బండి అరెస్ట్.. మరో సెల్ఫ్ గోల్?
ఒన్స్ బిట్టెన్ ..ట్వైస్ షై (Once bitten, twice shy) ఇదొక ఇంగ్లీష్ సామెత. అంటే ఒకసారి పొరపాటునో,గ్రహపాటునో తప్పు చేసి దెబ్బతిన్న వ్యక్తి, రెండోసారి అదే తప్పు చేయడు. అదే తప్పు చేసేందుకు జంకుతారు, లేదా భయపడతారు .. జాగ్రత్త పడతారు. అనేది ఈ ఇంగ్లీష్ సామెత సారాంశం. చదువు సంధ్యా లేని, చాయ్ వాలా ప్రధాని మోడీకి ఈ సామెత తెలియక పోవచ్చును కానీ, ఎ న్నోవేల పుస్తకాలను బట్టీయం పట్టేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే అమేరికాలో గొప్పగొప్ప చదువులు చదివిన మంత్రి కేటీఆర్ కు ఈ సామెత, ఈ సామెత సారాంశం తెలియదని అనుకోలేము. కానీ ఎందుకనో కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఈ మాటలు అంటున్నది ఎవరో తండ్రీకొడుకులంటే గిట్టని ప్రతిపక్షాలు కాదు. బీఆర్ఎస్ అభిమానులే అంటున్నారు. ఒక రకంగా సామాన్య ప్రజలకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, మీడియా ముందుకొచ్చి సమాధానాలు ఇచ్చుకో లేక అవస్థ పడుతున్న గులాబీ పార్టీ వాచస్పతులు విస్తు పోతున్నారు.
ధాన్యం రగడ మొదలు ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల బేరసారల వరకూ, అక్కడి నుంచి ఇప్పుడు తాజాగా తెర పై కొచ్చిన పదవ తరగతి ప్రశ్న పత్రాల లీక్ లేదా మాల్ ప్రాక్టీసు వ్యవహారం వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని ఎండగట్టేందుకు చేసిన ప్రతి ప్రయత్నం, ప్రతి ఆందోళన, ప్రతి న్యాయ, రాజకీయ పోరాటం బూమరాంగ్ అవుతూనే ఉన్నాయి. అయినా తండ్రీకొడుకులు తగ్గేదే లే అంటున్నారని, బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటు టాక్ లో తలలు పట్టుకుంటున్నారు.
ముఖ్యంగా పదవ తరగతి హిందీ పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్’ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయడం, అది కూడా పది రోజుల క్రితం చనిపోయిన అత్తగారు దశదిన కర్మలో పాల్గొనేందుకు ఇంటికి చేరిన కొద్ది సేపటికే, పోలీసులు బిలబిల మంటూ ఆయన ఇంట్లోకి ప్రవేశించి, ఎందుకు, ఏమిటీ అన్న ప్రశ్నలను సమాధానం చెప్ప కుండా బలవంతంగా ఎత్తుకు పోవడం చట్ట పరంగా సరైనది అయినా కాకున్నా, సెంటిమెంట్ పరంగా, ప్రభుత్వం, పోలేసులు చేసిన బ్లండర్ మిస్టేక్ .. చాలా పెద్ద తప్పని బీఆర్ఎస్ నాయకులు ప్రైవేటు టాక్’లో ఒప్పుకుంటున్నారు.
అలాగే, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజక వర్గానికి చెందిన ఓ మహిళా నాయకురాలు అయితే, ముఖ్యమంత్రికి ఆ సలహా ఎవరు ఇచ్చారో కానీ, బలగం సినిమా సెంటిమెంట్’ వెంటాడుతున్న సమయంలో తల్లితో సమానమైన అత్తమ్మ దశదిన కర్మకు వచ్చిన అల్లుడు, బండి సంజయ్’ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఎంత మాత్రం సమంజసం కాదని కాదని, చట్టాని పక్కన పెట్టి రాజకీయం గాచూసినా పెద్ద తప్పని అన్నారు.
ముఖ్యంగా మహిళల సెంటిమెంట్’ను గట్టిగా దేబ్బతీసిందని అంటున్నారు. అందుకే, సిరిసిల్లల ముఖ్యంగా మహిళలు సర్కార్’కు శాపనార్ధాలు పెడుతున్నారని, ఈ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని, ఆమె విశ్లేషించారు. ఈ సందర్భంగా బలగం సినిమాకు సిరిసిల్లకు ఉన్న సంబంధాన్ని, కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సినిమా సెంటిమెంట్’ను మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అలాగే, ఫార్మ్ హౌస్ కేసులో చాంతాడంత రాగం తీసి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులను, ‘దొరికిన దొంగలు’ అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సహా దేశంలోని అనేక వ్యవస్థలకు చెందిన ముఖ్యులందరికీ ఆడియోలు, వీడియో క్లిప్పింగులు పంపి కూడా చివరకు, అదే సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో చీవాట్లు తిన్న వైనాన్ని బీఆర్ఎస్ అభిమానులే గుర్తు చేస్తున్నారు.
ఇక పదవ తరగతి పరిక్ష పత్రం లీక్ కు సంబంధించి, వరంగల్ ఏసీపీ, బండి అరెస్ట్’కు ముందొక రకంగా తర్వాత మరొక రకంగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి .. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేశారని పోలీసు అధికారులే అంటున్నారు. ఇది సోషల్ మీడియా యుగం. ఒక్క సారి నిరు జారితే, ఇక వెనక్కి తీసుకోవడం అయ్యేపనికాదని, పోలీసు అధికారులు పూటకో మాట చెపితే, పోలీసుల పరువే పోతుందని, ఇప్పుడు ఈ కేసులోనూ అదే జరిగిందని అంటున్నారు.
అలాగే, ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంలో డ్యామేజ్ అయిన ప్రభుత్వ ఇమేజ్’ ను కాపాడుకునేందుకు దారులు వెతుకుంటున్న సమయంలో, టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో బండి సంజయ్’ ను ఇరికించే విఫల ప్రయత్నం చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం మరో మరకను కొని తెచ్చుకుందని, అంటున్నారు. నిజానికి, పదవతరగతి పరీక్ష పేపర్ మల ప్రాక్టీసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న బండి సంజయ్’ సమాధానాలు ఇవ్వవలసిన ప్రశ్నల కంటే, ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు.