డబుల్‌ డెక్కర్ రైలు వస్తోంది.. అందరు పక్కకి జరగండి..

      రైలు ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు హైదరాబాద్‌‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణం ప్రారంభించింది. మంగళవారం ఉదయం 6.45 గంటలకు కాచిగూడ- గుంటూరు మధ్య ఏసీ డబుల్‌ డెక్కర్ రైలు ప్రారంభమైంది. రైల్వే శాఖ సీనియర్ ఉద్యోగి ఒకరు ఈ రైలుకు పచ్చజండా ఊపి ప్రారంభించారు. దీంతో దక్షిణాదిన తొలిసారిగా ఈ డబుల్‌ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతివారం కాచిగూడ- గుంటూరు- కాచిగూడ ఏసీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. బుధవారం నుంచి కాచిగూడ నుంచి తిరుపతికి డబుల్ డెక్కర్ సర్వీసు అందుబాట్లోకి వస్తోంది. తొలిసారి డబుల్ డెక్కర్ రైలు ఎక్కిన ప్రయాణికులు మురిసిపోయారు. సెల్ ఫోన్లతో రైలును ఫొటోలు తీసుకున్నారు. తొలి ప్రయాణంలో కాచిగూడ నుంచి గుంటూరు వరకు 500 మంది ప్రయాణికులు ప్రయాణించారు.

పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవాల వివరాలు

      జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన స్థానాల వివరాలివి. తెలంగాణలో 69 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 24 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, తెరాసకు చెందిన 14 మంది అభ్యర్థులు, వామపక్షాల అభ్యర్థులు ఇద్దరు, ఇతరులు 26 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సీమాంద్రలో 251 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏకగ్రీవమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచింది. వైకాపా 70 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, వామపక్షాలు 4 స్థానాల్లో, ఇతరులు 70 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచారు.

రాష్ట్రంలో 29 కేంద్రాలలో రీ పోలింగ్

      దేశవ్యాప్తంగా 2014 సంవత్సరం ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మంగళవారం కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 29 పోలింగ్ కేంద్రాలలో మంగళవారం నాడు రీపోలింగ్ జరుగుతోంది. సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, కడప జిల్లాల్లోని 17 పోలింగ్ కేంద్రాలతోపాటు తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 12 కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు రీ పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది.

ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయేకే పట్టం కట్టిన ఇండియన్ ఓటరు

      దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా సంస్థలు, విశ్వసనీయమైన సర్వే సంస్థలతో కలసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సోమవారం నాడు వెల్లడి అయ్యాయి. ఏ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ అయినా ముక్తకంఠంతో ఒకే విషయాన్ని చెప్పింది. అదే కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని. వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు...   టుడేస్ చాణక్య: ఎన్డీయే - 340, యుపీఏ - 70, ఇతరులు - 133. టైమ్స్ నౌ: ఎన్డీయే - 249, యుపీఏ - 148, ఇతరులు - 146. సీఎన్ఎన్-ఐబీఎన్: ఎన్డీయే - 270-282, యుపీఏ - 92-102, ఇతరులు - 150 - 160. హెడ్ లైన్స్ టుడే: ఎన్డీయే - 272, యుపిఏ - 115, ఇతరులు - 156. సీ ఓటర్: ఎన్డీయే - 289, యుపీఏ - 101, ఇతరులు - 153. ఏబీపీ న్యూస్: ఎన్డీయే - 281, యుపీఏ - 97, ఇతరులు: 161. ఆజ్ తక్: ఎన్డీయే - 272, యుపీఏ - 115, ఇతరులు: ----- ఇండియా టీవీ: ఎన్డీయే - 289, యుపీఏ - 101, ఇతరులు: ------ సీమాంధ్ర ఎగ్జిట్ పోల్ ఫలితాలు....... సీఎన్ఎన్-ఐబీఎన్: టీడీపీ, బీజేపీ - 11-15, వైకాపా: 11-15, కాంగ్రెస్ - 0. టైమ్స్ నౌ: టీడీపీ, బీజేపీ - 17, వైకాపా - 8, కాంగ్రెస్ - 0. తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు...... సీఎన్ఎన్-ఐబీఎన్: తెరాస - 8-12, కాంగ్రెస్ - 3-5, టీడీపీ, బీజేపీ - 2-4, ఇతరులు - ----- టైమ్స్ నౌ: తెరాస: 9, కాంగ్రెస్ - 4, టీడీపీ, బీజేపీ - 2, ఇతరులు - 2.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

