అధిష్టానంతో దోస్తీ, టీ-కాంగ్రెస్ తో ఖతరా!

  నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని తిట్టిపోసిన కేసీఆర్, ఇప్పుడు సోనియాగాంధీని మళ్ళీ దేవతని పొగుడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానిని చేసేందుకు యూపీఏకి మద్దతు ఇస్తానని కాంగ్రెస్ అడగక ముందే ప్రకటించేశారు కూడా. అందుకు ప్రతిగా ఆయన రాష్ట్రంలో టీ-కాంగ్రెస్ మద్దతు అవలీలగా పొందవచ్చును. కానీ, ఆయన టీ-కాంగ్రెస్ మట్టికొట్టుకు పోతుందని శాపనార్ధాలు పెడుతున్నారు.   కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని చెపుతున్న కేసీఆర్, రాష్ట్రంలో మాత్రం కలిసి పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి, ఇతర కీలక పదవులన్నీ తనకు, తన కుటుంబ సభ్యులకే దక్కించుకోవాలనే పదవీ కాంక్షే వలననే. టీ-కాంగ్రెస్ మద్దతు తీసుకొంటే వారికీ అధికారంలో భాగం పంచి, కీలక పదవులు ఈయవలసి ఉంటుంది. అదే వైకాపా, మజ్లిస్, సీపీయం, వంటి ఇతర పార్టీల నుండి మద్దతు తీసుకొంటే, వారికి ఏవో అప్రధాన్య పదవులు పడేసి, ముఖ్యమయిన పదవులన్నీ తామే స్వంతం చేసుకోవచ్చును.   కానీ, దేశముదురు టీ-కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కి అధికారం దక్కనిస్తారని నమ్మకం లేదు. చిరకాలంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నజానారెడ్డి, జైపాల్ రెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నాల వంటి వారందరూ తమకు ఇప్పుడు ఆ అవకాశం దక్కకపోయినా, కనీసం అధికారం తమ పార్టీ చేజారకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలపై అవసరానికి మించి ప్రేమ ఒలకబోస్తున్న కేసీఆర్, టీ-కాంగ్రెస్ నేతలపై, ముఖ్యంగా పొన్నాలపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడుతున్నారు.   కేసీఆర్ అధికారం దక్కించుకోకుండా అడ్డుకొనేందుకు టీ-కాంగ్రెస్-తెదేపాలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదు. ఆ భయంతోనే చంద్రబాబు, పొన్నాల, తదితరులపై కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. జగన్, అసదుద్దీన్, రాహుల్ గాంధీ వంటి వారివల్ల తనకు అవసరం ఉంది, పైగా వారి వల్ల తనకు ఎటువంటి సమస్య ఉండబోదు గనుకనే వారికి కేసీఆర్ బాకా ఊదుతున్నారు.

ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ సమాధి: అస్సాంలో దారుణం

  అస్సాంలో భారీగా కురుస్తున్న వర్షాలు ఒకే కుటుంబంలోని ఏడుగురిని సజీవ సమాధి చేశాయి. అస్సాంలోని గౌహతి సమీపంలోని సత్గరాకుల్ గ్రామంలో లుబెద్దీన్ అలీ అనే వ్యక్తి భార్య, ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులతో ఒక పెద్ద పర్వతం పక్కనే చిన్న పాకలాంటిది కట్టుకుని నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భారీ వర్షాలకు కొండ మీద వున్న మట్టి కరిగి పెద్దపెద్ద రాళ్ళతో కలసి కిందకి జారి అలీ నివసిస్తున్న పాక మీద పడింది. దాంతో ఆ కుటుంబంలోని ఏడుగురూ అక్కడే సజీవ సమాధి అయిపోయారు.ఇలాంటి సంఘటనే వారం రోజుల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లోజరిగింది. కొండ చరియలు విరిగి పడటంతో ఒక గ్రామం గ్రామం సమాధి అయిపోయింది. 2100 మంది మరణించారు.

కేసీఆర్ ఆరాటమంతా జగన్ మద్దతు కోసమేనా?

