టీహబ్ ఒక అద్భుతం.. ఆదిత్యథాక్రే
posted on Apr 12, 2023 @ 9:56AM
శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాకరే హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. అక్కడ మంత్రి కేటీఆర్‌తో ఆయన కొద్ది సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తన ట్విట్టర్‌లో ఆదిత్య థాకరే.. మంత్రి కేటీఆర్‌ను కలిసిన ప్రతిసారి అద్భుతంగా, ఎంకరేజింగ్ ఫీలవుతానంటూ ప్రశంసల వర్షం కురిపించేశారు. సుస్థిరత, పట్టణీకరణ, సాంకేతికత లాంటి అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని పేర్కొన్నారు. భారత దేశ ప్రగతిలో ఆ అంశాలు కీలకమని ఆదిత్య థాకరే తెలిపారు. టీహబ్ ఒక మహాద్భుతంగా అభివర్ణించారు. స్టార్ట్ అప్‌లు, ఆవిష్కర్తలు, ఆలోచనాపరులకు టీహబ్ మంచి ఊతం ఇస్తోందన్నారు.
మంత్రి కేటీఆర్‌ను కలవడం ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఆయన బ్రెయిన్ చెయిల్డ్ టీహబ్ విజిట్ చేసి థ్రిల్ అయ్యాననీ, అక్కడ అమేజింగ్ వర్క్ జరుగుతోందని ఆదిత్యథాక్రే ట్వీట్ చేశారు. కాగా ఆదిత్య థాక్రే ట్వీట్ కు స్పందించిన కేటీఆర్
గత ఏడాది దోవోస్ సదస్సు సందర్భంగా కలిసిన తరువాత మళ్లీ ఆదిత్యథాక్రేతో భేటీ కావడం ఇదే తొలిసారనిపేర్కొన్నారు.ఆయనతో చర్చలు అర్ధవంతంగా జరిగాయని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఆయనతో కలిసి పని చేయాలన్న ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
ఆదిత్యథాక్రే, కేటీఆర్ పరస్పర పొగడ్తలను పక్కన పెడితే...ఈ భేటీ కేవలం టీహబ్ సందర్శనకు మాత్రమే సంబంధించినది కాదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మహారాష్ట్రపై నిశిత దృష్టి పెట్టారు. ఇక మహారాష్ట్రలో బాల్ థాక్రే బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పాలన్న పట్టుదలతో ఉన్నారు.
మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని బావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాల్ థాక్రే నేతృత్వంలోని శివసేన బీఆర్ఎస్ తో చేతులు కలిపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్యఠాక్రే హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ఎనలేని ప్రాథాన్యత సంతరించుకుంది.