బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేసి పంపినట్లయితే
posted on Jan 26, 2014 @ 8:34PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లుని తిరస్కరిస్తూ దానిని వెనక్కి త్రిప్పిపంపాలని రూల్.77 క్రింద సభాపతి నాదెండ్ల మనోహర్ కు నోటీసు అందజేశారు. రేపు బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయ్యి దీనిపై ఒక నిర్ణయం తీసుకొనవచ్చును.
ఒకవేళ శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి సీమాంధ్ర శాసనసభ్యులందరూ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించి రాష్ట్రపతికి పంపగలిగినట్లయితే, గతంలోనే కొంతమంది బిల్లుపై సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసినందున, ఇప్పుడు ఆయన శాసనసభ అభ్యంతరాలను పట్టించుకోకుండా, సభ చేత తిరస్కరింపబడిన బిల్లుపై ఆమోదముద్ర వేసినట్లయితే, న్యాయపరమయిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గనుక బిల్లుపై రాష్ట్ర శాసనసభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రాన్నిపూర్తి వివరాలు, సంజాయిషీ కోరవచ్చును. లేదా పూర్తి వివరాలతో కూడిన బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపమని కేంద్రాన్నిఆదేశించవచ్చును.
రాజ్యాంగం ప్రకారం నడుచుకొనే రాష్ట్రపతి శాసనసభ అభ్యంతరాలను పట్టించుకోకుండా, సభ చేత తిరస్కరింపబడిన బిల్లుపై ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపుతారని భావించలేము. తెలంగాణా బిల్లుపై రాష్ట్ర శాసనసభ ఎటువంటి అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఎటువంటి సమస్య ఉండబోదని దిగ్విజయ్ సింగ్ శలవిస్తున్నపటికీ, అటువంటి బిల్లుని రాష్ట్రపతి నిరభ్యంతరంగా ఆమోదిస్తారని కానీ, దానికి పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇస్తుందని గానీ నమ్మకం లేదు. ఈలోగా బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు పడితే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చేపార్లమెంటు సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. తెలంగాణా ఏర్పాటు కూడా అసంభవమే అవుతుంది. అందువల్ల శాసనసభలో తెలంగాణా సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం ప్రవేశపెట్టనీయకుండా గట్టిగా అడ్డుకోవచ్చును, ఆ ప్రయత్నంలో వారు సభలో ఆందోళన చేసి సభను స్తంభింపజేయవవచ్చును.
సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులలో బొత్ససత్యనారాయణ వంటి అధిష్టానానికి విదేయులయినవారు కూడా టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఓటువేస్తామని మొదటి నుండి చెపుతున్నపటికీ, ఎంతమంది ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారనేది సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే తేలుతుంది. ఇక మొదటి నుండి బిల్లుపై ఓటింగుకి పట్టుబడుతున్నవైకాపా సభ్యులు, ముఖ్యమంత్రిని సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్య ఛాంపియన్ గా అవతరింపజేసే ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారో లేదో? అనుమానమే.
ఈ లెక్కలన్నీ సరిచూసుకొని సభలో ఆంధ్ర-తెలంగాణా సభ్యుల బలాబలాలు సరిసమానమయ్యేట్లు ఉంటే, తెలంగాణా శాసనసభ్యులు కూడా ఈ తీర్మానం సభలో ప్రవేశపెట్టడానికి అంగీకరించవచ్చును. సభలో బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా సగం సగం మంది ఓటు వేసినట్లయితే, రాష్ట్రపతి కూడా నిరభ్యంతరంగా బిల్లుపై అమోధముద్ర వేసి కేంద్రానికి పంపేయవచ్చును. ఆ తరువాత బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా? అనేది కేంద్రం సమస్య తప్ప దానితో రాష్ట్రపతికి ఎటువంటి సంబంధం ఉండదు.
కానీ సభలో తీర్మానం పెట్టడం జరిగితే, సీమాంధ్ర నేతలందరూ బిల్లుని వ్యతిరేఖిస్తూ ఓటువేసే అవకాశాలే ఎక్కువ గనుక, బహుశః రేపటి నుండి గడువు పూర్తయ్యేవరకు శాసనసభలో బిల్లుపై ఎటువంటి చర్చ జరుగనీయకుండా తెలంగాణా సభ్యులందరూ అడ్డుపడవచ్చును. వారినందరినీ సభ నుండి సస్పెండ్ చేసి మిగిలినవారు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపితే, ఆ తీర్మానానికి రాష్ట్రపతి విలువీయకుండా బిల్లును యధాతధంగా కేంద్రానికి పంపేసే అవకాశం ఉంది. గనుక, సభాపతి తెలంగాణా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయకపోవచ్చును. అంటే రేపటి నుండి గడువు పూర్తయ్యేవరకు ఇక సభలో రచ్చరచ్చే! తెలంగాణా సభ్యులందరూ కలిసి బిల్లుపై చర్చ ముగిసినట్లు సభలో రేపు ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం.
కేంద్రం రాష్ట్ర విభజన అంశం భుజానకెత్తుకొన్నపటినుండి నేటి వరకు కూడా ప్రతీ దశలో కూడా చాలా సందేహాత్మకంగా సస్పెన్స్ తోనే కొనసాగుతూ ఇంతవరకు వచ్చింది. బహుశః ఈ అనుమానాలు, ఊహాగానాలు, సస్పెన్స్ అన్నీ కూడా కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఓటింగ్ జరిగేవరకు కూడా తప్పకపోవచ్చును.