మళ్ళీ అవే చర్చలు.. నేతల తీరుఫై ఉద్యోగుల ఆగ్రహం!
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్ని సార్లు మోసపోయినా మళ్ళీ, మోసం చేసిన ప్రభుత్వాన్నే నమ్ముతున్నారు. అయితే, ఇలా మోస పోతోంది, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, చర్చలకు రమ్మనగానే చంకలు గుద్దుకుంటూ వెళ్లి, ఉద్యోగుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు. అవును, కంచే చేను మేసింది అన్న చందంగా ఉద్యోగ సంఘాల నాయకులే సర్కార్ తో కుమ్ముక్కై ఉద్యోగులను మోసం చేస్తున్నారనేది ఎవరో చేసిన ఆరోపణ కాదు. ఉద్యోగులే వ్యక్తం చేస్తున్నఆవేదన. గతంలో ఉద్యోగులే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు బహిరంగంగా ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకూ సిద్దమయ్యారు. ఇప్పడు కూడా మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆట బొమ్మల్లా వాడుకుంటోంది. ఇది ఆరోపణ కాదు, రుజువైన వాస్తవం. పీఆర్సీ వివాదం తలెత్తిన సమయంలో ప్రభుత్వం ఇదే విధంగా ఉహ్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. హామీలు ఇచ్చింది. కానీ, ఇంతవరకు కనీసం ఉదాహరణగా చెప్పుకునేందుకు అయినా ఏ ఒక్క హామీనీ పక్కాగా నూటికి నూరు శాతం అమలు చేయలేదు. కానీ, ఉద్యోగులు అడగని, పదవీ విరమణ వయోపరిమితిని పెంచి, అదే మహా ప్రసాదం అన్నరీతిన ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నిజానికి వయోపరిమితి పెంపు నిర్ణయం, ఉద్యోగులకు మేలు చేసేందుకు తీసుకున్న నిర్ణయం కాదు. 2019 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పూర్తిగా చెల్లించలేని స్థితిలో.. రిటైర్మెంట్ వయసును పెంచారు.
ఇలా ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసినా, ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ఏమి ఆశిస్తున్నారో, ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో కానీ, ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజానికి, ఉద్యోగ సంఘాలు గొంతెమ్మ కోరికలు ఏవీ కోరడం లేదు. వారు అడుగుతున్న దల్లా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమనే. అవసరాల కోసం ప్రభుత్వం వద్ద దాచుకున్న పీఎఫ్ సొమ్ములను జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. అన్నిటినీ మించి వేతన జీవులు కోరుతున్నది నెల జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధానంగా పదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ , పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్ రద్దు , గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు, సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1,600 కేసుల మాఫీ వంటివే వారి డిమాండ్లు.
అసలు ఉద్యోగుల సొమ్ములు వారికి తెలియకుండా తీసుకోవడం తప్పు. కాదు నేరం. నిజానికి నేరం చేసిన సర్కార్ ను ఉద్యోగ సంఘాలు నిలదీయాలి. కానీ ఉద్యోగ సంఘాల నాయకులు, తగుదునమ్మా అని, చేతులు కట్టుకుని మంత్రి వర్గ ఉప సంఘంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏమో ఉద్యోగులకు ఏదో గొప్ప మేలు చేస్తున్నట్లు ప్రవర్తిస్తోంది. ఈ ( మార్చి) నెలాఖరులోపు మూడు వేల కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు.
కానీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, టీచర్లు ఓట్లు కావాలి కాబట్టి, చర్చల పేరున మరో మారు ఉద్యోగులను మోసం చేసేందుకు సర్కార్ ప్రయత్నిస్తోందనే ఉద్యోగులు అనుమానిస్తున్నారు.
ఉద్యోగుల జీతాలకే దిక్కులేని ప్రభుత్వం రూ. 3000 కోట్లు చెల్లించడం అయ్యే పని కాదు. అందుకేమ ఉద్యోగులు అంత మొత్తాన్ని ఎక్కడ నుంచి తెస్తుందో చెప్పాలని అంటున్నారు. నిజానికి గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే, సీపీఎస్ రద్దు అవుతుందని.. ఊహించనంత ఫిట్ మెంట్‌తో పీఆర్సీ ఇస్తారని డీఏలు ఆపరని.. ఇలా రకరకాలుగా ఉద్యోగులు ఊహించుకున్నారు. కానీ, అనుకున్నదొకటి అయితే అయింది మరొకటి అన్నట్లుగా జగన్ రెడ్డి పాలనలో చివరకు జీతాలకే దిక్కులేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
మరోవంక ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఐఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించారు. అయినా నేతలు కిమ్మనలేదు. అందుకే అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాల నేతలు తమను మోసం చేస్తున్నారని, తాము మోసపోయామని ఉద్యోగులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సర్కార్ ను సేవ్ చేందుకు అవసరం వచ్చినప్పుడు ఉద్యమం అంటున్నారు, అంతలోనే చల్లబడి పోతున్నారని ఉద్యోగులు అంటున్నారు. అలాగే, ఈ సమస్యలు అన్నిటికీ ఒకటే సమాధానం అంటున్నారు. మోసం చేసిన ప్రభుత్వాన్ని సాగనంపడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వారు వచ్చారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.