  సాధారణంగా ఓటమి భయం ఉన్నవారే ‘తమ గెలుపు తధ్యం’ అని పదేపదే బిగ్గరగా చెప్పుకొంటారు. సీమాంద్రాలో తెదేపా, వైకాపాలు ఆవిధంగా చెప్పుకోవడం లేదు. అంటే రెండు పార్టీలకు తమ గెలుపుపై పూర్తి భరోసా ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ, తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్, తెరాసలు తమకే పూర్తి మెజార్టీ వస్తుందని పోటీలు పడి మరీ చెప్పుకొంటున్నాయి. కేసీఆర్, పొన్నాల ఇరువురూ తామే అధికారంలోకి వస్తామని పైకి చెప్పుకొంటునప్పటికీ, ఇతర పార్టీల యం.యల్యే.లకు గాలం వేయడానికి తెర వెనుక ప్రయత్నాలు ముమ్మురం చేసారు. తెరాసకు చెందిన 20మంది గెలుపు గుర్రాలు తనతో టచ్చులో ఉన్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చేసిన ప్రకటనే అందుకు ఒక ఉదాహరణ. ఆయన ఆవిధంగా ప్రయత్నించడాన్ని తప్పు పట్టిన కేసీఆర్ కూడా ఇతర పార్టీల యం.యల్యే.ల మద్దతు కూడ గట్టే పనిలో పడ్డారు.   బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ నిన్న జగన్మోహన్ రెడ్డికి కూడా బాకా ఊదినట్లున్నారు. జగన్ను ప్రసన్నం చేసుకోనేందుకే ఆయనకు బద్ద శత్రువయిన చంద్రబాబుకి శాపనార్ధాలు పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం, కేసీఆర్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తెలంగాణా నుండి బిచాణా ఎత్తివేసినప్పటికీ, తెలంగాణాలో సీమాంధ్ర ప్రజలు స్థిరపడిన ప్రాంతాలలో తెరాసకు గెలిచే అవకాశం ఉండబోదు గనుక అక్కడ తన పార్టీని పోటీలో దింపారు. కనుక తెలంగాణాలో కూడా వైకాపా కనీసం 4-6 యం.యల్యే. సీట్లు సాధించుకొనే అవకాశం ఉంది. బహుముఖ పోటీ కారణంగా తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ లకు పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. అటువంటప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ప్రతీ ఒక్క యం.యల్యే. మద్దతు అమూల్యమే. అందుకే జగన్ కూడా అంటరాని వాడు కాదని కేసీఆర్ లౌక్యంగా మనసులో మాట బయట పెట్టారు. అంటే మిగిలిన తెలంగాణా పార్టీలతో బాటు తెలంగాణాను వ్యతిరేఖిస్తూ సమైక్య ఉద్యమాలు చేసిన వైకాపా మద్దతు తీసుకొనేందుకు పావులు కదుపుతున్నారని స్పష్టమవుతోంది. ఇంతకాలం సీమాంధ్ర ప్రజలను, నేతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినా కేసీఆర్ ఇప్పుడు తను ముఖ్యమంత్రి అయ్యేందుకు మళ్ళీ అదే సీమాంధ్ర నేత, పార్టీ మద్దతు ఆశించడం హాస్యాస్పదం.

పత్తిపాడు ఈవీఎంలు సేఫ్.. అభ్యర్థులు డోన్ట్ వర్రీ: కలెక్టర్

  తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తడిసిపోయాయని, కాకినాడ జేఎన్‌టీయులో స్ట్రాంగ్ రూమ్‌లో దాచిన ఈవీఎంలు లోపలకి నీరు ప్రవేశించడం వల్ల తడిచిపోయాయన్న వార్తలు రావడంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడిపోయారు. తమ జాతకాలన్నీ వున్న ఈవీఎంలు తడిచిపోతే తమ గతేంటి దేవుడా అని కంగారుపడిపోయి, ఈవీఎంల పరిస్థితి గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌ని సందర్శించిన తూ.గో. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో వివరణ ఇచ్చారు. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని ఈవీఎంల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాకినాడ పార్లమెంట్, పత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంల కిందకి నీళ్ళు వచ్చాయని, అయితే ఈవీఎంలు ఎంతమాత్రం తడవలేదని స్పష్టం చేశారు. కాబట్టి కాకినాడ, పత్తిపాడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులూ.. డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ..

కాంగ్రెస్ నాయకులది నీచబుద్ధి: వెంకయ్య నాయుడు

  కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నీచబుద్ధిని బయటపెట్టుకునే వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వారి రాజకీయాలు కూడా నీచంగా వున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ అమ్మ సోనియా గాంధీ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ నరేంద్రమోడీ మీద అసత్య ప్రచారం చేస్తున్నారని, నరేంద్రమోడీ ప్రధాని అవుతున్నాడన్న బాధ వారి మాటల్లో కనిపిస్తోందని వెంకయ్య అన్నారు. భారతీయ జనతాపార్టీ నాయకుల మీద ముఖ్యంగా నరేంద్రమోడీ మీద అసత్య ప్రచారం, వ్యక్తిగత విమర్శలు చేయడం మినహా కాంగ్రెస్ పార్టీకి మరో పని లేదని ఆయన దుయ్యబట్టారు. అమిత్ షా విషయంలో, స్నూప్ గేట్ వివాదంలో కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన విమర్శలు చేసి తమ చౌకబారు బుద్ధిని బయపెట్టు్కున్నారని, చివరికి నరేంద్రమోడీ కులం గురించి కూడా ప్రస్తావించిన కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పరాకాష్టకు చేరుకుందని వెంకయ్య నాయకుడు ఘాటుగా విమర్శించారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని, భారతీయ జనతాపార్టీ మూడు వందలకు పైగా ఎంపీ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం తమకు వుందని ఆయన చెప్పారు.

శంషాబాద్‌లో మరో అరకిలో పట్టేసుకున్నారు

  శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిరోజూ కిలోలకు కిలోలు బంగారం ప్రయాణికుల నుంచి పట్టుకోవడం సాధారణమైపోయింది. ఇప్పుడు శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం దొరికితే న్యూస్ కాదు.. బంగారం దొరక్కపోతే న్యూస్‌లా పరిస్థితి తయారైంది ఈరకంగా కస్టమ్సోళ్ళు బంగారాన్ని లటుక్కుమని పట్టుసుకుంటున్నారని తెలిసినా బోలెడంత బంగారంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానం దిగేవాళ్ళని అమాయకులని అనుకోవాలా లేక తెగించినవాళ్ళని అనుకోవాలా? శనివారం నాడు ఎమిరిట్స్ నుంచి వచ్చిన ఒక విమానం నుంచి దిగిన ఒక మహిళ మీద కస్టమ్స్ వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆమెని ఆపి చెక్ చేయగా ఆమె దగ్గర అరకిలో బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

రహస్యంగా సీమాంధ్ర రాజధాని అన్వేషణలో శివరామకృష్ణన్ కమిటీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నగరాన్ని ఏ ప్రాంతంలో నిర్మించాలనే విషయం మీద పరిశీలన జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో వుంది. ఈ కమిటీ రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్న అన్ని ప్రాంతాల్లోనూ, రాష్ట్ర అధికారులు సూచించిన ఇతర ప్రాంతాలలోనూ పర్యటించనుంది. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రంలో తన పర్యటనను విశాఖపట్టణంతో ప్రారంభించింది. కమిటీకి తమ వాదనలు వినిపించడానికి అన్ని ప్రాంతాల నాయకులు విజ్ఞప్తులతో, వినతిపత్రాలతో సిద్ధంగా వున్నారు. కమిటీ మొదట వైజాగ్‌లో పర్యటిస్తుందన్న విషయం బయటకి తెలిసిపోయింది కాబట్టి తమను కలిసిన వారి విజ్ఞప్తులను కమిటీ స్వీకరిస్తుంది. అయితే ముందు ముందు ఇతర ప్రాంతాలలో కూడా ఇలాగే పలువురు తమను కలిసిన పక్షంలో తమ పర్యటన సక్రమంగా జరిగే అవకాశం లేదని శివరామక‌ృష్ణన్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తమ పర్యటనను పూర్తిగా రహస్యంగా నిర్వహించాలని భావిస్తున్నారు. తమ పర్యటన గురించి ఎంతమాత్రం పబ్లిసిటీ చేయకూడదని, మీడియాకు కూడా సమాచారం ఇవ్వకూడదని కమిటీ పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

తూ.గో. జిల్లా పత్తిపాడు ఈవీఎంలు తడిచిపోయాయా?

  తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తడిసిపోయాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో పోలింగ్ ముగియగానే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను కాకినాడ జేఎన్‌టియులోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా స్ట్రాంగ్ రూమ్‌లోకి భారీ స్థాయిలో నీరు చేరింది. దీంతో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలు తడిసిపోయినట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ స్ట్రాంగ్ రూమ్‌ని పరిశీలించి వెళ్ళారు. స్ట్రాంగ్ రూమ్‌‌లోని ఈవీఎంల వాస్తవ పరిస్థితిని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

నరేంద్రమోడీ భారత ప్రధాని అవుతారన్న అమెరికా అధికారి

  ఇండియాకి కాబోయే ప్రధానమంత్రి ఎవరని దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా నరేంద్రమోడీ అని ఠక్కున చెప్పేస్తాడు. భావి భారత ప్రధానిగా నరేంద్రమోడీని తప్ప మరొకర్ని చూడాలని భారత ప్రజలు అనుకోవడం లేదు. నరేంద్రమోడీ ప్రధాని అవుతాడనే విషయం ఇండియన్లతోపాటు అమెరికా వాళ్ళకి కూడా తెలిసిపోయినట్టుంది. ఎందుకు తెలియదు.. ఇండియాలో నిక్కరేసుకునే చిన్న పిల్లాడికైనా తెలిసిపోయిన ఈ విషయం అత్యంత పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వున్న అమెరికాకి తెలియకుండా వుంటుందా? అందుకే అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేరీ హర్ఫ్ ఇండియాకి నరేంద్రమోడీ ఇండియాకి కాబోయే ప్రధాని అనే విషయాన్ని తన మాటల్లో బయటపెట్టారు. మేరీ హార్ఫ్ అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ కూడా కావడం విశేషం. న్యూయార్క్ లో జరిగిన ఒక సమావేశంలో ఒక జర్నలిస్టు మేరీని ‘‘ఇండియాకి మోడీ ప్రధాని అయితే ఆయనను అమెరికాకి ఆహ్వానిస్తారా‌? ఆయన వీసా సమస్యను ఎలా పరిష్కరిస్తారు?’’ అని ప్రశ్నించారు. దానికి మేరీ స్పందిస్తూ, ‘‘భారత దేశానికి ప్రధాని ఎవరు అయినా మేము ఆయనతో కలసి పనిచేస్తాం. బహుశా త్వరలో మేము నరేంద్రమోడీతో అమెరికాలో సమావేశం కావచ్చు’’ అని సమాధానం చెప్పారు. అంటే అర్థం.. నరేంద్రమోడీ ఇండియాకి ప్రధాని కాబోతున్నారని అమెరికా అధికారులకు అర్థమైపోయిందన్నమాట. నరేంద్రమోడీ ప్రధాని అవుతారన్న విషయం ఇక్కడ వున్న ఇండియన్స్ కి తెలిసిపోయింది. ఎక్కడోవున్న అమెరికా అధికారులకు తెలిసింది. కానీ తల్లీకొడుకులు సోనియా, రాహుల్‌కి, యుపీఏ భాగస్వామ్య పక్షాల నాయకులకి, కేసీఆర్‌కి మాత్రం తెలియడం లేదు.

వచ్చేది మోడీ ప్రభుత్వం: పరుగు తీసిన స్టాక్ మార్కెట్

  ఇక కేంద్రంలో రాబోయేది నరేంద్రమోడీ ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వం అని దేశ వ్యాపార్, కార్పొరేట్ వర్గాలకు తెలిసిపోయినట్టుంది. అందుకే శుక్రవారం నాడు దేశ స్టాక్ మార్కెట్లు ఎగసిపడ్డాయి. ఈనెల 12వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే దేశంలో ఎవరు అధికారంలోకి రాబోయేదీ స్పష్టంగా తెలిసిపోతుంది. శుక్రవారం నాడు ఈ వారంలో స్టాక్ మార్కెట్‌కి చివరి రోజు. మోడీ ప్రభుత్వం వచ్చే విషయం సోమవారం నాటికి స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు స్టాక్ మార్కెట్‌ ‘బుల్’కి పట్టపగ్గాలు వుండవు. ఇక రాబోయేది మోడీ ప్రభుత్వమేనని కార్పొరేట్ వర్గాలకు తెలియడం వల్లనేమో శుక్రవారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళాయి. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఇ 650 పాయింట్లు పైకి దూసుకెళ్ళి 22,994 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 199 పాయింట్లు పైకి ఎగసి 6859 పాయింట్ల వద్ద స్థిరపడింది. మోడీ ప్రభుత్వం వస్తే దేశం అభ్యున్నతి పథంలో పయనిస్తుందన్న నమ్మకం కార్పొరేట్ వర్గాల్లో వుందని, అందుకే మోడీ ప్రభుత్వం అంటే సానుకూల స్పందన కనిపిస్తోందని వ్యాపార, కార్పొరేట్ వర్గాలు అంటున్నాయి.

జగనే ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం: కేసీఆర్ నోట సీమాంధ్ర మాట

  విభజనవాది కేసీఆర్, సమైక్యవాది ముసుగులో వున్న పచ్చి విభజనవాది జగన్ మధ్య వున్న ఆత్మీయత మరోసారి బయటపడింది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం వీరిద్దరి మధ్య వున్న అనుబంధానికి అద్దం పట్టింది. కేసీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే, తెలంగాణలో టీఆర్ఎస్‌కి 90 సీట్లు వస్తాయట. కాంగ్రెస్‌కి మాత్రం 23 నుంచి 30 స్థానాలు మాత్రమే వస్తాయట. ఈయనగారు తెలంగాణ సీఎం అవుతాడట. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందట. మొన్నటి వరకూ సోనియాని, రాహుల్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు సోనియా, రాహుల్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం, ఆ తల్లీకొడుకులంటే తనకెంలాంటి వ్యతిరేకత లేదని చెప్పడం వెరైటీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మూడో ఫ్రంట్ గురించి ఆలోచిస్తాడట. అంతేగానీ ఎన్టీయేకి మాత్రం మద్దతు ఇవ్వడట. ఇదిలా వుంటే ఈ డూప్లికేట్ తెలంగాణ బిడ్డ తన తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించకుండా సీమాంధ్ర గురించి, జగన్ గురించి ఆలోచించేశాడు. సీమాంధ్రలో జగన్ వందకు పైగా సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తాడట. తాను చేసిన స్పెషల్ సర్వేలో జగన్‌కి వందకంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదని తెలిసిపోయిందట. తెలుగుజాతి ప్రయోజనం కోసం తాను, జగన్ కలసిమెలసి పనిచేస్తారట.

మే 12 సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ కి ఓకే: సి.ఇ.సి.

