చంద్రబాబు, జగన్ ఇంటర్వ్యూలు
posted on May 8, 2014 9:08AM
పోలింగు ముగిసిన తరువాత చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా మీడియాతో మాట్లాడారు. ఇరువురూ కూడా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఇరువురూ కూడా ప్రజల తీర్పు ఏకపక్షంగా తమ పార్టీకే అనుకూలంగా రాబోతోందని అన్నారు. ఈ ఎన్నికలలో ఓటింగు శాతం పెరిగినట్లయితే, తమ ఓడిపోయే ప్రమాదం ఉందనే భయంతో తమ ప్రత్యర్ద పార్టీ ప్రజలు ఓట్లు వేయకుండా చేసేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే పోలింగు స్టేషన్ల వద్ద భయానక వాతావరణం కల్పించాయని ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకొన్నారు.
జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రాభివృద్ధికి పూర్తిగా సహకరించే కూటమికే మా పార్టీ మద్దతు ఇస్తుంది. చంద్రబాబు కేంద్రం ముందు సాగిలపడి సహాయ, సహకారాలు అర్దిస్థానని చెపుతున్నారు. కానీ నేను మాత్రం కేంద్రం మెడలు వంచి మనకి రావలసిన నిధులు సాధిస్తానని చెపుతున్నాను. ప్రజా తీర్పు ఏకపక్షంగా రాబోతోంది గనుక, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొనే ఏ కూటమి అయినా మన మద్దతు కోసం దిగిరావలసిందే. అందువల్ల మనం కోరుకొన్నవిధంగా పనులు చేసిపెట్టే పార్టీకే మద్దతు ఇస్తాము. ఈవిషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకొంటాము,” అని అన్నారు.
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ “ఈసారి జరిగిన ఎన్నికలు కొన్ని ప్రధాన అంశాలపైనే జరిగాయి. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం, రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం అనే మూడు ప్రధాన అంశాలపైనే ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చును. కనుక ప్రజాతీర్పు కూడా ఏకపక్షంగా తేదేపాకు అనుకూలంగా రాబోతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిలలో ఒక బయానక వాతావరణం సృష్టించి, ఓటింగు శాతం తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా 80శాతం పోలింగు జరిగింది. దీనివలన తెదేపా గెలుపు ఖాయమయింది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా వివిధ సమయాలలో, వివిధ రకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేపని చేసారు. ఇటువంటి విపరీత పోకడలకు పోయినవారు చరిత్రలో చాలా మంది ఉన్నారు. వారందరూ చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం తధ్యం. అది త్వరలోనే తెలుస్తుంది,” అని అన్నారు.