ఇన్ఫోసిస్ నీలిమ మృతిపై వీడని మిస్టరి
ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ మృతిపై వివిధ కథనాలురావడంతో, డిసిపి యోగానంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతు నీలిమ మృతిపై తాము ప్రస్తుతానికి ఏ నిర్ధారణకు రాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ఆమె హ్యాండ్ బ్యాగులో చిన్న స్లిప్ దొరికిందని, అందులో ఓ అడ్రస్ ఉందని చెప్పారు. ఈ కేసులో ఆమె భర్త, తల్లితో పాటు అందరినీ విచారిస్తామని చెప్పారు.
నీలిమ మృతి చెందిన రోజు రాత్రి 8.39 నిమిషాలకు ఆఫీసులోనికి వెళ్లిందని నీలిమ కదలికలు సిసి కెమెరాలో లభ్యమయ్యాయని చెప్పారు. 10.30 గంటలకు ఓ శబ్దం రావడంతో వాచ్ మెన్ రమేష్ నీలిమ లాన్ లో పడి ఉండటాన్ని చూశాడని, ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులు ముగ్గురు ఆమెను ఆసుపత్రికి తరలించారని చెప్పారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా చెప్పారని అన్నారు.
అయితే ఆమె ఏడో అంతస్తు నుండి పడిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చామని, అక్కడ పైపులకు రక్తం మరకలు ఉన్నాయని చెప్పారు. నీలిమ లాన్ లో పడిపోవడం వల్లనే పెద్దగా గాయాలు కాలేదన్నారు. ఇన్ఫోసిస్ కంపెనీలో 14 సిసి కెమెరాలు ఉన్నాయని, ఉద్యోగులు విచారణకు సహకరిస్తున్నారని, ఈ కేసులో ఎవరైనా దోషిగా తేలితే తప్పని సరిగా పట్టుకుంటామని, కేసుని నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.