సాయిరాజ్ అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న వ్యాపార సంస్థలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పిరియా సాయి రాజ్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సోంపేటలో ఆయన ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు. 2010 ఏప్రిల్ నెలలో జరిగిన థర్మల్ వ్యతిరేక ఆందోళనలో పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అతను థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వేసిన టెంట్‌ను ఎమ్మెల్యే కూల్చారు. దీనిపై పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. ఆదివారం 12.08.12 న సాయిరాజ్ ను అరెస్టు చేసి బారువ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి సాయిరాజ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయి రాజ్ అరెస్టుకు నిరసనగా స్వచ్చందంగా వ్యాపార సంస్థలు శ్రీకాకుళంలో బంద్ పాటిస్తున్నాయి.

ఎస్.సి. వర్గీకరణకు తెలుగుదేశం మద్దతు

ఎస్.సి. వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని కూడా ఆయన పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో శనివారం నాడు పొలిట్ బ్యూరో సమావేశం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణకు తమ సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.   ఈ అంశంపై చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేస్తూ సుదీర్ఘ చర్చ అనంతరం ఎస్సీ వర్గీకరణ న్యాయమే అనిపిస్తున్నదని వివరించారు. ఈ విషయమై రాజ్యాంగ సవరణ జరగాలి అని డిమాండు చేస్తూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయం ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అంశంపై ఉషా మెహ్రా కమిటీ ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ పక్కన పెట్టిందని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరగవలసిందేనని ఆయన చెప్పారు.  

మహిళా న్యాయవాదిని హత్య చేసిన వాచ్ మెన్

మహిళా న్యాయవాది 25 సంవత్సరాల పల్లవిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పల్లవిని అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు పఠాన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పల్లవి కొద్ది రోజుల క్రితం తనను తిట్టిందని, అందుకే తనను హత్య చేసానని పఠాన్ పోలీసులకు చెప్పాడు. మొదటి ఓ గట్టి వస్తువుతో కొట్టి, ఆ తర్వాత కత్తితో మెడ కోసి పల్లవిని అతను హత్య చేశాడు. ముంబై రైల్వే స్టేషన్‌లో పఠాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. పల్లవిపై అత్యాచారం చేయడానికి కూడా పఠాన్ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. పల్లవి ఓ ఐఎఎస్ అధికారి కూతురు కూడా. ఆయన ఢిల్లీలోని ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు.      

ప్రముఖ భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ ద్రావిడ భాషా శాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి 84 అనారోగ్యంతో కన్నుమూశారు. మెడిసిటీ ఆస్పత్రిలో ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సులర్గా పనిచేసిన కృష్ణమూర్తి స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడ భాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ప్రముఖ్యులు.

అమెరికాలో ఘోర ప్రమాదం, 5 తెలుగువారు మృతి

అమెరికాలోని ఓక్లహామా నగరంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తెలుగు యువకులు మరణించారు. వీరంతా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని సుబ్బయ్యగారి జస్వంత్‌రెడ్డి, గాదె ఫణీంద్ర, అంతటి అనురాగ్, శ్రీనివాస్, వెంకట్‌గా గుర్తించారు. గురువారం రాత్రి వీరంతా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు.     స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరెవరూ సీట్‌బెల్టులు పెట్టుకోలేదని, అందుకే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒకరు ఖమ్మంజిల్లాకు చెందినవారు కాగా, మరొకరు హైదరాబాద్ వాసి అని, మిగతా ముగ్గురూ కూడా హైదరాబాద్ పరిసరప్రాంతాల వారేనని తెలిసింది.

దానం నాకు సోదరుడు లాంటివారు: హోంమంత్రి సబితా

కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తనకు సోదరుడు లాంటివారని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్న దానం నాగేందర్ ఆ తర్వాత సబితా ఇంద్రా రెడ్డిపై విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించిన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భూమి వివాదంపై నివేదిక ఇవ్వాల్సిందిగా తాను నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించానని ఆమె చెప్పారు. ఆలయానికి పోలీసు భద్రత పెంచామని, ఇస్కాన్ పూజారులు తనతో భేటీ అయ్యారని, గుడిలో వేడుకలు జరుపుకునేందుకు అనుమతివ్వాలని కోరారని హోంమంత్రి పేర్కొన్నారు. గురువారం జరిగిన ఘటనపై దానం తనతో మాట్లాడారన్నారు. దానం తనకు సోదరుడి లాంటి వారని, రాజకీయాల్లోకి రాకముందే మా కుటుంబ సభ్యుల్లో ఒకడిగా దానం ఉండే వారని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

న్యూజిలాండ్‌తో స్వదేశీ గడ్డపై జరిగే టెస్టు సిరీస్‌ల్లో మొదటి రెండు టెస్టులకు సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివియస్ లక్ష్మణ్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు మ్యాచు ఈ నెల 23వ తేదీన హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ప్రారంభమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 31వ తేదీ నుంచి చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు భారత జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, అజంకియా రహనే, పియూష్ చావ్లా, విరాట్ కోహ్లీ, వివియస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, ఆర్ అశ్విన్, ప్రజ్ఞాన్ ఓజా, ఛతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.

ట్వంటీ20 ప్రపంచ కప్ కు యువరాజ్ సింగ్ ఎంపిక

క్యాన్సర్ వ్యాధి చికిత్స తరువాత యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. శ్రీలంకలో జరిగే ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలకు యువరాజ్ సింగ్‌ ఎంపికయ్యాడు. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ కు 15 మందితో కూడిన భారత జట్టుకు యువరాజ్ సింగ్‌ను బిసిసిఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువరాజ్ సింగ్ గత సంవత్సరం నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచులో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను క్రికెట్‌ క్రీడకు దూరంగానే ఉన్నాడు. హర్భజన్ సింగ్‌తో పాటు లక్ష్మీపతి బాలాజీ, పియూష్ చావ్లాలకు ట్వంటీ20 జట్టులో తిరిగి స్థానం లభించింది.   భారత జట్టు వివరాలు : ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మనోజ్ తివారీ, జహీర్ ఖాన్, అశోక్ దిండా, ఆర్ అశ్విన్, పియూష్ చావ్లా, లక్ష్మీపతి బాలాజీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ

మంత్రి పార్థసారథికి ఎదురు దెబ్బ

మంత్రి పార్థసారధి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి పార్థసారధి ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించిన రెవెన్యూ అదికారులు కేసులు లేవని అఫిడవిట్‌లో నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో మంత్రిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.   మరోవైపు ఈ అంశంపై ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్‌లాల్ మాట్లాడుతూ పార్థసారధి అఫిడవిట్ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. మంత్రిని తొలగించాలంటూ బ్యానర్లను కట్టడం సరికాదన్నారు. మంత్రి తప్పుచేస్తే చర్యలు తప్పవని భన్వర్‌లాల్ తెలిపారు. అటు పార్థసారధిని తొలగించాలంటూ విజయవాడలో వెలిసిన బ్యానర్లను పార్థసారధి అనుచరులు తొలగించారు.