బాబులు దారి తప్పారు.. గుజరాత్ దినపత్రిక సంచలన కథనం
ఐఎఎస్, అధికారులు ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలనూ ప్రభావితం చేస్తారు. అంతేనా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కావాలన్నా, కాకుండా ఉండాలన్నా వారిపైనా ఆధారపడి ఉంది. రాజకీయాలలో భవిష్యత్ పరిణామాలు ఏమిటి, ముందు ముందు ఏం జరగబోతోంది అన్నీ పరిశీలకుల కంటే, విశ్లేషకుల కంటే ముందుగానే పసిగట్టేస్థారు. అధికారంలో ఉన్న సర్కార్ మరో సారి గద్దెనెక్కుతుందా? విపక్షానికే పరిమితమౌతుందా.. ప్రజల నాడి ఎలా ఉంది ఇవన్నీ వారికి కరతామలకం. అటువంటి అధికారులు అడ్డదారులు తొక్కాలని నిర్ణయించుకుంటే.. వారిని ఆపడం కాదు కదా అడ్డదారుల్లో వెళుతున్నారని పసిగట్టడం రాజకీయ నేతలకు, దర్యాప్తు సంస్థలకూ అంత తేలిక కాదు.
బాబూస్ పైనా మంత్రులు, ముఖ్యమంత్రులు అధికంగా ఆధారపడతారు. కీలక పదవులలో తమకు అనుకూలురను నియమించుకోవాలని చూస్తారు. ఎందుకంటే.. ఆపత్కాలంలో తమ మేధా సంపత్తితో తమను చిక్కుల నుంచి బైటపడేయగలుగుతారన్న నమ్మకం. ఇక అటువంటి బ్యూరోక్రట్లు రాజకీయ క్షేతంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఇట్టే పట్టేస్తారు. రాజకీయలతో అసలు ఏ సంబంధం లేనట్లుండే అధికారులు రాజకీయ పరదాల చాటున ఏం జరుగుతుందో కళ్ళు మూసుకుని చూసేయగలరు. అందుకు తగ్గట్టుగా తమను తాము ట్యూన్ చేసుకుంటారు. స్ట్రాటజీలు మార్చుకుంటారు. తమ వరకూ రాదనుకుంటే.. అడ్డగోలు సంపాదనలకూ వెనుకాడరు. అధికార పార్టీ ప్రాపకం కోసం రూల్స్ ను అతిక్రమించేయగలరు, లేదా వాటిని అవసరానికి అనుగుణంగా మార్చేయగలరు. రాజకీయ నాయకులతో బాబూస్ కుమ్మక్కుతో అడ్డగోలుగా ఆస్తులు పెంచేసుకున్న ఐఏఎస్ ల వ్యవహారం ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యాపారాలు, ఆస్తుల వ్యవహారంపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, అధికారుల పెట్టుబడులపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దినపత్రిక దివ్య భాస్కర్ ప్రచురించిన కథనం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ లు స్టాక్ మార్కెట్ లో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల విలువ 7500 కోట్ల రూపాయలకు పైమాటేనన్నది దివ్యభాస్కర్ దినపత్రిక కథనం. రాష్ట్రంలోని స్టాక్ మార్కెట్ బ్రోకర్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా దివ్యభాస్కర్ అధికారుల బండారాన్ని బయటపెట్టింది.
వీరికి పలువురు మంత్రులు ఎమ్మెల్యేల అండ దండిగా ఉందని కూడా ఆ పత్రిక కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 90శాతం మంది ఐఏఎస్, ఐపీఎస్ లు తమతమ బంధువులు, స్నేహితుల పేరు మీద ఓపెట్ చేసిన డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్లలో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసినట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది. ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడానికి వారు పాల్పడిన అవినీతే కారణమన్నది ఆ పత్రిక కథనం సారాంశం. అయినా ప్రభుత్వంతో, ప్రభుత్వంలోని పెద్దలతో, అధికార పార్టీ కీలక వ్యక్తులతో కుమ్మక్కైతే... దోపిడీకి రాచబాట పరిచినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్, రియల్ వ్యాపారంలో బాబుల పెట్టుబడులకు సంబంధించిన వివరాలు వెల్లడైనా చర్యలేవని ప్రశ్నిస్తున్నారు.
దివ్యభాస్కర్ కథనం ఒక్క గుజరాత్ లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకూ మాత్రమే తన కథనాన్ని పరిమితం చేసింది కానీ.. దేశంలోని పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉందని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పరిస్థితి అన్ని హద్దులనూ దాటేసిందని అంటున్నారు. ఏపీలో ఐఏఎస్, అధికారులు తరచుగా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితికీ, కోర్టుల చేత అక్షింతలు వేయించుకోవడానికీ ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలను ఏవో ప్రయోజనాలను ఆశించి గుడ్డిగా అంగీకరించి అమలు చేసేయడమేనని అంటున్నారు. ఇలా కుమ్మక్కయ్యే క్రమంలో దండిగా ఆర్థిక లబ్ధి కూడా పొందుతున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత.. సీఎస్, డీజీపీలతో సహా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టుబోనెక్కిన విషయాన్ని, చీవాట్లు తిన్న విషయాన్నీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.