కొనసాగుతున్న జగన్ పార్టీ దౌర్జన్యకాండ
posted on May 8, 2014 @ 11:49AM
సీమాంధ్రలో ఎన్నికలు ముగిసినా వైకాపా దౌర్జన్యకాండ కొనసాగుతూనే వుంది. ఈ ఎన్నికలలో ఓడిపోతానని భయం పట్టుకున్న జగన్ .. ఓటర్లను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి బూత్‌ల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయడం వరకు అన్ని ఎలక్షన్ల అవలక్షణాలను ప్రదర్శించారు. కానీ అవన్ని అంతగా ఫలించకపోవడంతో టిడిపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నికలు ముగిసినా వైకాపా పార్టీ వారు టీడీపీ వర్గీయులపై దాడులను మాత్రం ఆపలేదు.
నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం ఏరుకోలులో టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వీరిని చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపైనా వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఎస్సై సహా పలువురు గ్రామస్థులకు గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం సూరావారిపల్లెలో వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ వర్గాలు దాడి చేశాయి. ఈ ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నాయి. వెంటనే వారిని చిలకలూరుపేట ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ నిర్వహించారు.