      మునిసిపల్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసే ప్రక్రియ ప్రారంభమైంది. అది పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలోని 441 జడ్పీటీసీ, 6,480 ఎంపీటీసీ స్థానాలకు, సీమాంధ్రలో 1,093 జడ్పీటీసీ, 16,214 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును చేపట్టారు. పేపర్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరిగింది కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా జరిగే అవకాశం వుంది. ఈరోజు రాత్రి వరకూ కౌంటింగ్ జరుగుతుంది.

నేడే పరిషత్ ఫలితాలు

  గ్రామీణ ఓటరు నాడిని పట్టిచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. గతనెల 6,7 తేదీలలో నిర్వహించిన ఈ ఎన్నికలలో 1,096 జడ్పీటీసీ స్థానాలకు 5,0 34 మంది, 16, 589 ఎంపీటీసీ స్థానాలకు 53, 345 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. ఈరోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికలు బ్యాలట్ పేపర్లతో నిర్వహించినందున లెక్కింపులో జాప్యం అనివార్యమవుతుంది గనుక ఫలితాలు వెలువడేందుకు కూడా సమయం పట్టవచ్చును. బహుశః మధ్యాహ్నం నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో కూడా నిన్నటిలాగే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి, సీమాంద్రాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్లయితే, ఇక సార్వత్రిక ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలదే విజయం అని భావించవచ్చును. తెరాస, వైకాపాలకు గ్రామీణ ప్రాంతాలలో మంచి పట్టు ఉందనే అభిప్రాయం నిజమో కాదో నేటి ఫలితాలాలో తేలిపోతుంది.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: తప్పుల తడక సర్వే

      టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వివరాలలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీలకు లభించే సీట్లకి సంబంధించిన అంచనా తప్పులతడకగా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. . టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలు సొంతం చేసుకుంటాయి. అలాగే సీమాంధ్రలో ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకోబోతోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారు. అయితే టైమ్స్ నౌ ప్రకటించిన ఈ ఫలితాలు తప్పుల తడకలా వున్నాయని టైమ్స్ నౌ ఛానల్లో డిస్కషన్‌లో పాల్గొన్న పలువురు చెప్పారు. అటు సీమాంధ్రలో, ఇటు టీడీపీలో టీడీపీ, బీజేపీ కూటమికి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. సోమవారం వెల్లడి అయిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అంతే కాకుండా టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎం.ఐ.ఎం. ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదన్న ఫలితాన్ని ఇచ్చింది. అయితే దీనిని పలువురు ఖండించారు. హైదరాబాద్‌ లోక్ సభ స్థానంలో ఎంఐఎం గెలిచి తీరుతుందని వారు స్పష్టం చేశారు.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: సీమాంధ్ర, తెలంగాణ వివరాలు

      టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ కార్యక్రమంలో ఈ ఎన్నికలలో సీమాంధ్ర, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చన్న అంశం మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా టైమ్స్ నౌ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను కూడా ప్రకటించారు. టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలు సొంతం చేసుకుంటాయి. అలాగే సీమాంధ్రలో ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకోబోతోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారు.

జనరల్ ఎలక్షన్స్ 2014: తుది దశ ముగిసింది

      తొమ్మిది దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరిగింది.. ఈ తుది దశలో ఉత్తరప్రదేశ్‌లోని 18 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని 17, బీహార్‌లోని 6 స్థానాలతోకలిపి మొత్తం 41 స్థానాలకు ఓటింగ్ జరిగింది.. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాశి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరిగింది. ఈ దశ ఎన్నికల బరిలో 606మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మోడీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆజంగఢ్‌నుంచి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఖుషీనగర్‌నుంచి కేంద్రమంత్రి ఆర్పీఎన్‌సింగ్, డొమారియాగంజ్‌నుంచి బీజేపీ సీనియర్‌నేత జగదాంబికాపాల్, పశ్చిమబెంగాల్‌లోని బెహ్రంపూర్ నుంచి కేంద్రమంత్రి ఆధిర్ రంజన్ చౌదరి, బారాసత్‌నుంచి బీజేపీ అభ్యర్థిగా మెజీషియన్ పీసీ సర్కార్ (జూనియర్), బీహార్‌లోని వైశాలినుంచి ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఎన్నికల బరిలో నిలిచారు. దీనితో రీపోలింగ్ జరిగే కొన్ని చోట్ల తప్ప దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: ఈశాన్యంలో పుంజుకున్న బీజేపీ

      దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. ఎన్నికలు ముగిసే వరకూ ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం వుండటంతో దేశ ప్రజలు 2014 ఎన్నికల తుదివిడత ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూశారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. ప్రముఖ న్యూస్ ఛానల్‌ నిర్వహించే ఎగ్జిట్ పోల్ మీద అందరికీ ఎంతో ఆసక్తి వుంది. ఆర్నబ్ గోస్వామి నిర్వహిస్తున్న ఎగ్జిట్ పోల్ లైవ్ ప్రోగ్రామ్‌ని దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్నారు. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ డిస్కషన్‌లో మొదట ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా వుంటుందో చర్చించారు. ఈశాన్య భారతదేశంలో బీజేపీ బాగా పుంజుకుంది. ఈ ఎన్నికలలో ఈశాన్య భారతంలో ఎన్.డి.ఎ.కి 49 పార్లమెంట్ సీట్లు,యు.పి.ఎ.కి 28 పార్లమెంట్ సీట్లు, ఇతరులకు 65 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.

టీఆర్ఎస్ జాణతనం

      మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణలో తుక్కుతుక్కుగా ఓడిపోయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో జాణతనం ఎంతమాత్రం తగ్గలేదు. దారుణంగా ఓడిపోయినా తనకు ఈ విషయం ముందే తెలుసన్నట్టు, ఈ ఓటమి అసలు ఓటమే కానట్టు బిల్డప్పులు ఇస్తోంది. మునిసిపల్ ఫలితాలు విడుదలైన తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఈటెల రాజేందర్ మాట్లాడిన తీరు చూస్తుంటే హమ్మా.. టీఆర్ఎస్‌ది ఎంత జాణతనమో అనిపించక మానదు.   ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటల సారాంశంమేంటంటే.. మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ టీఆర్ఎస్ వైపే నిలిచారట. అందుకే తెలంగాణ ప్రజలకు బోలెడన్ని కృతజ్ఞతలట. మునిసిపల్ ఎన్నికలతో టీఆర్ఎస్ ఎంతమాత్రం ప్రచారం చేయకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కి బ్రహ్మరథం పట్టారట. సీమాంధ్ర పార్టీలు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా లొంగకుండా తెలంగాణ ప్రజలందరూ హోల్‌సేల్‌గా టీఆర్ఎస్‌కి అండగా వున్నారట. చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు తమకే ఎక్కువ మునిసిపల్ ఛైర్మన్ స్థానాలు దక్కుతాయన్న నమ్మకం వుందట. మంగళవారం వెల్లడి కాబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందట. ఈ టీఆర్ఎస్ నాయకులు ఎప్పటికి మారతారో ఏంటో!  

వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థిపై కేసు

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న వారణాశిలో సోమవారం పోలింగ్ జరుగుతోంది. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ పోటీలో వుంటే, కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ అనే వ్యక్తి పోటీలో వున్నాడు. స్థానిక ఎమ్మెల్యే అయిన అజయ్ రాయ్‌ని కాంగ్రెస్ పార్టీ మోడీ మీద పోటీకి దించింది. ఇదిలా వుంటే గుజరాత్‌లోని వదోదరలో కూడా పోటీ చేసిన నరేంద్రమోడీ పోలింగ్ ముగిసిన తర్వాత కమలం గుర్తు చూపించారని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టడం, దాంతో ఎన్నికల సంఘం మోడీ మీద కేసు పెట్టడం తెలిసిందే. తాజాగా సోమవారం నాడు వారణాశిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ఇదే తరహా పని చేశాడు. వారణాశిలో ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకి వచ్చిన అజయ్ రాయ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ‘హస్తం’ ఓట్లు వేయడానికి క్యూలో వున్న అందరికీ చూపిస్తూ వెళ్ళడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. అజయ్ రాయ్ మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టింది.

తుది దశ పోలింగ్: బెంగాల్లో గొడవలు

      తొమ్మిది దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరుగుతోంది. ఈ తుది దశలో ఉత్తరప్రదేశ్‌లోని 18 స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని 17, బీహార్‌లోని 6 స్థానాలతోకలిపి మొత్తం 41 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాశి నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ దశ ఎన్నికల బరిలో 606మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 6.61కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మోడీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంనుంచి ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆజంగఢ్‌నుంచి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, ఖుషీనగర్‌నుంచి కేంద్రమంత్రి ఆర్పీఎన్‌సింగ్, డొమారియాగంజ్‌నుంచి బీజేపీ సీనియర్‌నేత జగదాంబికాపాల్, పశ్చిమబెంగాల్‌లోని బెహ్రంపూర్ నుంచి కేంద్రమంత్రి ఆధిర్ రంజన్ చౌదరి, బారాసత్‌నుంచి బీజేపీ అభ్యర్థిగా మెజీషియన్ పీసీ సర్కార్ (జూనియర్), బీహార్‌లోని వైశాలినుంచి ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం తుదివిడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం చాలా ప్రదేశాల్లో గొడవలు జరిగినట్టుగా సమాచారం అందుతోంది.

ఇది ప్రజా విజయం: ఫలితాలపై చంద్రబాబు స్పందన

  మునిసిపల్ ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, తెలంగాణలో కూడా గట్టి పోటీ ఇచ్చి ఎవరూ ఊహించని విధంగా మంచి ఫలితాలను సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజలు సాధించిన విజయమని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకంతో ఇంతటి విజయాన్నిచ్చిన ప్రజలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ళుగా కాంగ్రెస్ పరిపాలనలో నరకం చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ని సీమాంధ్ర నుంచి తరిమికొట్టడంతోపాటు వైకాపా ప్రలోభాలకు లొంగకుండా ఓటేశారని చంద్రబాబు అన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనేచోట్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తరిమికొట్టిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అండగా వున్న ప్రజలకు, కార్యకర్తలకు తమ పార్టీ వెన్నంటి వుంటుందని చంద్రబాబు చెప్పారు.

సూరత్‌లో పేలుడు: 30 మందికి గాయాలు

    గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 30 మందికి గాయాలయ్యాయి. సూరత్ నగరంలోని ఒక ఎంబ్రాయిడరీ యూనిట్‌లో ఈ పేలుడు సంభవించింది. మొదట ఈ పేలుడు వెనుక ఉగ్రవాద కోణం వుందా అని పోలీసులు అనుమానించారు. అయితే గ్యాస్ సిలెండర్ లీక్ కావడం వల్ల ఈ పేలుడు జరిగిందని తెలిసింది. పేలుడు సందర్భంగా చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. పేలుడు జరిగింది ఎంబ్రాయిడరీ యూనిట్ కావడంతో మంటలు త్వరితంగా వ్యాపించాయి. దాంతో ఆ యూనిట్‌లో పనిచేసే చాలామందికి కాలిన గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

టీడీపీకి బీజేపీ అభినందనలు: ప్రకాష్ జవదేకర్

      సీమాంధ్ర మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకులు ప్రకాష్ జవదేకర్ అభినందనలు తెలిపారు. టీడీపీ సాధించిన ఈ విజయం తాము సాధించిన విజయంగానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇదే తరహా ఫలితాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలోనూ, ఆ తర్వాత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలోనూ టీడీపీ సాధిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ కూటమి పోటీ చేసిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో తమ కూటమికి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.