పవన్ టీ ఇచ్చాడు.. చంద్రబాబు భోజనం పెట్టాడు
posted on May 8, 2014 @ 5:19PM
ఎన్నికల ముందు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్‌కి సఖ్యత కుదిరిన సమయంలో చంద్రబాబు నాయుడు అందర్నీ ఆశ్చర్యపరిచే రీతిలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనం కోసమో, స్నేహం కోసమో ఒకరి ఇంటికి వెళ్ళడం అనేది ఎవరూ ఊహించని విషయం. ఎవరైనా చంద్రబాబు దగ్గరకే రావాలి తప్ప చంద్రబాబే ఒకరి దగ్గరకి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్‌తోనే మొదలైంది. ఆనాడు జరిగిన ఈ సంఘటన గురించి చంద్రబాబు చెబుతూ, ‘పవన్ కళ్యాన్ తేనీటి విందుకు పిలిచారు.. వచ్చాను’ అని చెప్పారు. ఆ తర్వాత పవన్, బాబు ఇద్దరి స్నేహం బలపడటం, బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కళ్యాణ్ వీరలెవల్లో ప్రచారం చేయడం జరిగాయి. ఇచ్చిపుచ్చకున్నదే అసలైన స్నేహం. అందుకే చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్‌ని తన ఇంటికి లంచ్‌కి పిలిచాడు. పవన్ కళ్యాణ్ కాదనకుండా చంద్రబాబు ఇంటికి వచ్చాడు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌తో కలసి పవన్ కళ్యాణ్‌కి సాదర స్వాగతం పలికారు. ముగ్గురూ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ముచ్చటించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు కుటుంబం నవకాయ పిండివంటలతో షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన టీకి బదులుగా చంద్రబాబు మంచి భోజనం పెట్టాడు. చెల్లుకి చెల్లు మరి పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసిన దానికి బదులుగా చంద్రబాబు ఏమిస్తారో, ఏ పదవి ఇస్తారో చూడాలి.