ఆంధ్రప్రదేశ్‌లో 59 మునిసిపాలిటీలు టీడీపీ సొంతం

      ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 92 మునిసిపల్ స్థానాలకు గాను మొత్తం స్థానాల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మునిసిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. టీడీపి 59 మునిసిపాలిటీలను సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 మునిసిపాలిటీలను గెలుచుకుంది. అలాగే 16 మునిసిపల్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో మునిసిపల్ చైర్మన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అవుతాడన్నది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఈ 16 స్థానాలను గెలుచుకోవడానికి, మద్దతు సంపాదించడానికి టీడీపీ, వైసీపీ తమవంతు ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టాయి.

తెలంగాణలో 16 స్థానాలతో టాప్‌లో కాంగ్రెస్

      తెలంగాణ ఇచ్చిన ఫలితాన్ని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పొందుతోంది. మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 16 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో అగ్రస్థానంలో ఉన్నానని భావించిన టీఆర్ఎస్ మాత్రం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎవరూఊహించని విధంగా టీడీపీ, బీజేపీ కూటమి తెలంగాణలో 7 స్థానాలు గెలుచుకుంది. రెండు స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఏ పార్టీకి మెజారిటీ రాకుండా 19 స్థానాలు ‘హంగ్’లుగా మిగిలాయి. ఈ 19 స్థానాలలో ఏ పార్టీ ఎక్కువమంది కౌన్సిలర్ల మద్దతు పొందగలిగితే ఆ పార్టీ ఆధిక్యం సాధించే అవకాశం వుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ టీడీపీ కూటమి దృష్టి ఈ 19 స్థానాల మీదే వుంది. వీటిలో తమ పార్టీ ఎన్ని స్థానాలను సొంతం చేసుకోగలదన్న దానిమీదే ఆలోచనలు జరుగుతున్నాయి.

ఈసారి ‘హంగ్’ల హంగామా ఎక్కువే!

      ఈసారి మునిసిపల్ ఎన్నికలలో ఫలితాన్ని ఎటూ తేల్చని ‘హంగ్’ల హంగామా ఎక్కువగానే వుంది. అటు సీమాంధ్రలోని, ఇటు తెలంగాణలోనూ హంగ్‌లు భారీ సంఖ్యలోనే ఏర్పడ్డాయి. తెలంగాణలో మొత్తం 19 హంగ్‌ మునిసిపాలిటీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాల్లో ఎవరి మద్దతుతో ఎవరు ఛైర్మన్ పీఠాన్ని అధిష్ఠిస్తారో ఎవరూ ఊహించలేని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకూ తిట్టుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి మునిసపల్ పీఠంపై ఛైర్మన్ ఎవరో నిర్ణయించుకోవాలసిన అవసరం కనిపిస్తోంది. అలాగే సీమాంధ్రలో 16 హంగ్‌లు వచ్చాయి. చాలాచోట్ల టీడీపీ, వైకాపా పోటాపోటీగా వున్నాయి. ఈ రెండు పార్టీలు కలసి ఛైర్మన్‌ని ఎంపిక చేసే అవకాశం లేదు. అలాగే కొన్ని స్థానాల్లో ఇతరులు కీలక వ్యక్తులుగా వున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మున్సిపల్ ఫలితాలు

      ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మునిసిపల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 92 మునిసిపల్ స్థానాలకు గాను మొత్తం స్థానాల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మునిసిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది. టీడీపి 59 మునిసిపాలిటీలను సొంతం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 17 మునిసిపాలిటీలను గెలుచుకుంది. అలాగే 16 మునిసిపల్ స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో మునిసిపల్ చైర్మన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అవుతాడన్నది కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. ఈ 16 స్థానాలను గెలుచుకోవడానికి, మద్దతు సంపాదించడానికి టీడీపీ, వైసీపీ తమవంతు ప్రయాత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే తెలంగాణలోని 53 మునిసిపాలిటీలకు సంబంధించిన అన్ని స్థానాల కౌంటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ 16 మునిసిపాలిటీలలో గెలుపొందింది. టీఆర్ఎస్ 9 స్థానాలలో గెలిచింది. టీడీపీ, బీజేపీ కూటమి 7 మునిసిపాలిటీలను సొంతం చేసుకుంది. 19 మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. రెండు స్థానాలలో ఇతరులు గెలిచారు.

