బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు!
posted on Feb 5, 2014 @ 11:37AM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ “బీజేపీ గనుక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముందుకు వస్తే, ఎన్నికల తరువాత దానికి మా పార్టీ మద్దతు ఇస్తుంది.” అని అన్నారు. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే షరతుపైనే జైలు నుండి విడుదల చేయబడ్డాడని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటే, ఇప్పుడు ఆయన బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. వారి ఆరోపణలు అసత్యమని భావించినప్పటికీ, బీజేపీ ప్రస్తుతం తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసినా, తాము అధికారంలోకి వస్తే ఇరుప్రాంతాలకి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేస్తామని ముందే చెపుతున్నపుడు, రాష్ట్రాన్ని శాశ్వితంగా సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి మద్దతు ఇస్తానని ఏవిధంగా హామీ ఇస్తున్నారు? ఒకవేళ ఆయన కోరినట్లే బీజేపీ బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేసినట్లయితే, ఎన్నికల తరువాత రాష్ట్ర విభజన చేయాలనుకొంటున్న ఆ పార్టీకి ఆయన మద్దతు ఇస్తారో ఇవ్వరో అనే సంగతి కూడా ఆయన ఇప్పుడే చెప్పగలిగితే, అయన హామీలో నిజాయితీ ఎంతో తెలుస్తుంది.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా తెలంగాణా ఏర్పాటుకి కట్టుబడి ఉన్నాయని ఆయనకీ తెలుసు. మరి అటువంటప్పుడు ఈవిధంగా హామీ ఇవ్వడం చూస్తే ఆయన అటు బీజేపీని, ఇటు సీమాంధ్ర ప్రజలని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
నిజానికి వైకాపా ఎప్పుడయితే తెలంగాణా వదులుకొని బయటపడిందో అప్పుడే అది మానసికంగా రాష్ట్ర విభజనకు అంగీకరించి సిద్దమయిందని అందరికీ తెలుసు. ఆపార్టీ చేస్తున్న సమైక్యవాదమంతా సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించి, జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికను నేరవేర్చుకోవడానికే తప్ప నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కాదని అందరికీ తెలుసు. తన తెలంగాణా శాఖను పణంగా పెట్టి మరీ వైకాపా చేస్తున్నసమైక్యాంధ్ర పోరాటం యొక్క పూర్తి ఫలితం పొందాలంటే, ఎన్నికలలోగా ఖచ్చితంగా రాష్ట్ర విభజన జరిగితేనే సాధ్యం. తెలంగాణా ఏర్పాటునే పూర్తిగా వ్యతిరేఖిస్తూ సమైక్యాంధ్ర పోరాటం చేస్తున్న వైకాపాకు తెలంగాణాలో అడుగిడే పరిస్థితే లేదు. అటువంటప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని పోరాడవలసిన అవసరమే ఆపార్టీకి లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకు సహకరిస్తే బీజేపీకి మద్దతు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు! గతంలో ఆయన, ఆయన తల్లి విజయమ్మ, షర్మిల ముగ్గురూ కూడా వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు హటాత్తుగా మనసు మార్చుకొని బీజేపీకి మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు. ఆయన ఆలోచనలలో ఎంత అపరిపక్వత, అస్పష్టత ఉందో ఇది తెలియజేస్తోంది.
రానున్న ఎన్నికలలో మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి గనుక, తన సీబీఐ కేసుల నుండి విముక్తి పొందేందుకే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇస్తే అది నమ్మశక్యంగా ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇస్తానని చెప్పడం మాత్రం అందరినీ మభ్యపెట్టడమే అవుతుంది.