వైఎస్ వివేకానందరెడ్డి హత్య... ముచ్చటగా మూడోసారి!
posted on Mar 7, 2023 8:57AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు ముచ్చటగా మూడోసారి నోటీసులు ఇచ్చారు. మార్చి 6వ తేదీన తమ విచారణకు రావాలంటూ వైయస్ అవినాష్ రెడ్డికి తొలుత సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ఆ రోజు తన నియోజకవర్గంలోని వేంపల్లిలో పార్టీ మండల, కార్యకర్తల, గృహాసారథుల, కన్వీనర్ల, వాలంటీర్ల సమావేశం ఉందని.. ఈ నేపథ్యంలో హాజరుకాలేనని ఆయన సీబీఐకి తెలిపడంతో.. మార్చి 10వ తేదీన విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు నోటిసులు అందజేశారు. దీంతో హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి మరోమారు వైయస్ అవినాష్ రెడ్డి విచారణకు తరలి రానున్నారు. అలాగే ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సైతం.. మార్చి 12వ తేదీన కడపలో తమ విచారణకు హాజరుకావాలని సీబీఐ అదికారులు నోటిసులు అందజేశారు. అయితే తాను హైదరాబాద కు రాలేనని అవినష్ సీబీఐకి వర్తమానం పంపించారనుకోండి అది వేరే సంగతి.
అయితే వివేకా హత్య కేసులో అందరి చూపులే కాదు.. వేళ్లన్నీ కూడా అనినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయనే విధంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థ సీబీఐ... కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరికి సీబీఐ నోటీసులు జారీ చేసిందనగానే.. అటు మీడియా.. ఇటు సోషల్ మీడియలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అదీకాక స్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డికి సీబీఐ ఎప్పుడు నోటీసులు జారీ చేసినా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయంటూ... సీబీఐకి తెలపడం.. వారు మరో తేదీ ఫిక్స్ చేయడం.. ఆ క్రమంలో సీబీఐ అధికారులు ఎక్కడా.. ఎప్పుడూ.. వీరి పట్ల దూకుడుగా వ్యవహరించకుండా చాలా సమయమనం పాటిస్తూ వస్తున్నారనే చర్చ సైతం సాగుతోంది.
ఇక గత జనవరి 28న వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని.. తొలిసారిగా హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు. ఈ సందర్బంగా ఆయన కాల్‌డేటాపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో వైయస్ వివేకా హత్య జరిగిన సమయంలో.. అంతకు ముందు... ఆ తర్వాత వెళ్లిన కాల్‌డేటాపై దృష్టి పెట్టడం.. అందులో భాగంగా నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జగన్ సతీమణి పీఏ నవీన్ సెల్ పోన్లకు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వీరిద్దరికీ సీబీఐ అధికారులు ఫిబ్రవరి 3వ తేదీన కడపలో తమ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. వారిద్దరు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
అయితే వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి పీఏ నవీన్‌ను మరోసారి సీబీఐ అధికారులు.. విచారణకు పిలువనున్నారని.. అందుకు వారి న్యాయవాదితో ఇప్పటికే అంశంపై మాట్లాడినట్లు మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో సందేహం ఉన్న ప్రతి అంశాన్ని సీబీఐ అధికారులు వదిలిపెట్టకుండా విచారణ జరుపుతున్నారు. ఆ క్రమంలో వివేకా హత్య జరిగిన రోజు.. వైయస్ అవినాష్ తో ఫొటో దిగిన సుధాకర్ అనే వ్యక్తిని సైతం సీబీఐ అధికారులు పిలిచి మరీ విచారించడం గమనార్హం.
ఇక వైయస్ వివేకా హత్య జరిగి ఈ ఏడాది మార్చి 15కి సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. అదే రోజు సీబీఐ పలువురిని అరెస్ట్ చేసినా.. అందులో ఆశ్చర్యం లేదనే ఓ చర్చ అయితే సోషల్ మీడియాలో వాడి వేడిగా నడుస్తోంది. ఇక ఇటు లోక్‌సభకు .... అటు అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో అసలు వివేకా హత్య ఎందుకు జరిగింది?.. అసలు ఈ హత్య జరగడానికి గల ప్రధాన కారణం?.. వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల చెప్పినట్లు కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగిందా? లేకుంటే.. ఆర్థిక వ్యవహారాలు కారణమా? లేకుంటే మరేదైనా కారణమా? ఇక వివేకా హత్యకు సుపారీగా 40 కోట్ల రూపాయిలు.. ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు?.. అంత పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి.. వైఎస్ వివేకాను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అలాగే ఈ హత్య వెనుక ఉన్న అసలు సిసలు పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అనేది బయటకు వస్తే.. దాని తాలుకు ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై సుస్పష్టంగా పడుతోందనే ఓ చర్చ సైతం తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా నడుస్తోంది.