బెటాలియన్ లో పోలీసుల భార్యలు ధర్నా
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్పి) కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వారి ఆందోళన ఉధృతమైంది. ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యలను అదుపు చేయడం ఎవరి వల్లా కావడంలేదు. కానిస్టేబుళ్ల చేత పోలీస్ ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయిస్తున్నారని, ఆర్డర్లీ వ్యవస్థని కొనసాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అలాగే తమ భర్తలకు సెలవులు ఇవ్వడంలేదని, వారిని దూర ప్రాంతాలలో ఎక్కువ కాలం ఉంచి తమ కుటుంబాలకు దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానిస్టేబుళ్ల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ కొండాపూర్లోని ఎపిఎస్పి 8వ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ రోజు కూడా వారు ధర్నా చేస్తున్నారు. హాం మంత్రి సబిత వచ్చి హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని వారు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా చింతవలసలోని ఎపిఎస్పి 5వ బెటాలియన్ మెయిన్ గేటు వద్ద పోలీసుల భార్యలు, కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేటలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్పి) 13వ బెటాలియన్ వద్ద కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ధర్నా, రాస్తారోకో చేస్తున్నారు. సిఐ వెంకటేశ్వర రావు అనుచితంగా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు. డ్యూటీల పేరిట అధికారులు తమ భర్తలను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. ఆగ్రహంతో వారు జాతీయ రహదారిని దిగ్బంధించారు. 43వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డిజిపి వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారు భీహ్మించుకు కూర్చున్నారు.