జగన్ లో బటన్ నొక్కుడు ధీమా మాయం
posted on Mar 7, 2023 @ 11:58AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశ్వాసం, జగన్ ను నమ్ముకున్న వాళ్ల విశ్వాసం రెండూ కూడా ఆవిరైపోయే పరిస్థితి వచ్చిందా?.. బటన్ నొక్కుతున్నాను.. మన ఓట్లకు ఏం ఢోకా లేదు, మీ పని మీరు చేయండి అంటూ జగన్ తరచూ తన పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ క్లాస్ పీకుతూ ఉంటారు. నా పని నేను చేస్తున్నాను, మీరే జనంలోకి వెళ్లడం లేదంటూ ఊదరగొట్టేస్తుంటారు. అటువంటి జగన్ ఇప్పుడు ఇక బటన్ నొక్కుడుకు అవకాశం లేని పరిస్థితుల్లో పడ్డారు.
ఔను బటన్ నొక్కుడు కొనసాగినంత కాలం అధికారానికి ఢోకా లేదు, జనం వ్యతిరేకత, ప్రజాందోళనలతో రాష్ట్రం గగ్గోలెత్తినా ఏం ఫర్వాలేదు, తానుబటన్ నొక్కుతున్నంత కాలం, లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు పడుతున్నంత కాలం ఓట్లెక్కడికీ పోవు. ఇదీ ఇప్పటి వరకూ జగన్ లో ఉన్న విశ్వాసం. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురైనా.. స్వయంగా ముఖ్యమంత్రి సభల నుంచే జనం పారిపోయినా.. మంత్రుల సభలకు ప్రజలు మొహం చాటేసినా జగన్ లెక్క చేయలేదు. విపక్షాల సభలకు జనం పోటెత్తి జయజయధ్వనాలు పలికినా జగన్ చిద్విలాసంగా పార్టీ నేతలకు, శ్రేణులకు ఆందోళన వద్దు.. ఓట్లూ మనవే, అధికారమూ మనదే.. అంటూ భరోసా ఇస్తూ వచ్చారు. పార్టీ నేతల్లో ధీమాకూ అదే కారణం. తమ నేత బటన్ నొక్కి సొమ్ములు లబ్ధిదారులకు పందేరం చేస్తున్నారు ఏం ఫర్వాలేదు అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడా ధీమా వారిలో కనిపించడం లేదు.
జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఆగిపోయాయా? అందుకూ నిధులు లేని పరిస్థితి వచ్చేసిందా? అంటే పార్టీ శ్రేణులే ఔనని అంటున్నారు. ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దివాణంలా అయిపోయింది ఏపీ పరిస్థితి. దీంతో పార్టీ నేతలలో జగన్ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జనవరి నుంచి పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చేసిన నిధులకు ఓ సారి తెనాలిలో బహిరంగసభ పెట్టి మీట నొక్కారు. అది బహిరంగం అయిపోవడంతో ఉత్తుత్తి బటన్ నొక్కుడులేనా జగన్ అంటూ విపక్షల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దానికి తోడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు రైతుల ఖాతాలలోకి సొమ్ములు జమ చేసినందుకు ప్రధాని కృతజ్ణతలు చెబుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ట్వీటే జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కుడు వ్యవహారాన్ని బట్టబయలు చేసేసింది.
అదలా ఉంచితే గత డిసెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న పథకాలకు జగన్ మీట నొక్కిన దాఖలాలు లేవు. ఆసరా పథకాన్నే తీసుకుంటే.. కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది. ఈ పథకం కింద నాలుగేళ్లపాటు రూ. 12500 బటన్ నొక్కుడు ద్వారా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండ్‌లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉంది.
ఇక తాజాగా జగనన్న విద్యాదీవెన పథకం మరోమారు వాయిదా పడింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను 10.50 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు, నవంబరు, డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి రూ. 700 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్ని ఏపీ సర్కార్ ఈ పథకం కింద విడుదల చేయాల్సి ఉంది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం గత నెల 28నే ఈ నిధులను విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆ తర్వాత దానిని మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇప్పుడు మరో సారి వాయిదా వేసింది. ఈ నిధుల విడుదల ఎప్పుడు అన్న విషయాన్ని కూడా తెలియజేయలేదు.