ప్రజాసేవ చేయడానికి ఇంత దౌర్జన్యం అవసరమా?
posted on May 8, 2014 8:20AM
ఈసారి ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల నకిలీ మద్యం, నకిలీ కరెన్సీ పంపకాలు కూడా జరిగాయి. కొన్ని ప్రాంతాలలో ఇతర జిల్లాల నుండి వచ్చిన రౌడీ మూకలు ప్రజలను, ప్రత్యర్ధులను, చివరికి పోలీసులను, మీడియాను, పోలింగు అధికారులను కూడా భయబ్రాంతులను చేసారు. పోలింగు మొదలయ్యే వరకు ప్రలోభాల పర్వం సాగించిన సదరు పార్టీ, పోలింగు మొదలయినప్పటి నుండి పూర్తయిన తరువాత కూడా చాలా దౌర్జన్యంగా వ్యవహరించింది. కొన్ని చోట్ల ప్రత్యర్ధ అభ్యర్ధులను నిర్బంధించడం, కొట్టడంతో ప్రత్యర్ధులు కూడా జరిగిన సంఘటనలు ప్రజలే చూసారు. అనేక చోట్ల రెండు ప్రధాన పార్టీల అనుచరుల మధ్య ఘర్షణలు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు, లాటీ చార్జీ చేయవలసి వచ్చింది. ఇంతకు ముందు ఎన్నికలలో ఇటువంటి చెదురు ముదురు సంఘటనలు జరిగినప్పటికీ, ఇంతగా దౌర్జన్యకాండ ప్రజలెన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేసేందుకే అయితే ఇంత దౌర్జన్యం, గొడవలు అవసరం లేదు. కానీ, వివిధ ప్రాంతాలలో నిన్న జరిగిన సంఘటనలు చూసినపుడు, అది ప్రజాసేవ కోసమేనని ఎవరూ భావించలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు అధికారం కైవసం చేసుకోవడానికి ఎన్నికలలో పోరాడటం చూసాము. కానీ వ్యక్తులు తమను కమ్ముకొన్న సమస్యల నుండి బయటపడేందుకు ఎన్నికలలో పోటీ చేయడం ఇదే ప్రధమం. ఏమయినప్పటికీ ప్రజలు తమ తీర్పు చెప్పేశారు. ఇక ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. అధికారంలోకి రాబోయే పార్టీని బట్టే రాష్ట్ర ప్రజల భవిష్యత్ కూడా ఆధారపడి ఉంటుంది.