లాస్ట్ బాల్ తో యూపీయే ప్రభుత్వం పడిపోనుందా
posted on Feb 14, 2014 7:02AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పిన ‘లాస్ట్ బాల్స్’ ని విభజన బిల్లుని ఆపే అస్త్రాలుగా భావించవచ్చును. ఏవిధంగా అంటే, ఉభయ సభలలో ఉన్న మొత్తం 25మంది సీమాంధ్ర యంపీలలో నిన్నకొందరు మాత్రమే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళగా మిగిలిన 11 మంది సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు వెనక్కి తగ్గి సస్పెండ్ వేటు తప్పించుకొన్నారు. సోమవారంనాడు లోక్ సభ మళ్ళీ సమావేశమయినప్పుడు వారందరూ సభ జరగకుండా అడ్డుపడటం ఖాయం.
యూపీయే ప్రభుత్వం ఇటీవల సభలో ప్రవేశపెట్టిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ను తప్పనిసరిగా సభచేత ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఆమోదింపజేసుకోలేకపోయినట్లయితే, యూపీఏ ప్రభుత్వం పడిపోతుంది. అందువల్ల సోమ, మంగళవారం రోజులలో ఎట్టిపరిస్థితుల్లో బడ్జెట్ ఆమోదింపజేయవలసి ఉంటుంది. కానీ, మిగిలిన సీమాంధ్ర మంత్రులు, యంపీలు సభలో చెప్పట్టే అందోళనల వలన సభ వాయిదాలు పడుతుంటే ఆ బిల్లు ఆమోదం పొందడం కష్టమవుతుంది. విభజన బిల్లుకి వ్యతిరేఖంగా సభలో ఇంత రాద్దాంతం జరిగినా మొండిగా దానిని సభలో ప్రవేశపెట్టడానికే కాంగ్రెస్ అధిష్టానం తన 14మంది యంపీలను సస్పెండ్ చేసుకోవలసి వచ్చిందని ప్రతిపక్షాలు, యావత్ మీడియా కూడా విమర్శలు గుప్పిస్తుంటే, ఇప్పుడు మిగిలిన వారిని కూడా సభ నుండి సస్పెండ్ చేసే దైర్యం చేయకపోవచ్చును. సభ జరగకుండా మళ్ళీ వాయిదాలు పడితే బడ్జెట్ ఆమోదం పొందం కష్టం. బడ్జెట్ ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం కనుక ఏదోవిధంగా సభ నిర్వహించి ఓట్-ఆన్-అకౌంట్ బిల్లుని తప్పనిసరిగా ఆమోదింపజేసుకోవలసి ఉంటుంది.
ఒకవేళ దాన్ని ఆమోదింపజేసుకొన్నా, సభ వాయిదాలు పడుతుంటే మిగిలిన మూడు రోజులలో విభజన బిల్లుపై చర్చ, ఓటింగు జరిగే అవకాశం కూడా క్రమంగా కుచించుకు పోతుంది. బిల్లుని, బిల్లు ప్రవేశపెట్టిన తీరుని తీవ్రంగా ఆక్షేపిస్తున్న బీజేపీ మరియు ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడం ఖాయం. అవి చర్చ జరగాలని కోరితే దానిని స్పీకర్ తిరస్కరించలేరు. గనుక మిగిలిన రెండు మూడు రోజుల సమయంలో విభజన బిల్లుపై చర్చలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలతో బిల్లు ఆమోదం పొందకుండానే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోవచ్చును.
అందుకే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ నిన్న మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా బిల్లు ఆమోదం పొందుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేసారు. కానీ, దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఇరువురూ కూడా బీజేపీ మద్దతు ఈయకపోయినా సరే ఈ బిల్లుని ఎట్టిపరిస్థితుల్లో ఆమోదింపజేస్తామని గట్టిగా చెపుతున్నారు. అంటే మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేయడానికి సిద్దమవుతున్నట్లు భావించవలసి ఉంటుంది.
అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు ఇంకా లాస్ట్ బాల్స్ మిగిలే ఉన్నాయని ఒప్పుకోక తప్పదు మరి. కానీ ఆ లాస్ట్ బాల్ కాంగ్రెస్ అధిష్టానమే వేయబోతోందా? లేక సీమాంధ్ర నేతలతో కిరణ్ కుమార్ రెడ్డే వేయించి యూపీయే ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారా? అనేది మాత్రమే తేలవలసి ఉంది.ఏమయినప్పటికీ ఈ 'లాస్ట్ బాల్' రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.