విభజన బిల్లుపై బెడిసికొట్టిన కాంగ్రెస్ వ్యూహం
posted on Feb 11, 2014 9:05AM
రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సంతకం చేయడంతో ఇక బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించడమే తరువాయి అనుకొంటున్న తరుణంలో కధ ఊహించని విధంగా మలుపు తిరిగింది. రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి నిరాకరించడంతో బిల్లు తిరిగి రాష్ట్రపతి వద్దకు చేరింది.
కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. అంతేగాక రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా ఒకవేళ బిల్లు ఆమోదం పొందలేకపోయినా, దానిని సజీవంగా ఉంచి ఎన్నికలలో బీజేపీ మద్దతు ఈయనందునే బిల్లుని ఆమోదించలేకపోయామని, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటువేసి గెలిపిస్తే, అధికారంలోకి రాగానే రాజ్యసభలో సజీవంగా ఉన్న బిల్లుని వెంటనే ఆమోదింపజేస్తామని ప్రజలకు నచ్చజెప్పుకొని ఓట్లు కోరవచ్చని దురాలోచన చేసింది.
కానీ, కేంద్రం దురాలోచన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభ్యంతరంతో బెడిసికొట్టింది. సంప్రదాయానికి వ్యతిరేఖంగా బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడుతున్నందున హమీద్ అన్సారీ న్యాయనిపుణుల సలహా కోరడంతో, అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని వారు తేల్చిచెప్పడంతో, ఆయన బిల్లుని కేంద్రానికి త్రిప్పి పంపేసారు.
ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెడతామని ప్రకటించేసిన కేంద్రప్రభుత్వం తన ఎత్తు బెడిసికొట్టడంతో కంగుతింది. అందువల్ల రాజ్యసభలో బిల్లుని ప్రవేశపెట్టేందుకు ఇంకేమయినా అవకాశాలున్నాయో లేదో తెలుసుకొనేందుకు న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తున్నారు. అలాగ వీలుకాకపోయినట్లయితే బిల్లుని లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకొని చర్చించుకొంటున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమికి లోక్ సభలో తనకు తగినంత సభ్యుల బలం కాగితాలమీద కనిపిస్తున్నపటికీ, బిల్లును ఓటింగుకి పెడితే వారిలో ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారో తెలియదు. ఇదే అదునుగా బీజేపీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు బిల్లుపై చర్చకు పట్టుబట్టవచ్చును. అదే జరిగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. బిల్లు ఆమోదం పొందకుండా మురిగిపోతుంది. ఇది కేవలం కాంగ్రెస్ అధిష్టానం స్వయంకృతాపరాధమే అవుతుంది.