ముఖ్యమంత్రి ప్రయత్నాలు ఫలించేనా
posted on Jan 29, 2014 9:06AM
మొన్నటి వరకు టీ-బిల్లు ఇక చర్చ జరగదనుకొంటున్న సమయంలో అర్ధవంతమయిన చర్చ మొదలయింది. సభ్యులందరూ బిల్లుపై, రాష్ట్ర విభజనపై తమతమ అభిప్రాయాలను చెపుతూ సజావుగా చర్చ కొనసాగిస్తున్నారు. అటువంటి సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుకి వ్యతిరేఖంగా సభలో సుదీర్ఘమయిన వాదన చేసిన తరువాత లోపభూయిష్టమయిన ఆ బిల్లుపై ఇక చర్చ అనవసరమని, అందువల్ల దానిని సభ తిరస్కరించి వెనక్కి త్రిప్పి పంపాలని కోరుతూ సభాపతి నాదెండ్ల మనోహర్ కు నోటీసు ఇచ్చారు. దానితో సభలో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి.
లోపభూయిష్టమయిన బిల్లును సభ తిరస్కరించాలని, వెనక్కి త్రిప్పి పంపాలని కోరిన ఆయనే మళ్ళీ బిల్లుపై మరింత మంది తమ అభిప్రాయాలను తెలుపవలసి ఉంది గనుక, చర్చ కొనసాగించేందుకు మూడు వారాల సమయం కోరుతూ రాష్ట్రపతికి లేఖ వ్రాయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆవిధంగా ఆయన అదనపు సమయం కోరడం చూస్తే, బిల్లుని మరింత కాలం శాసనసభలో అట్టేబెట్టి కాలయాపన చేసి సకాలంలో పార్లమెంటుకి చేరకుండా నిరోధించడానికేనని అర్ధం అవుతోంది. అంటే, ఒకవైపు వీలయితే బిల్లుని సభచేత తిరస్కరింపజేసి బిల్లుకి రాజ్యాంగపరంగా అడ్డంకులు సృష్టించడం ద్వారా లేదా అదనపు సమయం పొంది కాలయాపన చేయడం ద్వారా బిల్లు పార్లమెంటులో ప్రవేశాపెట్టబడకుండా అడ్డుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే ఆయన రెండు ప్రయత్నాలు సఫలం అవుతాయానే నమ్మకం లేదు.
సభాపతి నాదెండ్ల మనోహర్ నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో మాట్లాడుతూ సభానాయకుడుగా ముఖ్యమంత్రి కోరుతున్న విధంగా సభలో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టవలసి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. కానీ, సభలో బిల్లుపై చర్చకు తప్ప ఎటువంటి తీర్మానాలకు తాము సహకరించమని తెరాస సభ్యులు ఇప్పటికే స్పష్టం చేసారు. అందువల్ల ఈ రెండు రోజుల్లో బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం ప్రవేశపెట్టడం దాదాపు అసాధ్యమే. ప్రవేశపెట్టాలంటే ముందుగా తెలంగాణా సభ్యులందరినీ సభ నుండి సస్పెండ్ చేయవలసి ఉంటుంది. అలాచేస్తే అప్రజాస్వామికమవుతుంది గనుక, వారిని సస్పెండ్ చేయడంవీలుకాదు, అదేవిధంగా వారు సభలో ఉన్నంతసేపు బిల్లుకి వ్యతిరేకంగా ఎటువంటి తీర్మానం చేయడం కూడా వీలుకాదు.
ఇక అదనపు గడువు కోరుతూ ముఖ్యమంత్రి రాష్ట్రపతికి లేఖకు కూడా సానుకూలమయిన స్పందన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే, ‘బిల్లుని సకాలంలో పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేవలం వారం రోజులు అదనపు సమయం మాత్రమే ఇస్తున్నట్లు’ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అంటే, ఇక ఇంతకంటే అదనపు సమయం ఇవ్వడం వీలుపడదని ఆయన స్పష్టంగా ముందే సూచించినట్లయింది.
అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం కూడా సఫలం కాదని అర్ధమవుతోంది. ఇక సభాపతి తెలంగాణా సభ్యుల అభ్యంతరాలను, నినాదాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కోరిన విధంగా బిల్లుకి వ్యతిరేఖంగా సభలో తీర్మానం ప్రవేశాపెట్టడమొకటే ఇక మిగిలుంది. అదయినా సాధ్యపడుతుందని భావించలేము. అందువల్ల రేపు గడువు ముగిసిన తరువాత టీ-బిల్లు యధాతధంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ.