ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు పంపకాలు
ఒకవైపు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలతో హడావుడి పడుతుంటే, గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం నిశబ్దంగా తమ పని తాము చేసుకుపోతున్నారు. మే16న ఎన్నికల ఫలితాలు వెలువడగానే, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో వేర్వేరుగా ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్దమయిపోతుంది గనుక, ఈలోగానే రెండు ప్రభుత్వాలకు అవసరమయిన కార్యాలయాల ఏర్పాట్లు చకచకా పూర్తి చేసేస్తున్నారు. జూన్ రెండున అధికారికంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు జరుగుతున్నపటికీ, ఎన్నికల ఫలితాలు వెలువడేలోగానే, ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారుల కొరకు ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా విభజించి అవసరమయిన మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.
తెలంగాణకు ఏ, బీ, సీ, డీ బ్లాకులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణకు హెచ్, కె, ఎల్ బ్లాకులు కేటాయించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్ బ్లాక్ ను కేటాయించారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం క్యాంపు కార్యాలయంగా లేక్ వ్యూ అతిథి గృహాన్ని కేటాయించారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ని కూడా రెండు రాష్ట్రాలకు విభజించారు. రెండు రాష్ట్రాలకు డీఐజీ మరియు సీఐడీ కార్యాలయాలను కూడా కేటాయిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. ఈనెల 20లోగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు రాష్ట్రాలకు అన్నివిభాగాలలో పంపకాలు, భవనాల కేటాయింపులు పూర్తయిపోవాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు.
ఇక ఈ రోజు విద్యుత్ పంపకాలు కూడా పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తూర్పు, మధ్య, ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ విభాగాలకు విద్యుత్ పంపకాలు కూడా పూర్తయిపోయాయి. వీటిలో తూర్పు డిస్కంకు-15.80 శాతం, మధ్య (సెంట్రల్) డిస్కంకు-38.02 శాతం, ఉత్తర డిస్కంకు-17.87శాతం, దక్షిణ డిస్కంకు-30.31శాతం విద్యుత్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రత్యూష్ సిన్హా కమిటీ రెండు రాష్ట్రాలకు ఐఏయస్, ఐపీయస్ మరియు ఐఎయఫ్ అధికారులను కేటాయిస్తూ సిఫార్సులు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 211 మంది ఐఏయస్, 144 మంది ఐపీయస్, 82మంది ఐఎయఫ్ అధికారులను, తెలంగాణా రాష్ట్రానికి 163మంది ఐఏయస్,112మంది ఐపీయస్, 65 మంది ఐఎయఫ్అధికారులను కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది.