు, తెనాలి, నరసరావు పేటలలో వైసీపీకి విజయావకాశలు ఉన్నాయి. ఇక గుంటూరు వెస్ట్, గురజాల, సత్తెనపల్లిలో హోరాహోరీ పోరు ఉంటుంది.
ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరింట తెలుగుదేశం, ఐదు నియోజకవర్గాలలో వైసీపీ, ఒక నియోజకవర్గంలో హోరా హోరీ ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఒంగోలు, కనిగిరి, కొండెపి, పరచూరు, అద్దంకి, సంతనూతలపాడు లలో తెలుగుదేవం, మార్కాపురం, ఎర్రగొండ్లపాలెం, గిద్దలూరు, కందుకూరు, దర్శిలలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉండగా, చీరాలలో హోరాహోరీ పోరు ఉంటుంది.
నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఐదింటిని తెలుగుదేశం, రెండు నియోజకవర్గాలలో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి. మూడింటిలో హోరాహోరీ పోరు ఉంటుంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి, కావలిలలో తెలుగుదేశం, ఆత్మకూరు, సర్వేపల్లిలలో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గూడూరు, సూళ్లూరుపేట, కోవూరులలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుంది.
ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం నాలుగు, వైసీపీ 8 గెలుచుకునే అవకాశాలున్నాయి. రెండు నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది. మందపల్లి, కుప్పం, నగరి, పలమనేరులలో తెలుగుదేశం విజయం సాధిస్తే, తిరుపతి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు, చంద్రగిరి, చిత్తూరు, తంబళ్లపల్లిలలో వైసీపీ విజయం సాధిస్తుంది. ఇక పీలేరు, శ్రీకాళహస్తిలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.
కడప జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం రెండు స్థానాలలోనూ, వైసీపీ ఆరు స్థానాలలోనూవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. రెండు స్థానాలలో పోటీ హోరాహోరీ ఉంటుంది. మైదుకూరు, ప్రొద్దుటూరులలో తెలుగుదేశం, కడప, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, కోడూరులలో వైసీపీ గెలుస్తాయి. రాజంపేట, కమలాపురం నియోజకవర్గాలలో పోటీ తీవ్రంగా ఉంటుంది.
అనంతపురం జల్లాలో14 నియోజకవర్గాలు ఉండగా వీటిలో 7 చోట్ల తెలుగుదేశం, 7 చోట్ల వైసీపీ విజయం సాధిస్తాయి. ఒక నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంది. అనంతపురం, కదిరి, హిందూపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పెనుకొండ, ఉరవకొండలలో తెలుగుదేశం, రాప్తాడు, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, రాయదుర్గం, మడకశిరలలో వైసీపీ విజయం సాధిస్తాయి. సింగనమలలో పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంటుంది.
ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఏడింటిలో కర్నూలు, ఏడింటిలో వైసీపీ విజయం సాధించే అవకాశలు ఉన్నాయని శ్రీఆత్మసాక్షి సర్వేపేర్కొంది. శ్రీశైలం, కొడుమూరు, మంత్రాలయం, బనగానపల్లి, ఆలూరు, ఆదోని, పత్తికొండలలో తెలుగుదేవం, నందికొట్కూరు, పాణ్యం, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాలలో వైసీపీకివిజయావకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది.
మొత్తానికి శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య తేడా స్వల్పమేనని కూడా సర్వే వెల్లడిస్తోంది.