కాంగ్రెస్ భస్మాసుర హస్తం తన నెత్తినే పెట్టుకోబోతోందా?
posted on Feb 10, 2014 8:22AM
తాజా సమాచారం ప్రకారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న రాత్రి రాష్ట్ర విభజన బిల్లుపై సంతకం చేసినందున, కేంద్రం ఈరోజే ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది. ఎన్నికలు తరువాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించేవరకు ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల నిమిత్తం తాత్కాలిక ఏర్పాటుగా ఈ సమావేశాలలోనే ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయవలసి ఉంటుంది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ పార్లమెంటు సమావేశాలలో కీలకమయిన ఈ రెండు బిల్లులతో బాటు మరో 38 ఇతర బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టాలనుకోవడం చూస్తే, కీలకమయిన రాష్ట్ర విభజన బిల్లుపై ఉభయ సభలలో ఎటువంటి చర్చ జరగకుండా ఆమోదింపజేసుకోనేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు కనబడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తన పంతం నేరవేర్చుకోనేందుకు కోట్లాది తెలుగు ప్రజల భవితవ్యం నిర్దేశించే బిల్లుపై చర్చించకుండానే ఇంత తక్కువ వ్యవధిలో ఆమోదింపజేసుకోవాలనుకోవడం చాలా దురదృష్టకరం.
అయితే, సభలో బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా తెలంగాణాలో ఆ పార్టీ భవితవ్యం ఇప్పుడు తన చేతుల్లో కాక తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు చేతులో ఉందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒకవేళ ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం లేదా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు అంగీకరించకపోతే, తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చును. అయితే రానున్న ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితిలో, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆ పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది గనుక, ఆయన ఎట్టి పరిస్థితుల్లో విలీనానికి అంగీకరించకపోవచ్చును. ఇక, ఈ ఎన్నికలలో తెలంగాణాలో తెరాస పూర్తి ఆధిక్యత పొందవచ్చని సర్వే రిపోర్ట్స్ ఘోషిస్తున్న ఈ తరుణంలో, కాంగ్రెస్ పార్టీకి తన విజయంలో భాగం పంచి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరిస్తారని ఊహించలేము.
అయితే ఇంతవరకు వచ్చిన తరువాత తెరాస కాంగ్రెస్ లో విలీనం అయినా అవకున్నా, పొత్తులకు అంగీకరించినా అంగీకరించక పోయినా తెలంగాణా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ముందుకే వెళ్ళవలసిన పరిస్థితి చేజేతులా కల్పించుకొంది. బీజేపీ, సమాజ్ వాదీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, అన్నాడీఎంకే తదితర పార్టీలు తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయబోవని ఇప్పటికే దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బహుశః అందుకేనెమో కాంగ్రెస్ పార్టీ తనకు తగినంత బలం ఉన్న లోక్ సభను కాదని తనకు బలంలేని రాజ్యసభలో ముందుగా బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దపడుతోంది. ఒకవేళ రాజ్యసభలో బిల్లు ఓడిపోతే ఆ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టి, తను తెలివిగా బయటపడేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎత్తు వేస్తోందేమో!
కానీ, ఆవిధంగా చేసి కాంగ్రెస్ నెపం ప్రతిపక్షాల మీదకు నెట్టివేయగలదేమో కానీ ఎన్నికలలో తెలంగాణాలో ఎట్టిపరిస్థితుల్లో గెలవలేదు. పైగా పార్లమెంటులో బిల్లుని ఆమోదింపజేయలేని కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ ఎన్నికల పొత్తులు పెట్టుకొంటారని ఆశించడం అడియాసే అవుతుంది. ఆయన టీ-కాంగ్రెస్ నేతలను ఎన్నికలలో ఎండగట్టకుండా వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీకి అదే పదివేలు అని సంతోషపడవలసి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోబోతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణాలో కూడా తుడిచిపెట్టుకొని పోయే పరిస్థితి కనిపిస్తోంది.
చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా నిలచి ఆదుకొన్న తెలుగు ప్రజలకు కృతజ్ఞత చూపకపోగా తనకు అధికారం వరంగా ఇచ్చిన వారి నెత్తినే తన భస్మాసుర హస్తం పెట్టాలని చూస్తోంది. కానీ, ఆ పురాణ కధలో జరిగినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తినే పెట్టుకొంటోందని స్పష్టమవుతోంది. దేశంలో వీస్తున్న మోడీ గాలులకు తోడు, ఈ రాష్ట్రవిభజన అంశంతో జాతీయ స్థాయిలో తీరని అప్రదిష్ట మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ బహుశః కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమేనేమో!