అశోక్ బాబు ఉద్యమాలు దేనికోసం చేస్తున్నట్లు?
posted on Feb 8, 2014 8:45AM
ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన వార్ రూమ్ సమావేశంలో సీమాంధ్ర యంపీలు మంత్రులు రాష్ట్ర విభజన పట్ల తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. వారితో జీ.ఓ.యం. చర్చల పేరిట రెండు రోజులు కాలక్షేపం చేసి, వారి డిమాండ్లకు తలొగ్గబోతున్నట్లు మీడియాకు లీకేజీలు ఇచ్చింది. కానీ చివరికి వారికీ హ్యాండ్ ఇచ్చింది. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అందునా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహా కాంగ్రెస్ నేతలందరినీ వెంటబెట్టుకొని రాష్ట్ర విభజనకు నిరసనగా డిల్లీలో మౌనదీక్ష చేసారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అదేమి పట్టించుకోకుండా నిన్న విభజన బిల్లుని క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.
రాష్ట్ర శాసనసభకు పంపిన ముసాయిదా బిల్లుని పార్లమెంటులో యదాతధంగా పంపినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన సవాలుని కూడా స్వీకరిస్తున్నట్లు, అదే బిల్లుని యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్రం నిన్న ప్రకటించింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం చేయకపోయినా, నేడో రేపో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వేటు వేసి బయటకి సాగనంపగానే, కొత్త పార్టీతో ప్రజలలోకి వెళ్ళడం మాత్రం దాదాపు ఖాయమేనని చెప్పవచ్చును.
ఆయన కనుసన్నలలో నడుస్తున్న ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించిన కార్యాచరణ కూడా అందుకు రంగం సిద్దం చేస్తున్నట్లుంది. ముఖ్యమంత్రి వర్గానికి అవసరమయినప్పుడు, అవసరమయిన విధంగా ఉద్యమాలు చేస్తూ, ముఖ్యమంత్రి యొక్క విరోధులను ఎండగడుతూ అశోక బాబు ఆయనకి సహకరిస్తున్నారు. రాజకీయాలలోకి రావాలనే ఆకాంక్ష వెలిబుచ్చిన ఆయన, స్వయంగా కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రిని ఆయన సహచరులను అందులోకి ఆహ్వానించవచ్చును. లేదా ఆయనే ముఖ్యమంత్రి లేదా ఆయన సహచరులో పెట్టబోయే కొత్త పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుత రాజకీయ అనిశ్చిత పరిస్థితులను చూసి ఒకవేళ ఆయన వెనకడుగు వేసినప్పటికీ, ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ఇవ్వడం మాత్రం ఖాయం. అందువల్ల అశోక్ బాబు తన ఉద్యమాలతో రాష్ట్ర విభజనను ఆపలేకపోయినా ముఖ్యమంత్రి లేదా తానో లేదా మరొకరో స్థాపించబోయే కొత్త పార్టీకి అనువయిన వాతావరణం మాత్రం సిద్దం చేయగలరని చెప్పవచ్చును.
బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే రేపు 10వ తేదీ నుండి ఉద్యమం మరింత తీవ్రతరం చేసి, 17,18 తేదీలలో ఛలోడిల్లీ కార్యక్రమం చేప్పట్టి డిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన ప్రకటించారు. జాతీయ పార్టీ నేతలందరినీ మరో మారు కలిసి పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయమని కోరుతామని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి తదితర ప్రతి పక్షపార్టీల నేతలు జాతీయ పార్టీల నేతలను కలిసి బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయమని విజ్ఞప్తి చేసారు. వారిలో కొందరు అందుకు అంగీకరించారు. మరి కొందరు తమ పార్టీలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని తేల్చి చెప్పారు. మరి అటువంటప్పుడు అశోక్ బాబు వారిని కలిసి కొత్తగా చెప్పేదేముంటుంది? కోరేదేముంటుంది?
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పదవులను కాపాడుకోవడానికి రాష్ట్ర విభజనలో తమ అధిష్టానానికి సహకరిస్తుంటే, వారికి అశోక్ బాబు సహకరిస్తున్నారు. రాజకీయనాయకులు టికెట్లు, పదవుల కోసం ఎంతకయినా దిగజారగలరని కళ్ళెదుట జరుగుతున్న పరిణామాలు అద్దం పడుతున్నాయి. అటువంటి వారికి సహకరించేందుకు అశోక్ బాబు వంటి ఉద్యోగసంఘ నేతలు ఉద్యోగులను మళ్ళీ ఉద్యమాల బాట పట్టించాలనుకోవడం చాలా దారుణం.