హోంమంత్రి సబితా పై దానం ఫైర్

ఇస్కాన్  లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ఇష్యూ మంత్రుల మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది. దానం హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పైన మండిపడ్డారు. తనపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. టిడిపి హయాంలో తనపై 190 కేసులు పెట్టారని, ఏం కాలేదని, ప్రజల కోసం కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. తనపై కేసు విషయమై హోంమంత్రి వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె నిద్ర పోతుందా అని ప్రశ్నించారు. తాను బిసిని కాబట్టే తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని విమర్శించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కొందరు సిఎంను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇలా అయితే కాంగ్రెసు నాశనం అవడం ఖాయమన్నారు.  

బంజారాహిల్స్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద టెన్షన్ టెన్షన్

బంజారాహిల్స్‌రోడ్డు నెంబర్.12 వద్ద టెన్షన్ వాతావరణం నెలొకొంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భూముల వ్యవహారంపై మంత్రి దానం నాగేందర్ మరి కాసేపట్లో మౌన దీక్ష చేపడతారని వార్తలు రావడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మంత్రికి వ్యతిరేకంగా బజ్‌రంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాగా ఆలయం వద్ద ఆందోళన దిగుతారని భావించిన మంత్రి దానం నాగేందర్ ఇస్కాన్ ఆలయం వెలుపల కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు. మరోవైపు ఇస్కాన్ దేవాలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. కృష్టుని విగ్రహాలు ఆలయానికి చేరుకున్నాయి.

మేరీకామ్‌కు 50 లక్షల నగదు ప్రకటించిన మణిపూర్ ప్రభుత్వం

ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో కాంస్యం సాధించి చరిత్ర సృష్టించిన భారత బాక్సర్ మేరీకామ్‌కు పతకం ప్రదానం చేశారు. గురువారం 51 కేజీల ఫ్లయ్ వెయిట్ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ కామ్‌కు మణిపూర్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సహాకాన్ని ప్రకటించింది. అడిషనల్ ఎస్పీగా పదోన్నతితో పాటు  మీటీ లాంగోల్ అనే ఊళ్లో రెండెకరాలు భూమిని కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్బంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ మాట్లాడుతూ క్రీడల్లో రాష్ట్రానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చిందని అన్నారు.

నీలిమది ఆత్మహత్యే అంటున్నఫోరెనిక్స్ నిపుణులు

ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ నీలిమ ఆత్మహత్య చేసుకుందని ఫోరెనిక్స్ నిపుణులు అంటున్నారు. నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన నిపుణుల్లో ఒకరు ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు వివరాలను వెల్లడించారు. పోలీసులకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చామని ఆయన చెప్పారు. నీలిమది హత్యకదని, ఆత్మహత్య అని వారు చెప్పారు. నీలిమకి ఎవరైనా విషం ఇచ్చరనే కోణంలో కూడా తాము వైద్య పరీక్షలు చేసామని, అటువంటిది ఏమిలేదని పరీక్షల్లో తేలిందని ఆయన అన్నారు. నీలిమ కాలేయం, ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షల్లో తేలింది.   నీలిమ భవనంపై నుంచి నీలిమ ఎడమ వైపు నుంచి కింద పడిందని, పక్కటెముకలు విరిగాయని వారు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం భవనంపై నుంచి ఎవరైనా తోసి ఉంటారా అని ప్రశ్నిస్తే అది తమ పరిధిలోది కాదని, పోలీసులు తేల్చుకోవాల్సిన అంశమని ఆయన చెప్పారు. హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండవచ్చు గానీ తమ పరీక్షల్లో మాత్రం ఆత్మహత్యేనని తేలిందని వారంటున్నారు. పోలీసులు విస్రా రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో అది రావచ్చునని భావిస్తున్నారు. అది వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.    

జిల్లా కలెక్టర్ ఆఫీసులముందు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నాలు

రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ఆఫీసులముందు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాలో వై.ఎస్.ఆర్. సేవాదళ్, యువజన సంఘాలు పాల్గొన్నారు. ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ ను యథావిధిగా అమలు చేయాలనె డిమాండ్ తో కలెక్టరేట్ ఆఫీసులముందు ధర్నాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. ఫీజు రీ.ఎంబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోందని రాస్తా రోకో నిర్వహించిన నేతలు అంటున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు జనక్ ప్రసాద్, పుత్తా నాగిరెడ్డి  తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.