ఇ.సి. నన్ను మాత్రమే టార్గెట్ చేసింది: లగడపాటి
posted on May 8, 2014 @ 2:19PM
ఎన్నికల కమిషన్ తనను మాత్రమే టార్గెట్ చేసి నోటీసులు జారీ చేసిందని, తనలాంటి కామెంట్లు చేసిన ఇతరుల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని లగడపాటి రాజగోపాల్ వాపోతున్నారు. సీమాంధ్ర ఎన్నికల ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన లగడపాటి సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చే అవకాశం వుందని చెప్పారు.
ఆయన అవకాశం వుందని చెప్పారే తప్ప సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వంటి వివరాలేవీ వెల్లడించలేదు. అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లగడపాటి మీద కేసు నమోదు చేసింది. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఇలాంటి తరహా వ్యాఖ్యానాలు చేసిన వైసీపీ నాయకుల మీద, టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేయలేదని ఆయన అంటున్నారు.
కేసులు నమోదు చేస్తే అందరిమీదా నమోదు చేయాలని లేకపోతే తనమీద నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ తనమీద కేసు నమోదు చేసినప్పటికీ లగడపాటి రాజీపడలేదు. సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని స్పష్టంగా చెప్పారు. మరి ఎన్నికల కమిషన్ దీన్ని కూడా సీరియస్‌గా తీసుకుని ఆయన మీద మరో కేసు నమోదు చేస్తుందేమో చూడాలి.