  గతంలో ఎన్నికలు జరిగిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కి అవకాశం వుండేది. అయితే ఈసారి ఎన్నికలలో ఆ అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు అనేక దశల్లో జరగడంతోపాటు ఎగ్జిట్ పోల్స్ ఓటర్ల మీద ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల కమిషన్ 12వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని నిషేధం విధించింది. ఎన్నికలు ముగిసినా ఎగ్జిట్ పోల్స్ సందడి లేకపోవడంతో రాజకీయంగా వేడి వాతావరణం అకస్మాత్తుగా తగ్గిపోయిన ఫీలింగ్ అందరిలో ఏర్పడింది. ఎన్నికల వేడిని మళ్ళీ రగలబోతోంది. ఈనెల 12 నుంచి ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించుకోవచ్చని ఎన్నికల కమిషన్ తాజాగా స్పష్టం చేసింది. తుది విడత పోలింగ్ గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఎవరైనా ప్రకటించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మే 12 సాయంత్రం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడేవరకూ మీడియా, ప్రజలు, రాజకీయ నాయకులు అసలైన ఎన్నికల పండుగ చేసుకోబోతున్నారు.

ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పెట్టి బిల్డింగ్ మీద నుంచి దూకింది

  మలేసియాలోని కోటా కినాబాలు అనే టౌన్‌కి చెందిన హర్సినా చీ అనే యువతి ఎంతోకాలంగా ఒక యువకుడితో ప్రేమలో వుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె లవ్‌స్టోరీలో అనుకోని మలుపులు వచ్చాయి. ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయింది. గత కొన్ని రోజులుగా ఆమె తన ఫేస్‌బుక్ వాల్ మీద నిర్వేదంతో కూడిన పోస్టింగ్స్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్‌ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా పోస్ట్ చేస్తోంది. దీనిని ఆమె ఫ్రెండ్స్ గానీ, ఆమె ప్రియుడు కానీ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. సడెన్‌గా నిన్న ఆమె ఒక సూసైడ్ నోట్‌ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ‘‘బిల్డింగ్ మీద నుంచి దూకడం ఒక పిచ్చిపని అని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు నాముందు అది తప్ప మరో మార్గం లేదు. ఇది నీకోసమే రాస్తున్నాను. నేను ఎంత పిచ్చిదాన్నో నీకు తెలిసొచ్చేలా చేస్తాను. నీకు నా థాంక్స్. నేను నా కళ్ళని శాశ్వతంగా మూసేస్తున్నాను’’ అని పోస్ట్ చేసి వెంటనే బిల్డింగ్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది.

ఆ కుటుంబం మీద మృత్యువు పగబట్టింది

  మృత్యుదేవత కర్కోటకురాలు. జాలి, దయ అనే పదాలే దానికి తెలియవు. అలాంటి మృత్యువు ఒక్కోసారి మరీ కర్కోటకంగా ప్రవర్తిస్తుంది. దీనికి ఉదాహరణగా నిలిచే సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో మృత్యువు ఒక కుటుంబం మీద పగబట్టింది. ధనశ్రీ కదమ్ అనే బాలిక పోటీ పరీక్ష రాయడానికి ముంబై - గోవా హైవే మీద ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. కుమార్తె మరణవార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్, ప్రియాంక గుండెలు పగిలేలా రోదించారు. కూతురి మృతదేహం దగ్గరకి చేరుకుని విలపించారు. ఆ తర్వాత కూతురు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తున్నారు. అంబులెన్స్ వెనుకే ప్రవీణ్, ప్రియాంక, వీరి సమీప బంధువు నరేష్ దేవ్‌రే కారులో వస్తున్నారు. ఇంతలో రోడ్డుపక్కన వున్న ఒక పొక్లెయినర్ అకస్మాత్తుగా ఒరిగిపోయి కారుమీద పడింది. దాంతో కారులో వున్న ప్రవీణ్, ప్రియాంక, నరేష్ అక్కడికక్కడే మరణించారు. తమ ఇంట్లో ముగ్గురూ ఒకేసారి మరణించడంతో, ప్రవీణ్, ప్రియాంక దంపతుల చిన్న కుమార్తె శివం కదమ్ షాక్‌కి గురైంది. ఈ దుర్ఘటనలను చూసి స్థానికులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.

విమానం టాయ్‌లెట్‌లో రెండు కిలోల బంగారం!

  విమానం టాయ్‌లెట్‌లో రెండు కిలోల బంగారం దొరికింది. ఇది ఎక్కడో ఏ ఫారిన్‌లోనే కాదు.. మన ఇండియాలోనే.. కేరళలోని కొరిప్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. షార్జా నుంచి కాలికట్ వెళ్తున్న విమానంలో ఎయిర్ హోస్టెస్ టాయ్‌లెట్‌కి వెళ్ళినప్పుడు టాయ్‌లెట్‌లో ఎవరో ప్రయాణికుడు దాచిన రెండు కిలోల బంగారాన్ని గమనించింది. ఆమె వెంటనే ఈ విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్ళింది. విమానాన్ని దించడానికి ముందే పైలెట్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాడు. అయితే అరవై లక్షల విలువైన ఆ బంగారం మాది అని ప్రయాణికులలో ఎవరూ ముందుకు రాలేదు. అలా వస్తే అరెస్టు చేయాలని ఎయిర్ పోర్ట్ అధికారులు వెయిట్ చేశారు. అయితే ఎవరూ సదరు బంగారాన్ని క్లెయిమ్ చేయకపోవడంతో ఆ రెండు కిలోల బంగారం ప్రస్తుతం కస్టమ్స్ అధికారుల దగ్గరే వుంది.

కడప, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతున్న అల్లర్లు

  ఎన్నికలు పూర్తయ్యి రెండురోజులు కావస్తున్నా నేటికీ కడప, నెల్లూరు జిల్లాలలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ రెండు జిల్లాలు కూడా వైకాపాకు మంచి పట్టున్న ప్రాంతాలే కావడం వలన సహజంగానే వైకాపానే అనుమానించవలసి వస్తోంది. కడప జిల్లాలో జమ్మలమడుగు, ఖాజీపేట్, నెల్లూరులో దంతలూరు ప్రాంతాలలో నేటికీ ఇరువర్గాల నడుమ వీధిపోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి, వాటిలో ఇరువర్గాలకు చెందిన అనేకమంది గాయపడుతూనే ఉన్నారు. ఈ గొడవలకు ప్రధాన కారణం వైకాపాకు కంచుకోట వంటి ఈ ప్రాంతాలలో తెదేపా నేతలు పోటీకి దిగి, ఆ పార్టీ అభ్యర్ధులతో సమానంగా ప్రచారం చేసుకొని, వారితో సమానంగా డబ్బు, మద్యం వగైరాలు పంచడమే. తెదేపాకు చెందిన పీ.వెంకట శివారెడ్డి, వైకాపాకు చెందిన యం.యల్సీ. సీ.నారాయణ రెడ్డి వర్గాల మధ్య నిన్న జమ్మలమడుగులో ఘర్షణలు జరిగాయి. షరా మామూలుగా ఇరువర్గాల వారు గాయపడ్డారు, ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్లలో పిర్యాదులు చేసుకొన్నారు. కాజిపేట్ లో మైదకూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లా ఎరుకొల్లు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇటువంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకు ముందు ఎన్నికలలో కూడా ఇటువంటి అల్లర్లు, గొడవలు జరిగినప్పటికీ, అవి ఏనాడు కూడా ఇంతగా ఎన్నికల ముగిసిన తరువాత కూడా సాగిన దాఖలాలు లేవు. ఇటువంటి రాజకీయ వాతావరణం రాష్ట్రానికి, రాజకీయాలకు కూడా హానికరం. రెండు పార్టీల అధినేతలు ఏసీ రూముల్లో కూర్చొని మీడియా ద్వారా ఒకరిని మరొకరు నిందించుకొంటూ కాలక్షేపం చేస్తుంటే, అక్కడ గ్రామాలలో కార్యకర్తలు వీరికోసం బుర్రలు పగలగోట్టుకొని రక్తాలు ధారపోస్తున్నారు. కనీసం ఇప్పటికయినా ఆ రెండు పార్టీల అధినేతలు చొరవ తీసుకొని తమ తమ కార్యకర్తలను నియంత్రిస్తే తమ కార్యకర్తల కుటుంబాలకి మేలు చేసినవారవుతారు.