మోడీగారి పులి వేట
posted on Apr 12, 2023 @ 1:02PM
ఏప్రిల్ 9వ తేదీన మధుసూదన్ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో డ్రయివర్ గా ఉద్యోగం చేస్తున్న మధుసూదన్ జీపులో దేశ ప్రధాని నరేంద్రమోడీ అరణ్య విహారం చేయనున్నారు. ఇదీ ఆ కుటుంబం ఆనందానికి కారణం.
ఉదయం 7.15 నుంచి 9.30 వరకూ మోడీని జీపులో ఎక్కించుకుని పులులను చూపించే బాధ్యత తన పూర్వ జన్మ సుకృతం అని మధుసూదన్ భావించాడు. కానీ అతని ఆశలపై బందీపూర్ పులులు నీళ్లు చల్లాయి. 135 నిముషాల పర్యటనలో ఒక్కటంటే ఒక్క పులి కూడా మోడీ కంట పడలేదు. దీంతో మోడీ నిరుత్సాహానికి గురయ్యారు. ఎలాగూ అంత దూరం వచ్చాం కదా అని ఓ ఫొటో షూట్ తో ప్రధాని సంతృప్తి చెంది తిరుగుప్రయాణమయ్యారు. రోజూ కనిపించే పలులు ఆ రోజు కనిపించకపోవడంతో డ్రయివర్ మధుసూదన్ కూడా తన దుదరృష్టానికి బాధపడ్డాడు.
ఇదిలా ఉండగా ప్రధాని మోడీని పులులు దర్శించుకోలేకపోవడానికి డ్రయివర్ కారణమంటూ కర్నాటక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. డ్రయివర్ మధుసూదన్ ఉద్యోగాన్ని ఊడబీకి జీపు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఇదంతా చేస్తున్న కర్నాటక అటవీ శాఖ అధికారులకు ఒళ్లు మండింది. మోడీకి పులి కనబడకపోతే డ్రయివర్ ను ఉద్యోగం నుంచి తీసేయడం ఏమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
జీపు రిజిస్ట్రేషన్ కు, పులి కనబడకపోవడానికి సంబంధం ఏమిటో అధికారులకు అర్ధం కావడం లేదు. మోడీకి పులి పంజా గుర్తులు చూపించామంటూ అటవీ అధికారులు బీజేపీ నేతలకు నచ్చ చెబుతున్నారు. మోడీ పర్యటనకు ముందే భద్రతా దళాలు, ఇతర వంది మాగధులు చేసిన హడావుడికి పులులు బెదిరిపోయి ఉంటాయని అటవీ అధికారులు అంటున్నారు. మోడీ పర్యటన తరువాత అడవిలో పులుల సంచారం తిరిగి ప్రారంభమైందని కూడా అధికారులు సెలవెచ్చారు.