సింగపూర్‌కు బాబు, డెహ్రాడున్‌కి జగన్ ల ఫ్యామిలీ
posted on May 8, 2014 @ 1:10PM
ఎన్నికల సందర్భంగా వాళ్ళనీ వీళ్ళని తిట్టి, వాళ్ళచేత వీళ్ళచేత తిట్టించుకున్న రాజకీయ నాయకులు ఎన్నికలు ముగిశాక మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం విహార యాత్రలు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు ముగియగానే కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయారు. హరీష్‌రావు, కేటీఆర్, కవిత తమతమ కుటుంబ సభ్యులతో ఎవరికి నచ్చిన దేశానికి వాళ్ళు సైట్ సీయింగ్‌కి వెళ్ళిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో చాలామంది ఇప్పుడు పలు దేశాలకు విహార యాత్రలకు వెళ్ళిపోయారు. సీమాంధ్రలో ఎన్నికలు ముగియగానే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో విదేశాలకు విహార యాత్రకు వెళ్ళబోతున్నారు. చంద్రబాబు నాయుడు సింగపూర్‌కి వెళ్ళే అవకాశం వుందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.
సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానని చెబుతున్న చంద్రబాబు ఈ పర్యటన సందర్భంగా సింగపూర్‌లో ఏవైనా అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలుసుకుని వస్తారేమో చూడాలి. అలాగే వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటుంబ సభ్యులతో డెహ్రాడూన్ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బోలెడన్ని కేసులున్న జగన్ సారు డెహ్రాడూన్ వెళ్ళడానికి కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. విహారయాత్రలకు వెళ్ళిన అందరూ కౌంటింగ్ నాటికి తిరిగి వచ్చే అవకాశం వుంది. అప్పటి వరకు ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా వుండొచ్చు.