కాంగ్రెస్ లో కొనసాగాలా? కొత్తపార్టీ పెట్టుకోవాలా?
posted on Feb 12, 2014 6:39AM
ఇక నేడో రేపో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ సమైక్యంగా రాజినామాలు చేసి ప్రజలలోకి రానున్నారు. అయితే ఈమధ్య కాలంలో కొంత మంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తాము రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నామే తప్ప, పార్టీని కాదని గట్టిగా నొక్కి చెపుతుండటంతో వారందరూ రాజీనామాలు చేసిన తరువాత కూడా పార్టీలోనే కొనసాగుతారా? అనే అనుమానం కలుగుతోంది. కానీ, కధ ఇంతవరకు వచ్చిన తరువాత ఇంకా కాంగ్రెస్ లో కొనసాగడమూ కష్టమే కనుక వేరు కుంపటి పెట్టుకోవడం అనివార్యమనిపిస్తోంది. ఈ రెండు ఆప్షన్స్ లలో సాధ్యాసాధ్యాలను, లాభ నష్టాలను పరిశీలిస్తే ‘కొత్త కుంపటి ఆప్షనే’ సాధ్యంగా, లాభసాటిగా కనిపిస్తోంది.
సీమాంధ్ర అంతటా కాంగ్రెస్ వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో వారు ఆ పార్టీలోనే కొనసాగడం చాలా రిస్కు తీసుకోవడమే అవుతుంది. ఇంతకాలంగా తమ పార్టీ ప్రజలను మోసగించిందని వారందరూ స్వయంగా ప్రజలకు చాటింపు వేసుకొన్న తరువాత, మళ్ళీ ఇప్పుడు అదే పార్టీలో ఉన్న తమకు ఓటు వేయమని అడగడం కూడా కష్టమే. అందువల్ల కాంగ్రెస్ లో కొనసాగేందుకు చాలా బలమయిన కారణం, చాలా బలమయిన వాదన అవసరం.
వారు కాంగ్రెస్ లోనే కొనసాగాలంటే రేపు రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలోనే ఏదో ఒక వంకతో ఆమోదం పొందకుండా ఆగిపోవాలి. అప్పుడు వారందరూ రాష్ట్ర విభజన జరగకుండా బిల్లుని ఆపిన ఘనత తమదేనని చెప్పుకొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీ చేత బహిష్కరణలకు గురయ్యి, పదవులను కూడా తృణప్రాయంగా వదులుకొన్నతమకే మళ్ళీ ఓటేసి గెలిపిస్తే, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి తమ మద్దతుపైనే ప్రధానంగా ఆధారపడే తమ కాంగ్రెస్ అధిష్టానం కొమ్ములు వంచి మరీ లొంగదీసి శాశ్వితంగా రాష్ట్ర విభజనను ఆపేస్తామని హామీ ఇస్తారేమో!
ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకోవడం చాలా దురదృష్టకరమని, అందుకు తాము చాలా బాధపద్దామని ఆవేదన వ్యక్తం చేస్తూనే, దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గొప్ప లౌకికవాద పార్టీ అని అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ ఓటువేసి గెలిపించుకొని ఈ దేశాన్ని మతతత్వ బీజేపీ నుండి, నరేంద్ర మోడీ నుండి కాపాడుకోవాలని కోరవచ్చును.
తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే, తప్పకుండా తెలంగాణా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తున్న బీజేపీతో చేతులు కలుపుతున్న తేదేపాకు ఓటేస్తే, చంద్రబాబు ఎలాగు తెలంగాణా ఏర్పాటుకి అనుకూలమే గనుక, ఆ రెండు పార్టీలు కలిసి మళ్ళీ రాష్ట్ర విభజనకు పూనుకొంటే, ఇంతకాలం తాము చేసిన పోరాటం, త్యాగాలు వృధా అవుతాయని, సీమాంధ్ర ప్రజలందరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా మళ్ళీ ఉద్యమించవలసివస్తుందని చెప్పుకోవచ్చును.
అయితే, ఈ స్టోరీతో ప్రజలను నమ్మించడం, వారి ఓట్లను పొందడం చాలా కష్టం. పైగా ఈ ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక అవి ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాలని తీవ్రం కృషి చేస్తాయి గనుక, కాంగ్రెస్ పార్టీ గెలవడం కల్ల. అందువల్ల ఇప్పుడు రెండో ఆప్షనుకే మొగ్గు చూపవలసి వస్తుంది.
మూడు నెలల క్రిందటే రెండు మూడు పార్టీ పేర్లను ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషను కూడా చేయించుకొని, ముఖ్యమంత్రి కొత్తపార్టీ పెట్టబోతున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి, దానిపై నిరంతరం చర్చ జరిగేలా చేస్తూ ప్రజలలో దానిపట్ల ఆసక్తిని రేకెత్తించగలిగారు కనుక, దానిని చాలా సులువుగా ప్రజలలోకి తీసుకువెళ్ళవచ్చును. కొత్తపార్టీ పెట్టినట్లయితేనే ప్రజలలో నెలకొనిఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను తమకనుకూలంగా మలుచుకోవచ్చును. ఇంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానాని(నిర్ణయాని మాత్రమే)కి వ్యతిరేఖంగా చేసిన తమ పోరాటాలకు, చేసిన త్యాగాలను క్లెయిం చేసుకొని ప్రజల నుండి ఓట్లు రాబట్టుకోవడానికి వేరు కుంపటి పెట్టుకోవడమే మేలు.
ముఖ్యమంత్రి, ఆయన సహచరులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే (పదవీ కాలం ముగిసిపోయినందుకు కాదు సుమా!) తమ తమ పదవులకు రాజీనామాలు చేసి, కాంగ్రెస్ బోనులో నుండి సమైక్య సింహాలుగా బయటపడి, సమైక్యవాదంతో సమైక్యం కోసం సమైక్యపార్టీ పెడితే వారిని ప్రజలు నెత్తిన పెట్టుకొనే అవకాశం ఉంది. అశోక్ బాబు వంటివారు తమ ఉద్యోగులను, తద్వారా ప్రజలను ఇప్పటికే మానసికంగా సిద్దం చేసి కొత్తపార్టీకి అనువైన వాతావరణం సృష్టించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు కూడా! తాత్కాలికంగా వేరు కుంపటి పెట్టుకొని, పని పూర్తయిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసిపోయే సౌలభ్యం కూడా దీనీలో ఉంటుంది కనుక సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ లో కొనసాగి రిస్కు తీసుకోవడం అనవసరం. అందువల్ల వేరు కుంపటి పెట్టుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. మరి మన ప్రియతమ నేతలు ఈ రెంటిలో ఏ ఆప్షన్ ఎంచుకొంటారో చూద్దాము.