బీఆర్ఎస్ లో అంతర్మధనం
posted on Apr 12, 2023 @ 9:31AM
తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్ ఇదీ నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు నిర్వచనంగా చెప్పుకున్న మాట. ఏది చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయవలసిందే. ఏది చెప్పినా కేసీఆర్ చెప్పవలసిందే. ఇతరులు ఎవరు ఏది చెప్పినా ఏది చేసినా కేసీఆర్ పేరున చేయవలిసిందే. , సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదనే విధంగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాలు నడిచాయి. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర మంత్రులు, పార్టీ పెద్దలు ఎవరు ఏమి చెప్పినా చివరకు కేసీఆర్ శంఖంలో పోస్తేనే అది తీర్ధం. ఆ మాటకు ఒక విలువ. అందుకు భిన్నంగా తొందరపడి ఏ మంత్రీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంతవరకు ఏనాడూ లేదు.
అయితే తెరాస, బీఆర్ఎస్ గా మారిన తర్వాత లేదా అంతకు కొంత ముందు నుంచి పరిస్థితి మారుతూ వస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హీట్ ఎక్కిన నేపథ్యంలో ఇటు కుటుంబంలో అటు పార్టీ, ప్రభుత్వంలో చోటు చేకున్న పరిణామాలు కొత్త చర్చకు తెర తీశాయి. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచీ కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా అది కూడా ఫోటోల్లో కనిపించడం, ప్రెస్ నోట్’లో వినిపించడమే కానీ నేరుగా ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పవచ్చు. అసెంబ్లీలో లేదా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బీఆర్ఎస్ సభలో తప్ప రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు లేదా మీడియా ముందుకు వచ్చిన సందర్భం ఇటీవల కాలంలో లేదనే చెప్పాలి.
చివరకు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం, టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీక్ , ఎస్ఎస్సీ పేపర్స్ లీక్ /మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్.. విడుదల చివరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనని టార్గెట్ చేస్తూ చేసిన తీవ్ర విమర్శలు ఇలా.. ఏ విషయంలోనూ ముఖ్యమంత్రి స్పందించలేదు. అయితే, ఉద్యమ కాలం నుంచీ కూడా కేసీఆర్ ప్రతికూల పరిస్థితుల్లో సైలెన్స్ గా ఉండడం, సమయం వచ్చినప్పడు దూకుడు పెంచడం అనుభవంలో ఉన్న విషయమే అంటున్నారు. కేసీఆర్ విషయం అలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ జోష్ పెంచారు. సర్వం తానే అన్నట్లు (డీఫ్యాక్టో ముఖ్యమంత్రి)గా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ లో అయితే ఆయన అనుకూల వర్గం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించడంతో పాటుగా, ఎన్నికలకు ముందుగా ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, అయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలని పార్టీలో ఒక వర్గం ‘డిమాండ్’ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదలా ఉంటే, ఏప్రిల్ 27న భారత రాష్ట్ర సమితి జనరల్ బాడీ మీటింగ్ జరగనున్న నేపధ్యంలో ఈ సమావేశంలో కేటీఆర్ ను భారాస రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ప్రకటించే అవకాశం లేక పోలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇంతలోనే బీఆర్ఎస్ గుర్తింపు వ్యవహారం గందరగోళంలో పడింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపే కానీ, ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిని నియమించిన పొరుగు రాష్ట్రం ఏపీ, పార్టీ విస్తరణ ప్రారంభించిన కర్ణాటక, మహారాష్ట్ర సహా దేశంలో మరెక్కడా ఎలాంటి గుర్తింపు దక్కే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ భవిష్యత్ ఒక విధంగా డోలాయమానంలో పడిందని అంటున్నారు. అలాగే, ఒక విధంగా చూస్తే బీఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతోందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపద్యంలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ లో ఏమి జరుగుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.