చిత్తూరు జిల్లాలో తెదేపా, వైకాపా పోటాపోటీ

      చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీ పోరు జరిగింది. ఎన్నికల ఫలితాలలో రెండు పార్టీలూ సమ స్థాయిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మదనపల్లిలోని 35 వార్డుల్లో 15 తెలుగుదేశం, 17 వైకాపా గెలిచింది. 3 స్థానాల్లో ఇతరులు గెలిచారు. శ్రీకాళహస్తిలోని 35 వార్డుల్లో 4 కాంగ్రెస్, 18 తెలుగుదేశం, 11 వైకాపా, 2 ఇతరులు గెలిచారు. పుంగనూరులోని 24 వార్డుల్లో 7 తెలుగుదేశం, 17 వైకాపా గెలిచాయి. పలమనేరులోని 24 వార్డుల్లో 6 తెలుగుదేశం, 17 వైకాపా సొంతం చేసుకున్న్నాయి. 1 ఇతరులు గెలిచారు. నగరిలోని 27 వార్డుల్లో 13 వార్డుల్లో తెలుగుదేశం, 11 వైకాపా గెలవగా, 3 వార్డుల్లో ఇతరులు గెలిచారు. పుత్తూరులోని 24 వార్డుల్లో 13 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి.

తెలంగాణలో కాంగ్రెస్, సీమాంధ్రలో తెలుగుదేశం... జీరో అయిన జగన్..

      సీమాంధ్ర పూర్తిగా తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ముందు దిగదుడుపు అయిపోయింది. తెలంగాణ‌లో ఎక్కడికో వెళ్ళిపోతానని కలలు కన్న టీఆర్ఎస్ చతికలపడింది. అలాగే సీమాంధ్రలో తనదే హవా అని భావించిన వైకాపాకి అంతసీను లేదని సీమాంధ్ర ఓటర్లు తేల్చి చెప్పారు. మొత్తమ్మీద తెలంగాణలో కాంగ్రెస్ హీరో అయితే, సీమాంధ్రలో తెలుగుదేశం హీరో అయ్యింది. తెలంగాణలో టీఆర్ఎస్ జీరో అయితే, సీమాంధ్రలో జగన్ జీరో అయ్యాడు. అలాగే తెలంగాణలో హీరో అయిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో జీరో అని కూడా అనడానికి వీల్లేనంతగా అడ్రస్ గల్లంతైపోయింది.

నెల్లూరులో హోరాహోరీ

      నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం, వైకాపా హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ జిల్లాలో రెండు పార్టీల బలాలు సమానంగా వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం ఆరు మునిసిపల్ స్థానాలున్నాయి. గూడూరులోని 33 వార్డుల్లో 16 తెలుగుదేశం గెలుచుకోగా 15 వార్డులు వైకాపా గెలుచుకుంది. వామపక్షాలు, ఇతరులు ఒక్కో స్థానాన్ని పొందారు. కావలిలోని 40 వార్డుల్లో కాంగ్రెస్ 2, తెలుగుదేశం 16, వైకాపా 20, ఇతరులు 2 స్థానాలు గెలిచారు. వెంకటగిరిలోని 25 స్థానాల్లో 1 కాంగ్రెస్, 21 తెలుగుదేశం, 2 వైకాపా, 1 ఇతరులు గెలిచారు. ఆత్మకూరులోని 23 వార్డుల్లో కాంగ్రెస్ 8 వార్డులు గెలిచింది. తెలుగుదేశం 4, వైకాపా 10, ఇతరులు 1 వార్డు గెలిచారు. సూళ్ళూరుపేటలోని 23 వార్డుల్లో 2 కాంగ్రెస్, 8 తెలుగుదేశం 10 వైకాపా, 2 ఇతరులు గెలిచారు. నాయుడుపేటలోని 20 వార్డుల్లో 14 తెలుగుదేశం, 6 వైకాపా గెలిచాయి.

గుంటూరు జిల్లాలోనూ తెలుగుదేశానిదే ఆధిక్యం

      గుంటూరు జిల్లాలో కూడా మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో మొత్తం 12 మునిసిపల్ స్థానాలున్నాయి. వీటిలో 11 మునిసిపల్ స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెనాలిలోని 40 స్థానాల్లో ఇప్పటి వరకు 10 స్థానాలను తెలుగుదేశం, మూడు స్థానాలను వైకాపా గెలుచుకుంది. నరసరావుపేటలోని 40 స్థానాల్లో 18 తెలుగుదేశం, 15 తెలుగుదేశం గెలవగా ఒక స్థానంలో వామపక్షాలు విజయం సాధించాయి. బాపట్లలోని 34 స్థానాల్లో ఒక స్థానాన్ని కాంగ్రెస్, 8 స్థానాలను తెలుగుదేశం, 6 స్థానాలను వైకాపా, ఒక స్థానాన్ని ఇతరులు గెలిచారు. రేపల్లె మునిసిపాలిటీలోని 28 స్థానాల్లో మూడు స్థానాలను కాంగ్రెస్, పదహారు స్థానాలను తెలుగుదేశం, తొమ్మిది స్థానాలను వైకాపా గెలిచాయి. చిలకలూరిపేటలోని 34 స్థానాల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 15 స్థానాలు వైకాపా గెలిచాయి. ఒక స్థానాన్ని ఇతరులు సొంతం చేసుకున్నారు. పొన్నూరులోని 31 స్థానాల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 13 స్థానాలు వైకాపా గెలిచాయి. మంగళగిరిలోని 32 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 14, వైకాపా 8, వామపక్షాలు 6, ఇతరులు 1 స్థానం గెలిచారు. మాచర్లలోని 29 స్థానాల్లో తెలుగుదేశం 20, వైకాపా 8, ఇతరులు 1 స్థానాన్ని గెలిచాయి. సత్తెనపల్లిలోని 30 స్థానాల్లో 1 కాంగ్రెస్, 15 తెలుగుదేశం, 13 వైకాపా, 1 ఇతరులు గెలిచారు. వినుకొండలోని 26 స్థానాల్లో మూడు కాంగ్రెస్, ఆరు తెలుగుదేశం, ఎనిమిది వైకాపా, నాలుగు వామపక్షాలు, ఐదు ఇతరులు గెలిచారు. ఇక్కడ ఎవరికీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. పిడుగురాళ్ళలోని 30 స్థానల్లో 18 స్థానాలు తెలుగుదేశం, 12 స్థానాలు వైకాపా గెలిచాయి. తాడేపల్లిలోని 23 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 3, వైకాపా 18, ఇతరులు ఒక స్థానం గెలిచారు.

విజయనగరంలో తెలుగుదేశం విజయఢంకా

      విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది. జిల్లాలోని నాలుగు మునిసిపల్ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. బొబ్బిలి స్థానం విషయంలో మాత్రం ఏ పార్టీకి ఆధిక్యం లభించలేదు. విజయనగరంలోని 40 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, టీడీపీ 22 స్థానాల్లో విజయం సాధించగా, వైకాపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇతరులు ఒక స్థానాన్ని పొందారు. బొబ్బిలిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, తెలుగుదేశం 13 స్థానాల్లో గెలవగా, వైకాపా 15 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఛైర్మన్ అవుతాడో అర్థం కాని పరిస్థితి వుంది. పార్వతీపురంలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 14 స్థానాలు, వైకాపా 10 స్థానాలు పొందాయి. ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. సాలూరులోని 29 స్థానాల్లో మూడు కాంగ్రెస్, పదిహేడు తెలుగుదేశం, వైకాపా తొమ్మది స్థానాల్లో గెలిచాయి.

శ్రీకాకుళంలో రెండేసి స్థానాలు పంచుకున్నారు

      శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మునిసిపల్ స్థానాల్లో టీడీపీ రెండు స్థానాల్లో గెలవగా, వైకాపా రెండు స్థానాల్లో గెలిచింది. పలాస, పాలకొండ స్థానాలను తెలుగుదేశం గెలుచుకోగా, ఆముదాల వలస, ఇచ్ఛాపురం స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. ఆముదాల వలసలో మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ (3), తెలుగుదేశం (7), వైకాపా (11), ఇతరులు (2) స్థానాల్లో గెలిచారు. ఇచ్ఛాపురంలో 23 స్థానాలుంగా తెలుగుదేశం (8), వైకాపా 13 స్థానాల్లో గెలిచాయి. ఇతరులు రెండు స్థానాలు పొందారు. పలాసలోని 25 స్థానాల్లో తెలుగుదేశం 17 స్థానాల్లో, వైకాపా 8 స్థానాల్లో గెలిచాయి. పాలకొండలోని 20 స్థానాల్లో తెలుగుదేశం 12 స్థానాలు, వైకాపా 3, ఇతరులు 5 స్థానాలు పొందారు.

తెలంగాణలో కౌన్సిలర్ స్థానాల్లో అగ్రస్థానంలో కాంగ్రెస్

      రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో నేలమట్టమైపోయింది. తెలంగాణ మాత్రం ఈ పార్టీ టీఆర్ఎస్‌ కంటే ముందంజలో వుంది. మొత్తం కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. తెలంగాణలో మొత్తం 1399 కౌన్సిలర్ స్థానాలు వున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1321 కౌన్సిలర్ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 485 స్థానాలు గెలుచుకుంది. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి 306 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈ పార్టీ 147 వార్డుల్లో గెలిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది.

తెలంగాణలో కాంగ్రెస్ వైపు మొగ్గిన ఓటరు

      సీమాంధ్రలో సర్వనాశనమైపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం రాష్ట్రం ఇచ్చిన క‌ృతజ్ఞతలు పొందుతోంది. ఇప్పటి వరకు వెల్లడయిన మునిసిపల్, కార్పొరేషన్ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌తో పోటాపోటీగా వుంది. తెలుగుదేశం పార్టీ గౌరవప్రదమైన సంఖ్యలు కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాలు పొందుతున్నప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తమదే హవా నడుస్తుందని భావించిన టీఆర్‌ఎస్‌కి మాత్ర మునిసిపల్ ఎన్నికలలో ఓటర్లు షాక్ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితిని చూస్తే ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినట్టు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయి.

కడప జిల్లాలో బద్వేలు టీడీపీదే

      కడప జిల్లాలో వైఎస్సార్ బతికి వున్నంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వుండేది. వైకాపా ఆవిర్భావం తర్వాత కడప జిల్లాలో అగ్రస్థానాన్ని వైకాపా సొంతం చేసుకుందని ఆ పార్టీ నాయకులు భావిస్తూ వస్తున్నారు. అయితే అవన్నీ భ్రమలనే విషయాన్ని ప్రస్తుత మునిసిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కడప జిల్లాలో వైసీసీ కీలకమైన స్థానంగా భావిస్తున్న బద్వేలు మునిసిపల్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడున్న పద్నాలుగు కౌన్సిలర్ల స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 13 స్థానాలు కైవసం చేసుకోగా వైసీపీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే సొంతం చేసుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఏలూరులో పుంజుకున్న తెలుగుదేశం

      ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. ఈ కార్పొరేషన్‌లో కౌంటింగ్ మొదలైన కాసేపటికి వైసీపీ ఆధిక్యం కనిపించింది. తెలుగుదేశం పార్టీ వెనుకబడిపోయింది. సీమాంధ్ర అంతటా తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తున్న దశలో ఏలూరు కార్పొరేషన్‌లో మాత్రం వైకాపా అనుకూలత కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొంత సమయం గడిచిన తర్వాత ఏలూరులో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వైకాపాని దాటుకుని ముందుకు వెళ్ళింది. ఏలూరు కార్పొరేషన్‌‌లోని 45 స్థానాల్లో ‌16 స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యంలో వుండగా, వైకాపా 5 స్థానాల్లో ఆధిక్యంలో వుంది.