తెలంగాణలో ప్రగతి పరుగులు.. ఏపీలో ఎందుకు వచ్చేయండి!
posted on Apr 12, 2023 @ 12:42PM
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. ఏపీ అభివృద్ధి కుంటుపడిందని తెలంగాణ మంత్రి హరీష్ అన్నారు. అందుకే తెలంగాణలో స్థిరపడిన ఏపీ కార్మికులంతా అక్కడి ఓటు రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నిర్మాణంలో చెమట చిందించిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ గతంలోనే చెప్పిన విషయాన్ని హరీష్ ఇప్పుడు మళ్లీ గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి తెలంగాణ మంత్రులు ఏపీలోని అభివృద్ధి లేమినే అలంబనగా వాడుకుంటున్నారు. అందుకే అవకాశం వచ్చినా రాకపోయినా తమ రాష్ట్ర ప్రగతిని చెప్పుకోవడానికి ముందుగా ఏపీలోని అభివృద్ధి లేమిని ఎత్తి చూపుతున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు మరో సారి అదే చేశారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఆయన ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ పాలనలో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం కుదేలయ్యాయనీ, దీంతో అక్కడ పనులు లేక, దొరకక పొట్ట చేతబట్టుకు వచ్చిన నిర్మాణ రంగ కార్మికులందరూ ఇక్కడే సెటిల్ అయిపోవాలనీ, అక్కడ ఓటు రద్దు చేసుకుని ఇక్కడ నమోదు చేయించుకోవాలని పిలుపునచ్చారు.
తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదనీ, ఇక్కడ చేతి నిండా పని దొరుకుతుందనీ, సంపాదనా పుష్కలంగా ఉంటుందనీ, తెలంగాణ అభివృద్ధి ఫలాల్లో భాగం కూడా దొరుకుతుందని చెబుతున్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణకూ ఆంధ్రప్రదేశ్ కూ ఆకాశానికీ, భూమికీ ఉన్నంత తేడా ఉందన్నారు. ఇప్పుడే కాదు.. గతంలో గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలలో ఏపీ సీఎం జగన్ ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా ఏపీలో వ్యవసాయ రంగం దీనస్థితి గురించి ప్రస్తావించి హరీష్ ఏపీ, ఏపీ సీఎం జగన్ గాలి తీసేశారు.