కత్తి మీద సాములా మారిన తెలంగాణా బిల్లు
posted on Feb 4, 2014 @ 2:42PM
రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకోవడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇక తాడోపేడో తేల్చుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం, తెరాస ఒకవైపు రాష్ట్రంలో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు మరోవైపు నిలిచి తెలంగాణా బిల్లుపై అంతిమ పోరాటం మొదలుపెట్టాయి. ఇంతవరకు బిల్లుకి మద్దతు ఇస్తానని చెపుతున్న బీజేపీ కూడా సమయం దగ్గిర పడేకొద్దీ బిల్లుకి వ్యతిరేఖంగా మాట్లాడుతోంది. కాంగ్రెస్ పార్టీకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ కూడా బిల్లుని వ్యతిరేఖిస్తుండటం కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది.
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరపున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు లాబీయింగ్ వలన ఇంకా ఎంతమంది చివరి నిమిషంలో బిల్లుకి వ్యతిరేఖంగా మారుతారో తెలియదు. రాష్ట్ర విభజనకు న్యాయ, రాజ్యాంగపరంగా ఉన్నచిక్కులకు తోడు ఇప్పుడు ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా కూడా ఆటంకం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ మూడు రోజుల్లోనే తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా మొత్తం 8 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటన్నిటిపై కోర్టు ఈ శుక్రవారంనాడు విచారణ చెప్పట్టబోతోంది. ఒకవేళ కోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోన్నట్లయితే ఇక బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం కూడా కష్టమవవచ్చును.
బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి శాసనసభ చేత చేయించిన తీర్మానం పసలేనిదని, దానివల్ల బిల్లుపై ఎటువంటి ప్రభావం పడబోదని చెప్పిన దిగ్విజయ్ సింగ్, అదే బిల్లుని ఎటువంటి సవరణలు చేయకుండా నేరుగా రాష్ట్రపతికి పంపే సాహసం కూడా చేయలేకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి మరియు జీ.ఓ.యం. సభ్యుడు అయిన జైరాం రమేష్ రాష్ట్ర శాసనసభకు పంపిన ముసాయిదా బిల్లుకి, పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లుకి ఏమీ తేడా లేదని చెప్పినప్పటికీ, ఈరోజు సమావేశమవుతున్న కేంద్రమంత్రుల బృందం (జీ.ఓ.యం.) తను స్వయంగా తయారు చేసి శాసనసభకు పంపిన బిల్లుకి అనేక సవరణలు చేసి ఆమోదించడం చూస్తే, ఆ ముసాయిదా బిల్లుని ఎంత లోపభూయిష్టంగా తయారు చేసి పంపిందో అర్ధమవుతోంది. రాష్ట్రశాసనసభ తిరస్కరించిన ఆ బిల్లుకి రిపేర్లు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టి మమ అనిపించేయాలని కేంద్రం ఆరాటపడుతోంది. దానికి జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలని టీ-కాంగ్రెస్ నేతలు మరియు కేసీఆర్ సమిష్టిగా కృషిచేస్తున్నారు.
వీటన్నిటికీ తోడు బిల్లుపై ప్రభావం చూపే మరో అంశం కూడా ఉంది. ఎన్నికల తరువాత ఏ కూటమి అధికారంలోకి వస్తుంది? దేనితో జత కట్టాలి?వంటి అంశాలు కూడా ఉత్తరభారతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చును. ఎన్నికల తరువాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావచ్చని ఆ పార్టీలు భావిస్తే అధికారమే పరమావధిగా రాజకీయాలు చేసే సదరు పార్టీల నేతలు బీజీపీ వైఖరికి అనుగుణంగా వ్యవహరించవచ్చును. ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అవి కూడా అదేవిధంగా వ్యవహరించి బీజేపీని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. అందువల్ల చివరి నిమిషం వరకు బిల్లుకి ఎక్కడ ఏవిధంగా ఆటంకం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. కనీసం బిల్లుని ప్రవేశపెట్టలనుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలియదు. కానీ, ఇక చేయగలిగేదేమీ లేక మొండిగా ముందుకే నడిచేందుకు సిద్దమవుతోంది. ఏ కారణం చేతయినా పార్లమెంటులో బిల్లు ప్రవేశట్టలేకపోయినా, పెట్టి ఆమోదించలేకపోయినా కాంగ్రెస్ పని వ్రతం చెడినా ఫలితం దక్కనట్లు, రెంటికీ చెడిన రేవడిలా అవుతుంది.